అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ.. ప్రభుత్వం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్నా ఎన్నికల హామీని అమలు చేయకుండా చోద్యం చూస్తున్నది. దళిత వ్యతిరేక పార్టీగా పేరొందిన బీజేపీ తన వైఖరికి కొనసాగింపుగానే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత అంశాన్ని విస్మరించింది. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎన్నికల హామీగానే మిగిల్చి.. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నది.
SC Categorisation | తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా గతంలో అసెంబ్లీ వేదికగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. దాన్ని కేంద్రానికి పంపించి 10 ఏండ్లు పూర్తికావస్తున్నాయి. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆ అంశాన్ని పరిశీలించకపోవడం శోచనీయం. ఎన్నికల సమయంలో మాదిగల ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వర్గీకరణ అంశాన్ని తాత్కాలికంగా తెరమీదకు తీసుకొచ్చి లబ్ధిపొందుతున్నాయే కానీ, అమలుపై మాత్రం శ్రద్ధ చూపడం లేదు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండా గతంలో కాంగ్రెస్..
ఇప్పుడు బీజేపీ మాదిగలను మోసం చేస్తూ ఎస్సీ కులాల మధ్య మరింత దూరం పెంచేందుకు ఆజ్యం పోస్తున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎస్సీ వర్గీకరణపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో కాంగ్రెస్ చేసినట్టుగానే.. ఇప్పుడు బీజేపీ కూడా కమిటీలతో కాలయాపన చేస్తున్నది. గతంలోనూ జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటైన విషయం తెలిసిందే. వర్గీకరణపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ రెండు కమిటీల నివేదికల ఆధారంగా వర్గీకరణ చేపట్టవచ్చు కానీ, మోదీ ప్రభుత్వం అలా చేయడం లేదు.
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దాన్ని విస్మరిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి. ఎస్సీల్లో విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్న మాదిగ కులం ఇతరులతో పోలిస్తే సమాన అవకాశాలు పొందలేకపోతున్నది. అందుకోసమే మాదిగల అభ్యున్నతే లక్ష్యంగా మాదిగ ఉద్యమం ప్రారంభమైంది.
ఎన్నో ఏండ్ల ఉద్యమ ఫలితంగా ఎస్సీ వర్గీకరణ ఫలాలు జనాభా దామాషా ప్రకారం పొందుతున్న సమయంలో సుప్రీంకోర్టు కొన్ని సాంకేతిక సమస్యలను ప్రస్తావిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన ఎస్సీ వర్గీకరణను కొట్టివేసింది. దీంతో వర్గీకరణ అంశం మళ్లీ మొదటికి వచ్చింది. 26 ఏండ్లుగా నలిగిపోతున్న ఈ అంశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్లీ తెరమీదకు వచ్చింది. తెలంగాణలో మొత్తం జనాభాలో ఎస్సీలు దాదాపు 16 శాతం ఉంటారు. వీరిలో 65-70 శాతం మంది మాదిగలే. ఇప్పటి జనాభా ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో ఎస్సీ వర్గీకరణ జరగకపోతే తెలంగాణలోని మాదిగలకు తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణలో మాదిగలు 12 శాతం ఉంటారు. కాబట్టి వారి జనాభా తగినట్టుగా రిజర్వేషన్లు ఉండాలి. అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ లోపభూయిష్టంగా ఉన్నది. ఎందుకంటే ఈ కమిటీ.. ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో, ఎప్పటిలోపు నివేదిక ఇవ్వాలో స్పష్టత లేదు. తెలంగాణలో మాదిగల న్యాయమైన డిమాండ్‌ను గుర్తించిన ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 నవంబర్‌లో నాటి శాసనసభలో ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అప్పటి నుంచి వర్గీకరణ పట్ల తమ సానుకూలతను ప్రదర్శిస్తూనే ఉన్నారు.
ఎస్సీ వర్గీకరణ పట్ల కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం వర్గీకరణపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీలో ఆయన సభ్యులుగా ఉన్నారు. జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాలని ఆ కమిటీ అభిప్రాయపడింది. అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానం చేసిన తర్వాత కేసీఆర్, ఆనాటి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి 2016లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్లో చట్టం చేయాలని కోరారు. ఉషా మెహ్రా కమిషన్ సిఫారసులను అమలు చేయాలని విన్నవించారు. వర్గీకరణ సమస్యను త్వరగా పరిష్కరించాలని కేంద్రానికి అనేకమార్లు తెలంగాణ ప్రభుత్వం తరఫున లేఖలు కూడా రాశారు. గత రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలను కేంద్రం బుట్టదాఖలు చేసింది.
కేసీఆర్ మరొక అడుగు ముందుకేసి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల( అఖిలపక్షం)కు అపాయింట్మెంట్ కావాలని ప్రధాని మోదీని కోరగా.. 2017 ఫిబ్రవరి 6న అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్‌కు, మెట్రోరైల్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు కూడా అఖిలపక్షానికి సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. కానీ, ప్రధాని మోదీ తక్కువ సమయం ఉన్నదని చెప్తూ, కుదరదని తెగేసి చెప్పారు. ఈ విధంగా కేంద్రం వర్గీకరణతో దోబూచులాడుతున్నది. వర్గీకరణ పట్ల చిత్తశుద్ధితో ఉన్న కేసీఆర్ సర్కార్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని భావించి మాదిగ సమాజానికి బీజేపీ సర్కారు ద్రోహం చేసింది. ‘వర్గీకరణను చేస్తాం’ అని గల్లీ బీజేపీ నాయకులు, ‘చేయడం కుదరదు’ అని ఢిల్లీ నాయకులు మాట్లాడుతూ గందరగోళం సృష్టించారు. దీన్నిబట్టి వర్గీకరణ పట్ల బీజేపీ చిత్తశుద్ధి ఏపాటిదో యావత్ సమాజానికి అవగతం అవుతున్నది.
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని నాటి కాంగ్రెస్, నేటి బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాడుకోగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవటమే కాక నేటికీ సానుకూలంగా ఉన్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా వర్గీకరణ అంశాన్ని బలపరుస్తూ మాదిగలకు భరోసానిస్తున్నారు. అయినా కేంద్రంలోని బీజేపీ సర్కారులో చలనం రావడం లేదు. బీజేపీ ప్రభుత్వం మాదిగల పట్ల తమ వైఖరిని మార్చుకొని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి. లేకపోతే మాదిగల ముందు దోషిగా నిలబడకతప్పదు.
డా.బొల్లికొండ వీరేందర్
98665 35807
(తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు)