తెలంగాణ బీసీ స్వీయ రాజకీయ అస్తిత్వం రాజకీయ ప్రక్రియ రూపం సంతరించుకున్నది. అది మహత్తర ఉద్యమమై తెలంగాణ నేలపై విజృంభించబోతున్నది. మునుపెన్నడూ లేనివిధంగా బీసీలలో పెల్లుబుకుతున్న నిరసనలు కార్యరూపంగా మారి బలమైన ఉద్యమంగా ముందుకు సాగేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఉద్యమాన్ని బీఆర్ఎస్ తన భుజాల మీద వేసుకొని సాగేందుకు నిర్మాణాత్మక రూపాన్ని రచిస్తున్నది.
రేపటి తెలంగాణలో జరుగబోయే భారీ రాజకీయ మార్పులకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టబోతున్నది. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం పరిపూర్ణం కావాలంటే బీసీ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిలపాలి. ఆ పనిని బీఆర్ఎస్ మాత్రమే చేయగలదు. స్థానిక సంస్థల్లో సమ వాటాగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఈ పని చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోకూడదు. దానికి ముందే కులగణన చేయాలి. నామమాత్రంగా చేస్తే బీసీ లు ఒప్పుకోరు. ఓటరు లిస్టు ఆధారంగా కులగణన చేసి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యం కాదు. సమగ్ర కులగణనను జరపటానికి డెడికేటెడ్ కమిషన్‌ను నియమించామని చెప్తున్న రాష్ట్ర ప్రభు త్వం ఆ పని యుద్ధ ప్రాతిపదికన జరపాలని బీసీ సామాజిక వర్గాలు చేస్తున్న డిమాండ్‌కు బీఆర్ఎస్ కొండంత అండగా నిలుస్తూ శపథం తీసుకున్నది. ఇది ఆహ్వానించదగిన పరిణామం.
2024, సెప్టెంబర్ 18న తెలంగాణ భవన్లో జరిగిన బీసీ సమావేశంలో ‘తెలంగాణ రాజకీయాలను మార్చే కీలక సమావేశంగా చరిత్రలో ఇది నిలిచిపోతుంది’ అని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓ చానల్‌కు ఇచ్చిన నాలుగున్నర గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూలో తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం అన్నది తమిళనాట స్థానికతతో నిలిచిన డీఎంకే అస్తిత్వం లాంటిదేనని కేసీఆర్ చెప్పారు. సరిగ్గా ఆ అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయ పునాదిగా చేసుకుని ముందుకు సాగే కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తున్నట్టు కేటీఆర్ కూడా బహిర్గతం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు జరిపేందుకు నవంబర్ 10 వరకు కేటీఆర్ గడువునిచ్చారు. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం సమరం కొనసాగుతుందన్న మాట.
ఈ సమావేశం ఓట్ల కోసమో, సీట్ల కోసమో, రాజకీయ పార్టీగా తమ అస్తిత్వం కోసమో జరిగింది కాదు, బీసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకే అన్నది తేటతెల్లమవుతున్నది. తరతరాలుగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి కోసం ఏం చేయాలనే దానికి సుదీర్ఘ సమాలోచనలు జరపాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా బీసీల బాధలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అట్టడుగు నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి జీవన స్థితిగతులను తెలుసుకోవాలి. అందుకు బీసీ నేతలే క్షేత్రస్థాయికి వెళ్లాలి. బీసీల విముక్తికి ఏమేం చేయాలో నివేదికలు తయారు చేయాలి.
ఒక దశలో ‘ఇది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదు. బీసీల జీవన ప్రమాణాలు పెంచేందుకు సరైన పరిష్కార మార్గాలను తవ్వితీసే పరిశోధన కేంద్రంగా తెలంగాణ భవన్‌ను సిద్ధం చేసే ప్రక్రియ’ అని కేటీఆర్ పేర్కొన్నారు. అంటే, బీసీలు ఓట్లేసే యంత్రాలు కాదని, తెలంగాణ సమాజాన్ని నడిపించే ఉత్పత్తి శక్తులని, వారి అభివృద్ధి జరగకుండా తెలంగాణ అభివృద్ధి జరగదని బీఆర్ఎస్ విశ్వసించే కార్యక్షేత్రంలోకి దూకుతున్నదనే విషయం స్పష్టమవుతున్నది.
కులగణనతో బీసీ వర్గాలకు సామాజిక న్యాయం జరగాలంటే తమిళనాడులో అంబాశంకర్ కమిషన్, జస్టిస్ తిరు ఎంఎస్ జనార్ధనమ్ చేసిన సర్వేలాగా లోతుగా అధ్యయనం చేయాలి. పంచాయతీ ఎన్నికలను జరిపించేందుకు హడావుడిగా బీసీ కులగణన చేయకుండా భవిష్యత్తులో కోర్టుల్లో నిలిచి, గెలిచేలా సమగ్ర కులగణన చేయవలసిన అవసరం ఉన్నది.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఆ హామీ నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పోరుబాట కొనసాగుతూనే ఉంటుంది. బీసీ రిజర్వేష న్ల చట్టబద్ధతకు సంబంధించిన ఇప్పటివరకు వెలువడిన న్యాయస్థానాల తీర్పులను తెలంగాణ సమాజం ముందు పెట్టేందుకు బీఆర్ఎస్ పరిశోధిస్తున్నది. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని అనేక తీర్పుల్లో ఉన్నది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పరిశోధన ఉపయోగపడనున్నది. 1959లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పటి నుంచి బీసీలు వెనుకబడిపోయారు. బీఆర్ఎస్ ఈ లెక్కలన్నీ బయటకుతీసే పనికి పూనుకున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు 90 శాతంగా ఉన్న రాష్ట్రంలో వారి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు, సీట్లు దక్కాలి. దాన్ని చట్టబద్ధంగా అమలు చేయడం సాధ్యం కాదు. కోర్టు తీర్పులు అందుకు అడ్డువస్తాయి. దీనికోసం రాజ్యాంగ సవరణ చేయక తప్పదు. రాష్ట్రంలో 12,966 గ్రామ పంచాయతీలుంటే అందులో 1,14,620 వార్డులున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 868 పంచాయతీలుండగా, మేడ్చల్ జిల్లాలో తక్కువ సంఖ్యలో పం చాయతీలున్నాయి.
అదే విధంగా చూస్తే నల్గొండ జిల్లాలో 7,842 వార్డులుండగా, మేడ్చల్‌లో అతి తక్కువ వార్డులున్నాయి. స్థానికసంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరా రు ప్రభుత్వ పరిధిలో ఉన్నదని చెప్తున్నప్పటికీ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 50 శాతం రిజర్వేషన్లు దాటకుండా చూడాలి. ఒకవేళ క్షేత్రస్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభాను బట్టి రిజర్వేషన్లు ఇవ్వాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా సర్వే చేసి ఖరారు చేయాలి. అది పంచాయతీ యూనిట్‌గా జరగాలి. చివరగా సుప్రీం మార్గదర్శకాలు అతిక్రమించకుండా చూసుకోవాలి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ బీసీలను కలుపుకుపోయే గురుతర బాధ్యతను భుజాలపై వేసుకొని ముందు కు సాగుతున్నది. ఇందుకు క్షేత్రస్థాయిలో బీసీలను సన్నద్ధం చేస్తున్నది.
ఈ విషయమై బీసీ వర్గాల ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలి. 42 శాతం ఇస్తామని ఏ విధంగా బీసీ డిక్లరేషన్ ఇచ్చి కాంగ్రెస్ ఓట్లడిగిందో, ఆ విధంగా అమలు చేసి చూపాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలు కోసం ముందుండి పోరు సలుపుతున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వెంటే ప్రతి బీసీ బిడ్డ నడవాల్సిన సమయం ఇది.
(వ్యాసకర్త: తెలంగాణ తొలి బీసీ కమిషన్ సభ్యులు)
జూలూరు గౌరీ శంకర్