‘అవును, ‘ధర్మ సంస్థాపన’ చాలా పెద్ద పదమే. ‘ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’. దీని పరమార్థం ‘దుష్టశిక్షణ శిష్టరక్షణ’. ఈ కాలపు సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ‘కడుపు కొట్టేవారికి కళ్లెం వేయడం ఆకలి గొన్నవారికి అన్నం పెట్టడం’. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి భగవదవతారమూర్తులకు మాత్రమే సాధ్యమయ్యే మహత్కార్యాలను మానవమాత్రులకు ఆపాదించుకోవడం కరెక్టు కాకపోవచ్చు. కానీ, ‘మనుషుల్లోని ఉదాత్త లక్షణాలే సమాజాన్ని దైవసంస్కృతివైపు నడిపిస్తాయని’ భారతీయ సనాతన ధర్మం ఈ కలియుగంలో ఉద్భోధించిన తరుణంలో మనకు మరో మార్గం ఉండదు.
హైదరాబాద్‌లోని గోపన్నపల్లి జర్నలిస్ట్ కాలనీని ఆనుకొని, సువిశాలమైన 9 ఎకరాల ప్రశాంత ప్రదేశంలో ఇటీవల రాష్ర్ట ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో ‘బ్రాహ్మణ సంక్షేమ సదన్’ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ సదన్ ప్రజలకు అంకితమై, ప్రస్తుత శ్రావణమాస సుశోభవేళ తాజాగా తీసుకొన్న ఒక అనూహ్య నిర్ణయం తెలంగాణ సమాజాన్ని సామాజిక సమానత్వం వైపు నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ అధునాతన సౌకర్యాలతో నిర్మితమైన సెంట్రల్ ఏసీ ‘కల్యాణ మండపం’ బ్రాహ్మణ సామాజిక వర్గంతోపాటు (సమయ సందర్భాలు, పరిస్థితులు, అవసరాలనుబట్టి) బ్రాహ్మణేతరులకూ కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇదెంత ఆదర్శనీయమంటే, అన్ని ప్రాంతాల్లోని ఇతర ‘ప్రత్యేక సామాజిక వర్గాల’ ప్రభుత్వ కల్యాణ మండపాలూ ఇదే బాట పట్టడమే అద్భుత మానవీయత అనిపించుకుంటుంది.
‘పెండ్లి’ అనే వేడుక ‘పెద్ద అట్టహాసం’గా మారిపోయిన ఈ రోజుల్లో సామాన్యులు రూ.లక్షలు వ్యయం చేస్తూ అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సగటు కుటుంబాలకు కల్యాణ మండపాన్ని తక్కువ అద్దెకు అందిరావడం మామూలు విషయం కాదు.
ఈ కల్యాణ మంటపాన్ని దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి, తర్వాత ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగి ఉన్న బ్రాహ్మణులకు, ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో మిగిలిన అన్ని కులాలకూ కేటాయించాలని తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయం.
‘ఇదేమంత ‘గొప్ప పని కాదుగా..?’ అని చాలామందికి అనిపించవచ్చు. కానీ, ఇటువంటి చిన్నచిన్న పనులే ఉన్నత సామాజిక ధర్మ సంస్థాపనలకు మూలమవుతాయి. మంచి చెప్పేవాళ్లే విధిగా దానిని పాటించడం ఉత్తమ లక్షణం. ఇక్కడ రాజకీయాలు, కులమతాల వంటి ప్రస్తావనలు అనవసరం. ప్రభుత్వాలు ఎంత పాలకపక్ష అనుకూలమైనా గొప్ప సంకల్పమంటూ ఉంటే అభివృద్ధి విషయంలో ఎక్కడా వ్యర్థపు, పరిమిత పనులకు తావుండదు. అటువంటి వికాసం పదిమందికి, ఒక్కమాటలో చెప్పాలంటే అందరికీ చేరువై, సార్వజనీనంగా విరాజిల్లుతుంది.
‘తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా (పని కట్టుకొని) కులాల ప్రాతిపదికన (కొన్ని రకాల) అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం?’ అన్న ముక్కుసూటి విమర్శ పూర్తి సహేతుకం కాదు. ‘జలపాతపు సెలయేరులోని గడ్డిపోచ వలె’ అది కొట్టుకు పోవలసిందే. ఎందుకంటే, ‘కులాతీత ప్రగతి నమూనా’ అసమగ్రం, ఆమడదూరం, ఇంకా లోపభూయిష్టం అయినప్పుడు వేగవంతమైన, నిర్దుష్టమైన, నిష్పాక్షికమైన పద్ధతిలో ‘ఎవరికి వాళ్లుగా’ ఎదగడం సవ్యమైన ఒక ప్రత్యామ్నాయ మార్గమే అవుతుంది. మన వంటి విభిన్న వర్గాల సంక్లిష్ట సమాజంలో సమానత్వం సాధ్యాసాధ్యాలు పూర్తిగా, నిజంగా మన చేతుల్లోనే ఉంటాయి. దానినే ‘భిన్నత్వంలో ఏకత్వ’మని, ‘వసుధై(వ)క కుటుంబ’మనీ పెద్దలు అన్నారు. అవును, ప్రకృతిలోనే అడుగడుగునా ‘అసమానతలు’ ఉన్నప్పుడు మనుషులందరూ ఒకే క్రమంలో సమైక్య బాటలోకి రావడం చాలా కష్టసాధ్యం. మార్గమేదైనా అంతిమంగా ‘అందరి మానవీయ పురోగమనమే’ లోక కల్యాణ కారకమవుతుంది.
-దోర్బల బాలశేఖరశర్మ
80966 77410