‘వందేహం, మదురుం, శాంతం/ కాషాయాంబర శోభితం స్వాతంత్య్రసరోల్లాసం/ రామానం దాఖ నాయకం…’ అని కళాప్రపూర్ణ డాక్టర్ దాశరథి అన్నారు. ఆయన చెప్పినట్టు.. హైదరాబాద్ స్టేట్ ప్రజలకు రాచరికం నుంచి విలీనం/ విముక్తి కలిగించిన వ్యక్తి స్వామి రామానంద తీర్థ.
బ్రిటిష్ ప్రభుత్వం 1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతం త్య్రం ప్రకటించింది. అయితే, హైదరాబాద్ సంస్థానం మాత్రం భారతదేశంలో కలవడానికి నిరాకరించింది. అప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని అసఫ్ జాహీ వంశపు 7వ రాజైన ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్’ పరిపాలిస్తున్న రోజులు. యావత్ భారతంలో తమ అధికారాన్ని వదులుకొని బ్రిటిష్ ప్రభుత్వం నిష్క్రమిస్తుండగా,
అఖండ దేశంలోని చిన్న భాగంలో ఫ్యూడల్ నిరంకుశ పాలన ఉండటం చూడలేమని స్వామి రామానంద తీర్థ హెచ్చరించారు. అంతేకాదు, 1946, జూలై 3న ‘భారతదేశంలో రాజకీయ విప్లవం వస్తున్న తరుణంలో హైదరాబాద్ సంస్థానం దీని నుంచి తప్పుకోజాలదు’ అంటూ ప్రభుత్వానికి ధిక్కార స్వరం వినిపించారు. స్వామిజీ ఇచ్చిన ఈ నినాదానికి ప్రభావితులైన అనేకమంది యువతీయువకులు ‘వందేమాతరం’ అంటూ హైదరాబాద్ సంస్థాన విలీన/ విమోచన సంగ్రామంలో దూకారు.
సంస్థానంలో నానాటికీ విషమించిపోతున్న పరిస్థితుల నుంచి కవులు, కళాకారులు, సామాన్యులు, మహిళలు, సమస్త ప్రజలకు విముక్తి కలిగించే ఏకైక ఆశాదీపం స్వామి రామానంద తీర్థ. ఆయన శిష్యరికంలో జాతీయ ఉద్యమ ప్రభావం వల్ల మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో పాటు ఇతర ప్రముఖులు ‘వందేమాతరం’ అంటూ నినదించారు. ఈ ఉద్యమం ఔరంగాబాద్, వరంగల్, గుల్బర్గా, నాందేడ్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ మార్మోగింది. సంస్థానంలో ప్రతి తాలూకాలో, పట్టణంలో సత్యాగ్రహాలు పుంజుకున్నాయి. జాతీయ పతాకం ఎగురవేసినందుకు పద్మజానాయుడిని అరెస్టు చేశారు.
దేశభక్తుడు పండిట్ నరేంద్ర, బూర్గుల రామకృష్ణారావు, జి.రామాచారి, గణపతిరావు, జ్ఞానకుమారి హెగ్డే, వందేమాతరం రామచంద్రరావు, కాటం లక్ష్మీనారాయణ, వట్టికోట ఆళ్వారు, బిర్దీచంద్ చౌదరీ, జీఎస్ మెల్కొటే, కాళోజీ నారాయణరావు, ఎం.ఎస్ రాజలింగం, దామోదర్ పాంగ్రేకర్, డి.బిందూ, జమలాపురం కేశవరావు, కొండా లక్ష్మణ్‌బాపూజీ లాంటి అనేకమంది నాయకులను జైళ్లలో బంధించారు. 1947 ఆగస్టు 7న త్రివర్ణ పతాకాన్ని చేతబూని, ‘ఇండియా యూనియన్‌లో హైదరాబాద్ కలవాల’ంటూ సుల్తాన్ బజార్లో సత్యాగ్రహం ప్రారంభించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి వరంగల్ జైలుకు పంపారు. సుప్రసిద్ధ కవి దాశరథి , ఇటిక్యాల మధుసూదన్‌రావు లాంటివారితో జైళ్లను నింపేశారు.
ఈ నేపథ్యంలో స్వామిజీ ఢిల్లీకి వెళ్లి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్, నెహ్రూలను కలిశారు. హైదరాబాద్ సంస్థాన స్థితిగతులను, ఖాసీం రజ్వీ జరుపుతున్న దురాగతాలను వారిముందు ఏకరువు పెట్టారు. రజాకార్ల నిషేధానికి శాంతిభద్రతల దృష్ట్యా బొల్లారంలో భారత సైన్యాన్ని దించుతామని 1948 ఆగస్టు 31న అప్పటి ఇండియా గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి తెలిపారు.
1948 సెప్టెంబర్ 13 తెల్లవారుజామున భారత ప్రభుత్వ సైన్యాలు హైదరాబాద్ సంస్థానంలో ప్రవేశించాయి. కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహారాజా, రాజేందర్ సింహాబీ నేతృత్వంలో భారత సైన్యం షోలాపూర్ నుంచి, రెండవ దళం విజయవాడ నుంచి మూడవ దళం అహ్మద్‌నగర్ నుంచి మూకుమ్మడిగా చుట్టుముట్టడంతో హైదరాబాద్ స్టేట్ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఈ నేపథ్యంలో సుల్తాన్‌బజార్‌లో తన నివాసం వద్ద ప్రజలను ఉద్దేశించి స్వామిజీ ప్రసంగించారు. ‘ఇది చరిత్రాత్మక పోరాటం, చెప్పలేని బాధలను అనుభవించిన మనం ఎన్నో అగ్ని పరీక్షలను ఎదుర్కొని ఘన విజయం సాధించాం. ఈ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వేలాదిమంది ప్రజలకు కార్యకర్తలకు, కర్షకులకు, కార్మికులకు, విద్యార్థులకు, మహిళామణులకు ఇదే నా అశ్రుతర్పణం’ అని భావోద్వేగానికి గురయ్యారు.
1948, సెప్టెంబర్ 17న నిజాం నవాబ్ హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి ప్రసంగిస్తూ భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం బేషరతుగా విలీనమైందని ప్రకటించారు. 1972 జనవరి 22న స్వామిజీ శివైక్యం చెందారు. ఆ తర్వాత ఆయన అనుంగు శిష్యుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు స్వామిజీ సంస్మరణార్థం ‘స్వామి రామానంద తీర్థ మెమోరియల్’ సంస్థను బేగంపేటలో స్థాపించారు. ఇక్కడే ‘స్వామిజీ సమాధి’ ఉండటం గమనార్హం.
– (వ్యాసకర్త: శాసనమండలి సభ్యురాలు, స్వామి రామానంద తీర్థ మెమోరియల్ ప్రధాన కార్యదర్శి)