ఈ దేశ మూలవాసులుగా పుట్టి, సింధు, హరప్పా, మొహెంజెదారో వంటి అద్భుత నాగరికతలను నిర్మించిన వారిని అంటరాని వారిగా మార్చిన మహమ్మారి కులం. వెలివేయబడ్డ జీవితాల్లో వెలుగులు నింపాలని తలచి తమ సర్వస్వం ధారపోసి పోరు నడిపిన యోధులు ఎందరో. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో 19 శతాబ్దంలో ప్రారంభమైన దళితోద్యమం 20వ శతాబ్దం తొలినాళ్ళలో తెలుగు నేలకు విస్తరించింది. ఆ ఉద్యమానికి ధృవతార మాదరి భాగ్యరెడ్డి వర్మ. దళితులు అంటరానివారు కాదు ఆది భారతీయులు, ఈ దేశ మూలవాసులు, ఆది హిందువులు, ఆది ద్రవిడులు అని ప్రకటించి ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసిన ధిక్కార స్వరం భాగ్యరెడ్డి వర్మ.
భాగ్యరెడ్డి వర్మ నాటి నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యంలో 1888 మే 22న మాల కుటుంబానికి చెందిన మాదరి వెంకయ్య-రంగమాంబ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. ఆయన అసలు పేరు మాదరి భాగయ్య. అంటరానివారిగా చిత్రీకరించబడి ఊరవతలకు వెలివేయబడ్డ దళితులు ఒకనాడు ఈ దేశాన్ని సుసంపన్నంగా పరిపాలించిన పాలకులు. వాళ్ళు మల్ల పాలకులుగా మారాలని తలచి, అంటరాని జాతుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించడం కోసం రేడు/రెడ్డి అంటే పాలకుడు అని తన పేరును భాగ్యరెడ్డిగా మార్చుకున్నాడు. ఆయన ఈ సమాజానికి చేసిన సేవల్ని గుర్తించిన ఆర్యసమాజం వారు ఆయనకు వర్మ అనే బిరుదు ఇచ్చారు. అలా మాదరి బాగయ్య భాగ్యరెడ్డి వర్మ అయ్యారు.
భాగ్యరెడ్డి వర్మ తండ్రి ఆయన చిన్నతనంలోనే మరణించడంతో తల్లి ఒక చిన్న దుకాణం నడిపిస్తూ కుటుంబ భారాన్ని మోసేది. ఒకసారి తల్లి కోప్పడటంతో ఇంటి నుంచి పారిపోయి రాములుగా పేరు మార్చుకుని హైదరాబాద్లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో టెన్నిస్ ఆడేవారి దగ్గర బాల్బాయ్గా పని చేశాడు. అక్కడికి వచ్చే ఫ్రెంచ్, డచ్ కుటుంబాలకు చెందిన వారితో ఆయనకు స్నేహం ఏర్పడింది. పాశ్చాత్య దేశాలకు చెందిన వారైనప్పటికీ ఆయనను చేరదీసి, స్నేహపూర్వకంగా మెలిగి, ఆయన చదువుకోవడానికి సహకరించారు. కానీ, స్వదేశీయులైన తోటి భారతీయులు మాత్రం కుల అసమానతలతో సాటి మనిషిని మనిషిగా చూడకుండా, అంటరానివారిగా చూస్తూ విద్యను నిరాకరించిన వైనం ఆయనను ఆలోచింపజేసింది. ఇంగ్లిష్ పత్రికలు చదవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మార్పులను ఆయన అర్థం చేసుకోగలిగాడు. ఇది ఆయన జీవితంలో మలుపుగా చెప్పుకోవచ్చు. సరిగ్గా ఇదే సమయంలో అమెరికాలో నల్ల జాతీయుల నాయకుడు, సంఘ సంస్కర్త బుకర్.టీ.వాషింగ్టన్ ఒకవైపు నల్లజాతివారిలో అంతర్గతంగా సంస్కరణలు తీసుకొస్తూ, మరోవైపు తెల్లజాతి ప్రభుత్వాలతో తమ హక్కుల సాధన కొరకు ఉద్యమించడం భాగ్యరెడ్డి వర్మను బాగా ప్రభావితం చేసింది.
తన 18వ ఏటనే 1906లో జగన్ మిత్ర మండలి స్థాపించి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ తెలుగు నేలపై దళిత జన జాగృతి కోసం ఏర్పడ్డ మొట్టమొదటి సంస్థ. బాల్యవివాహాలు, జోగిని, దేవదాసి, బసివిని, మాతంగి వంటి సాంఘిక దురాచారాలకు, మద్యపానం మరియు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా రాత్రి పూట బస్తీలకు వెళ్లి భజన పాటలు, హరికథల ద్వారా అవగాహన కల్పించి చైతన్య పరిచేవారు. ఆ తర్వాత కాలంలో దళిత ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం మన్నె సంఘం స్థాపించాడు. నేటి దళితులే నాడు సింధు నాగరికతకు పునాదులు వేసిన మూల భారతీయులు, ఆది భారతీయులు, ఆది హిందువులు అని ప్రగాఢంగా విశ్వసించిన భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను స్థాపించారు. హైదరాబాద్ రాజ్యంలో ప్రారంభమైన ఆది హిందూ ఉద్యమం క్రమంగా వివిధ రాష్ర్టాలకు విస్తరించింది.
ఆలిండియా ఆది హిందూ మహాసభలో క్రియాశీలక నాయకుడిగా 1920-1931 మధ్య కాలంలో ఢిల్లీ, అలహాబాద్, నాగపూర్, లక్నోలలో జరిగిన జాతీయ సదస్సులకు దక్షిణ భారత దేశం నుంచి ప్రతినిధిగా భాగ్యరెడ్డి వర్మ పాల్గొని ప్రసంగించారు. 1931లో సెప్టెంబర్ 27, 28 తేదీలలో లక్నోలో జరిగిన కీలకమైన సభకు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు. ఆది హిందువులకు ప్రత్యేక నియోజక వర్గాలు ఉండాలని గతంలో వచ్చిన డిమాండును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. లండన్లో జరుగబోయే రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకి బి.ఆర్.అంబేద్కర్ స్థానంలో దళితుల ప్రతినిధిగా గాంధీ వెళ్లాలని కుట్రలు జరుగుతున్న సందర్భంలో, దేశంలోని కోట్లాది మంది దళితులకు అంబేద్కరే ప్రతినిధి కానీ గాంధీ కాదు అని సభ తీర్మానించింది. సదస్సు తీర్మానాలను భారత ప్రభుత్వ కార్యదర్శికి, బ్రిటన్ ప్రధానమంత్రికి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చైర్మన్కు, ఎంపీలకు పంపారు. బ్రిటీషు ప్రభుత్వం అందుకు అంగీకరించి దళితుల ప్రతినిధిగా బాబాసాహెబ్ అంబేద్కర్నే ఆహ్వానించింది. అంబేద్కర్ వాగ్దాటి వల్ల అప్పుడే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తున్నట్టు బ్రిటీషు ప్రభుత్వం ఒప్పుకుంది.
భాగ్యరెడ్డి వర్మ విద్యకు అధికంగా ప్రాధాన్యత ఇచ్చేవారు. హైదరాబాద్ నగరంలో 26 పాఠశాలలను ఏర్పాటు చేసి తన సొంత డబ్బులతో నడిపించారు. దళితుల్లో విద్యావ్యాప్తికి భాగ్యరెడ్డి వర్మ చేస్తున్న కృషిని గుర్తించిన నిజాం ప్రభు త్వం ఆ పాఠశాలలను ప్రభుత్వమే నడిపిస్తుందని తీసుకుంది. అప్పుడున్న ఉర్దూ మీడియం కాకుండా ఆ పాఠశాలల్లో తెలుగు మీడియంలోనే బోధన కొనసాగించాలని డిమాండ్ చేసి సాధించాడు భాగ్యరెడ్డి వర్మ. దళిత స్త్రీలను పట్టి పీడిస్తున్న జోగినీ, దేవదాసి, మాతంగి లాంటి వ్యవస్థలను నిర్మూలించడమే లక్ష్యంగా ‘మురళీ నివారణ మండలి’ అనే సంస్థను స్థాపించాడు. ఆయన పోరాట ఫలితంగా జోగినీ వ్యవస్థను హైదరాబాద్ రాజ్యంలో రద్దు చేశారు. బతుకుదెరువు కోసం గ్రామాల నుంచి హైదరాబాద్కు వలస వచ్చి ఇళ్ళల్లో పనిచేసే దళిత స్త్రీల సమస్యల పరిష్కారం కోసం ‘డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్’ను భాగ్యరెడ్డి స్థాపించారు. ఆయన పోరాటం వల్ల నిజాం రాజ్యంలో వెట్టి చాకిరీ నిర్మూలనా చట్టం వచ్చింది. సమానత్వానికి చిహ్నమైన బౌద్ధాన్ని ఆయన ప్రబోధించారు. 1939 ఫిబ్రవరి 18న మహాపరినిర్వాణం చెందారు. గత ప్రభుత్వాలు విస్మరించిన భాగ్యరెడ్డి వర్మ పోరాటాన్ని, గొప్పతనాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షణీయం. హైదరాబాద్లో ఆయన జీవిత విశేషాలతో కూడిన స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరాలకు ఆయన గురించి మరింతగా తెలుస్తుంది.
(వ్యాసకర్త: సామాజిక, రాజకీయ విశ్లేషకులు)
-డాక్టర్ మంచాల లింగస్వామి
80992 22020