భారత్ వంటి ఎక్కువ జనసాంద్రత కలిగిన దేశాల్లో మెరుగైన ప్రజారవాణా వ్యవస్థలు అవసరం మాత్రమే కాదు, అవి జీవనాధారం కూడా. వేగవంతమైన పట్టణీకరణ, పరిమిత స్థలం, విపరీతమైన ట్రాఫిక్‌జామ్, పెరుగుతున్న కాలుష్యం తదితర అంశాలు ప్రయాణ సమయాన్ని మరింతగా పెంచుతున్నాయి. ప్రైవేట్ వాహనాలపై అతిగా ఆధారపడటం, ట్రాఫిక్‌జామ్, వాయు కాలుష్యం తదితర సమస్యలకు ప్రజా రవాణా, ముఖ్యంగా మెట్రో రైలు నెట్‌వర్క్‌లు స్థిరమైన పరిష్కారాన్ని చూపుతాయి.
హైదరాబాద్ ఒక మెట్రోపాలిటన్ నగరం. ఆర్థికపరంగా తెలంగాణకు వెన్నెముక. సుమారు 70- 80 శాతం రాష్ట్ర ఆదాయం ఈ నగరం నుంచే సమకూరుతున్నది. నగరాభివృ ద్ధి, వేగవంతంగా జనాభా పెరుగుదల నేపథ్యంలో పటిష్ఠమైన ప్రజా రవాణా అవసరం. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో మెట్రో రైల్ ఒక గేమ్ ఛేంజర్‌గా నిరూపితమైంది. ప్రతిరోజు మిలియన్ల మంది ప్రయాణికులు సురక్షితంగా, వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అంతేకా దు, మెట్రో ప్రయాణం పర్యావరణ హితమైనది కావడం గమనార్హం.
హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ అనతికాలంలోనే విజయవంతమైంది. 70 కిలోమీటర్లకు పైగా ఉన్న మెట్రోకు ప్రజల నుంచి విశేష స్పందన ఉన్నది. అయితే, పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు తగ్గట్టుగా మెట్రో నెట్‌వర్క్‌ను కూడా విస్తరించాల్సిన అవసరం ఉన్నది. విస్తరణ సమయంలో కొన్ని కీలక విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విస్తరణలో అధిక జనాభా, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కోణంలో చూసుకుంటే ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలోని ప్రతిపాదిత కారిడార్ 1: ప్యారడైజ్-డైరీఫామ్ రోడ్- కొంపల్లి- మేడ్చల్ (22 కి.మీ.), కారిడార్ 2: జేబీఎస్-శామీర్‌పేట- తూంకుంట (19 కి.మీ.), కారిడార్ 3: తార్నాక-ఈసీఐఎల్- నాగారం- కీసర (20 కి.మీ.), కారిడార్ 4: బోయిన్పల్లి-మూసాపేట్-సూరారం- గండిమైసమ్మ (21 కి.మీ.) నగరాభివృద్ధిలో ఎంతో కీలకం.
ఈ ప్రాంతాల్లో సుమారు 30 లక్షల మందికి పైగా నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు ఐటీ నిపుణులే. వారు హైటెక్ సిటీ, ఇతర ఉపాధి కేంద్రాలకు నెలవైన ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మెట్రో విస్తరణలో అటువంటి జనసాంద్రత ఉన్న ప్రాంతాలను విస్మరించడం సరికాదు. ముగ్గు కూడా పోయని ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తరణలో ప్రాధాన్యం ఇవ్వడం ఆందోళనకరం.
మెట్రో రైలు అనవసర ఖర్చు కాదు, అది పెట్టుబడి. మెట్రో రైలు ప్రాజెక్టుల వల్ల ప్రజాధనం వృ థా అవుతుందని కొందరు వాదిస్తున్నారు. అయి తే, అలాంటివారు మెట్రోపై పెట్టే పెట్టుబడుల వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలను గుర్తించడం లేదు. మెట్రో నెట్వర్క్ వల్ల నగరం గణనీయంగా వృద్ధి చెందుతుంది. దాంతో పాటు వ్యాపారాలు, ఉత్పాదకత పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పౌరుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. అందులోనూ హైదరాబాద్ వంటి అత్యం త వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో స్థిరమైన వృద్ధికి మెట్రో ఎంతగానో దోహదపడుతుంది.
మెట్రో అంటే లగ్జరీ కానే కాదు, అది ఒక అవసరం. అంతేకాదు, మెరుగైన ప్రజా రవాణా పౌరుల ప్రాథమిక హక్కు. ప్రత్యేకించి రాష్ట్ర ఆదాయంలో సింహభాగం అందించే హైదరాబాద్ నగరం నలుమూలలను మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు సమకూరి అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ సమగ్ర, సమతుల వృద్ధి చెందుతుంది.
(వ్యాసకర్త: వ్యవస్థాపక సభ్యులు, మేడ్చల్ మెట్రో సాధన సమితి)
– ఎం.సంపత్‌రెడ్డి 94400 90059