ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని విపక్ష పార్టీలను కనుమరుగు చేసేందుకు కసరత్తులను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను పరుగులు పెట్టిస్తున్నది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కారణంగా దర్యాప్తు సంస్థలపై ప్రజలకు వీసమెత్తు నమ్మకం లేకుండాపోయింది. ‘ఈడీ’ అనగానే ఇది బీజేపీకి సంబంధించిన సంస్థేమోనని, ‘సీబీఐ’ అనగానే ఇది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థనేమోనని, ‘ఐటీ’ అనగానే ప్రధాని మోదీ మిత్రుడికి సంబంధించిన కొత్త కార్పొరేట్ కంపెనీ అని ప్రజలు భావిస్తున్నారు.
గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల పేరు చెప్తేనే అవినీతిపరుల వెన్నులో వణుకు పుట్టేది. ఆ సంస్థ నమోదు చేసిన కేసు అనగానే అవినీతిపరుల కనుల ముందు జైలు ఊచలు నాట్యమాడేవి. కానీ ఇప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల పేర్లు చెప్తే ఎవరూ భయపడటం లేదు. కేంద్రంలోని బీజేపీ అనుంగు సంస్థలనే చులకనభావం ప్రజల్లో ఇప్పటికే వచ్చింది. బీజేపీ అంటే గిట్టనివారిపై ఆ కేసులు యాదృచ్ఛికంగానే నమోదవుతాయని దేశ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఉదంతాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు.
బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కన్నెర్ర జేస్తున్న కాషాయం పార్టీ తాము పాలిస్తున్న రాష్ర్టాల్లో అసలు అవినీతే జరగడం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటు. మనీశ్ సిసోడియా అంశాన్ని పక్కనపెట్టి ఒకసారి బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల విషయానికి వద్దాం. గుజరాత్లో మద్య నిషేధం పేరుకు మాత్రమే. అక్కడ ఏటా కల్తీ మద్యం తాగి అనేకమంది పేద ప్రజలు బలవుతున్నారు. అదిగాక కల్తీ మద్యానికి బానిసై యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నది. అక్కడ మద్యం ఏరులై పారుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం సిగ్గుచేటు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో అవినీతి కేసులే లేవంటే ఇక విచారణలెక్కడివి? అలాగే యూపీలోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రారంభించి పదిరోజులు కూడా కాకముందే పగుళ్లు పడింది. ఈ ఎక్స్‌ప్రెస్ హైవే కాంట్రాక్టర్ భారీ అవినీతికి పాల్పడ్డారని స్థానిక ప్రజలు ఆరోపణలు కూడా చేశారు. అయినా అక్కడ ఎలాంటి కేసు నమోదు కాలేదు, దర్యాప్తూ జరగలేదు. దర్యాప్తు సంస్థలు కేవలం విపక్ష నేతలనే విచారిస్తాయా? విచారణ పేరిట వారిని అరెస్టులు చేస్తాయా? 2014 నుంచి సీబీఐ దాడులు ఎదుర్కొన్న 124 మంది రాజకీయ నాయకుల్లో 118 మంది విపక్ష పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్షాలపై ఏ విధంగా పగ తీర్చుకుంటున్నదో దీన్నిబట్టే అర్థమవుతున్నది. అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తుకొస్తున్నది.
బడా వ్యాపారవేత్త, ప్రధాని మోదీ మిత్రుడైన అదానీ అంశంపై యావత్ దేశం కోడై కూస్తున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం కావాలనే అదానీ అంశం నుంచి యావత్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే సిసోడియా అంశాన్ని కావాలనే ముందేసుకున్నది. గత ఎనిమిదేండ్లుగా ప్రజా సంపదను కార్పొరేట్ల యాజమాన్యాలకు అప్పజెప్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తున్నది. దీంతో దేశ ప్రజలు ప్రధాని మోదీ పాలనపై విసిగివేసారిపోయారు. ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో ఒక పార్టీ రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పాలనను ఎండగట్టేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రూపంలో రెండు పార్టీలు ముందుకువచ్చాయి. ఈ పార్టీల పట్ల దేశ ప్రజలు సానుకూలతను వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్టీలకు విశేషాదరణ లభిస్తున్నది. ఓ దిక్కు ఆప్, మరో దిక్కు బీఆర్ఎస్ పార్టీలు ఏ సభ పెట్టినా ప్రజలు పరుగులు తీస్తున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో పెట్టిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు హాజరైన ప్రజలనే ఇందుకు తాజా ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది పసిగట్టిన కేంద్ర ప్రభుత్వానికి ఈ రెండు విపక్ష పార్టీలు కంటిలో నలుసులా మారాయి. తమకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీఆర్ఎస్, ఆప్‌లపై కావాలనే కక్ష గడుతున్నది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును తిరగతోడటం, మనీశ్ సిసోడియాను అరెస్టు చేయడం ఇందులో భాగంగానే చెప్పవచ్చు.
బీజేపీ అక్రమాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. దీనికి ప్రతిగా బీజేపీ నాయకులు ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వందకోట్ల అవినీతికి పాల్పడ్డారనే దుష్ప్రచారానికి తెరదీశారు. మద్యం నూతన పాలసీపై వచ్చిన ఫిర్యాదుల మూలంగా కొత్త విధానం రద్దు చేస్తున్నామని, పాత మద్యం విధానాన్నే అమలుచేస్తామని కేజ్రీవాల్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అయితే డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేయించడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. మొత్తంగా బెదిరింపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీజేపీ మారింది. ‘ఒకే దేశం-ఒకే పార్టీ’ ఉండాలని ప్రశ్నించే పార్టీలను నిర్వీర్యం చేయాలని బీజేపీ కంకణం కట్టుకోవడం సిగ్గుచేటు. మేము ఇచ్చే తీర్థం పుచ్చుకుంటే వేధింపులు ఉండవని నిర్మొహమాటంగా నీతివచనాలు చెప్తుండటం బీజేపీకే చెల్లుతుంది. దర్యాప్తు సంస్థల ప్రభావం వల్ల ప్రతిపక్షాలు ఒక్కతాటిమీదికి వచ్చాయని ప్రధాని మోదీ ఏకంగా పార్లమెంటులో నే వ్యాఖానించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. ప్రజా సమస్యలను పక్కనబెట్టి, ప్రభుత్వ సంస్థలను అందినకాడికి అమ్ముకొంటూ కేంద్రం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. పాలన చేతకాక ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న మోదీ తీరును చూస్తుంటే బీజేపీ ఇక అధికారంలోకి రాదేమోనన్న బెంగ బీజేపీకి పట్టుకున్నదనడంలో సందేహం లేదు. మొత్తానికి ఎక్కడ తాము అధికారం కోల్పోతామోనన్న అభద్రతాభావంలో బీజేపీని చిక్కుకునేలా చేసిన దేశంలోని విపక్షాలకు ఇది శుభారంభమే.
డాక్టర్ బీఎన్ రావు