తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా బుల్డోజర్ పాలన అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించాడు. ఈ ప్రకటన ఆయన అనాలోచితంగా ఇచ్చారో లేక ఆలోచించి ఇచ్చారో తెలియదు. కానీ, యూపీ వలె తెలంగాణలో బుల్డోజర్ పాలన అందిస్తామనడంతో తెలంగాణలో చర్చకు తెరలేసింది. అసలు యూపీలో బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అమలుచేస్తున్న పథకాలేమిటి? అక్కడ పాలన ఎట్లున్నది? సామాజిక న్యాయం ఎలా అమలవుతున్నది? అట్టడుగు వర్గాలపై దాడులు జరుగుతున్నాయా? జరిగితే ఎందుకు జరుగుతున్నాయి? కుల, మత విభేదాలు ఎలా ఉన్నాయి? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు ముందుకువస్తున్నాయి.
దేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీ. అక్కడ రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యూపీలో దళితులపై దాడుల గురించి నిత్యం పత్రికల్లో వార్తలు చదువుతూనే ఉన్నాం. ఇటీవల ఒక మహిళ నదిలోకి దిగిందని బహిరంగంగా చావబాదిన దృశ్యాలు మనం చూశాం. అలాంటి దృశ్యాలు నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇక మైనారిటీలపై దాడుల సంగతి చెప్పనక్కరలేదు. ముస్లింలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతికే పరిస్థితి యూపీలో ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే.
మొన్నటికి మొన్న యూపీ ఎన్నికల ముందు కేంద్రమంత్రి కొడుకు తన కారుతో రైతులను తొక్కించి చంపాడు. మైనర్ బాలికను అత్యాచారం చేసి బీజేపీ ఎమ్మెల్యే జైలుకు వెళ్లిన ఘటన యూపీలో చోటుచేసుకున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా సామాజిక అసమానతలకు, దళితుల అణచివేతకు, వారిపై దాడులకు యూపీ కేంద్ర బిందువు అనేది జగమెరిగిన సత్యం. గ్యాంగ్‌వార్‌ల సంగతి సరేసరి. మాఫియా ముఠాలకు కేరాఫ్ అడ్రస్‌గా యూపీ ఉన్నది. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు వారి కుటుంబసభ్యులతో బయటకు వెళ్లి క్షేమంగా తిరిగివస్తారనే గ్యారంటీ లేదు.
సామాజిక అసమానతలు, అణచివేతలు, గ్యాంగ్వార్లు, మైనారిటీలపై మూకదాడులు మాట అలా ఉంచితే.. ఇక బీజేపీ పాలనను, సీఎం యోగి ఆదిత్యనాథ్ అమలుచేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తే వారిని బుల్డోజర్ పాలన పేరుతో అక్రమ కేసుల్లో ఇరికించి జైలుపాలు చేయటం సర్వ సాధారణమైంది. వారు మేధావులా, చరిత్రకారులా, జర్నలిస్టులా, వైద్యులా వారికి సంబంధం లేదు. బుల్డోజర్ పాలన పేరుతో యోగి ప్రభుత్వం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఇతర నేరాలకు పాల్పడినా వారిని చట్టపరంగా శిక్షించాలి. అందుకు వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలి. న్యాయస్థానం నిజానిజాల నిగ్గుతేల్చి వారిని శిక్షిస్తుంది.
ఇది దేశంలో అమలవుతున్న విధానం. కానీ, యూపీ బీజేపీ పాలనలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం తాను రచించిన బుల్డోజర్ చట్టాన్ని మాత్రమే అమలుచేస్తున్నారు. దీన్నే బుల్డోజర్ పాలన అని బీజేపీ చెప్తున్నది. తనకు ఎవరు నచ్చరో, బీజేపీ పాలనను ఎవరైతే వ్యతిరేకిస్తారో వారిపై అక్రమ కేసులు పెట్టడం వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చడం అక్కడ నిత్యకృత్యమైంది. ఈ తరహా బుల్డోజర్ పాలనను దేశవ్యాప్తంగా అమలుచేస్తామని బీజేపీ చెప్తున్నది. ఆ నేపథ్యంలోనే బండి సంజయ్ కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బుల్డోజర్ పాలన అందిస్తామని చెప్తున్నాడు. ఆయన వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేమిటో తెలంగాణ సమాజమే ఆలోచించాలి.
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పాలన తెలంగాణలో నడుస్తుంటే ‘సమాధులు తవ్వుతాం, సచివాలయం కూల్చేస్తాం’ అంటూ విధ్వంసాలకు, విద్వేషాలకు పాల్పడే పార్టీలకు ఇక్కడి ప్రజలు ఆకర్షితులవుతారనుకుంటే అది రాజకీయ భావదారిద్య్రానికి నిదర్శనం. తెలంగాణ అభివృద్ధి సంక్షేమంతో నిర్మితమవుతుంటే, బీజేపీ కూలబెడతాం-కాలబెడతామనే అరాచకానికి ప్రజలే సరైన సమయంలో, సరైన గుణపాఠం చెప్తారు. కేసీఆర్ సంక్షేమ పాలనను దేశం కోరుకుంటుంటే, బీజేపీ తరహా విధ్వంస, విద్వేష పాలనను తెలంగాణలో దిగుమతి చేస్తానని బండి సంజయ్ చేసే వాఖ్యలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం.
(వ్యాసకర్త: తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్)
డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్