కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బీసీలకు ఏదో రాష్ర్టాన్నే రాసిచ్చినట్టు.. కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తున్నదనే వార్తలు కొంత విస్మయాన్ని కలిగిస్తున్నాయి. జనాభా పరంగా చూస్తే రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది బీసీలే. అయితే, వారికి అరకొరగా పదవులిచ్చి, అన్నీ బీసీలకే ఇచ్చినట్టు ఆయా మీడియా సంస్థల ద్వారా ప్రచారాలు సాగించడాన్ని బీసీలు అర్థం చేసుకొని, అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా యావత్ బహుజన జాతి ఇంకా మోసానికి గురవుతూనే ఉంటుంది.
డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పీసీసీ పదవిని బీసీ సామాజిక వర్గమైన దివంగత డి.శ్రీనివాస్‌కు ఇచ్చి ఓట్ పోలరైజేషన్‌కు వాడుకున్న మాట వాస్తవం కాదా? వైఎస్ మరణానంతరం బీసీ వ్యక్తి పీసీసీగా ఉన్నా, వైశ్య సామాజిక వర్గానికి చెందిన రోశయ్యను, ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం సీటులో కుర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ముఖ్యమంత్రిగా బీసీ నేతలకు ఆ పార్టీ అవకాశం ఇవ్వలేదు. అంటే, బీసీలకు కాంగ్రెస్ జెండాను మోసే అర్హత మాత్రమే ఉన్నదా? అధికార పీఠాన్ని ఎక్కే స్థాయి, శక్తియుక్తులు బీసీలకు లేవా? అనే ప్రశ్న యావత్ బీసీలోకంలో తలెత్తుతున్నది. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ బలంగా ఉన్నప్పుడు, వారు ఆడిందే ఆట, పాడిందే పాట అయ్యింది. ఆ రోజుల్లోనే ఢిల్లీ అధిష్ఠానం బీసీలపై మమకారం చూపలేదు. అంటే, రాష్ర్టాన్ని ఏలగలిగే సమర్థులు బీసీల్లో కూడా ఉన్నారని ఆ పార్టీ అనుకోవడం లేదని మనం అర్థం చేసుకోవాలి.
సరే గతం గతః అని వదిలేసి, ఇప్పటి విషయానికి వద్దాము. మధుయాష్కీ లాంటివారికి అధిష్ఠానం వద్ద చొరవ ఉన్నా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రకటించలేదు. అన్నిపార్టీల కండువాలు మార్చినవారికే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో చెప్పకనే చెప్పింది. అంతేకాదు, కనీసం నామినేటెడ్ పోస్టుల్లోనో, పార్టీ పదవుల్లోనో, కార్పొరేషన్ పదవుల్లోనో, కమిషన్ల నియామకాల్లోనో బీసీలకు జనాభా దామాషా ప్రకారం కేటాయించి సామాజిక న్యాయం పాటించిందా? అంటే, అదీ లేదు. పార్టీలో తొండికో మొండికో బీసీ గళం వినిపించే వి.హన్మంతరావు లాంటోళ్లు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కత్తి వెంకటస్వామి లాంటివారు కూడా ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయారు. సరే, ఇవన్నీ బీసీలు వదిలేసుకున్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగంలో బీసీ అధికారులకు ఎటువంటి ప్రాధాన్యం ఉందో, ఏ వర్గాల వాళ్లు పెత్తనం చెలాయిస్తున్నారో, బాజాప్తా మాది గవర్నమెంట్ అని బహిరంగంగా చెప్పుకొంటున్న వర్గమేదో కూడా బీసీలు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సందర్భం ఇది.
సరిగ్గా ఇందిరమ్మ దేశాన్ని పాలిస్తున్న సమయంలో, 1982 జనవరిలో అప్రెస్డ్ ఇండియన్ అనే పత్రిక ఎడిటోరియల్‌లో ‘మనకు రాజకీయ రిజర్వేషన్లున్నాయి, కానీ, నిర్ణయాలు తీసుకునే హక్కు మాత్రం మనకు లేదు. నిర్ణయాలు తీసుకోబడుతాయి, ప్రణాళికలు తయారు చేయబడుతాయి. అయితే, అవన్నీ ఎవరైతే మనకు శత్రువులో వారు మాత్రమే తయారుచేస్తారు. వాళ్ళు మన తరఫున నిర్ణయాలు తీసుకుంటారు. భారతదేశంలో ప్రజాస్వామ్య విధానం ఈ విధంగా ఉన్నది’ అని రాసింది. ఆనాటి ప్రజాస్వామిక పరిస్థితులను ఆ పత్రిక ఎద్దేవా చేసినట్టుగానే, నేటి తెలంగాణ ఇందిర మ్మ రాజ్యంలోనూ అవే పరిస్థితులు దాపురిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఏ పదవులకు పనికిరాని బీసీలు, కేవలం లోకల్‌బాడీ ఎన్నికల్లో వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి చిన్నాచితకా పదవులకు మాత్రమే అర్హులు. బీసీ కులాలను ఉద్ధరించేందుకే కమిషన్ వేసి లెక్కలు గట్టి ‘కిందిస్థాయిలో మీరు ఉండండి మీపైన మేము పెత్తనం చేస్తాం’ అన్నట్టుగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తెస్తున్నది. ఇదెలా ఉందంటే.. ‘పండ్లు మేం తింటాం, మీరు తొక్కలు తినండి’ అన్నట్టుగా ఉన్నది. తెలంగాణ శాసనసభలో 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉండటాన్ని బీసీ సామాజిక వర్గం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ డబ్బులున్న ఎన్నారైలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది కానీ, స్థానికంగా పార్టీకి లాయల్‌గా ఉన్న బీసీ లీడర్లను కేవలం పల్లకీ మోసే బోయిలుగానే చూసింది. ఎవరు ఔనన్నా, కాదన్నా ఇది నూటికి నూరు శాతం నిజం. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు గుర్తింపు ఉండలేదన్నది వాస్తవమే కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతటి దీనస్థితి, కుల వివక్షకు బీసీలెప్పుడూ గురికాలేదు. కేసీఆర్ హయాంలో బీసీల్లోని ఒక్కో వర్గాన్ని గుర్తు పెట్టుకొని మరీ ఆయా పదవుల్లో అకామడేట్ చేసి తగిన గౌరవం ఇచ్చారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కొంచెం సునిశితంగా గమనిస్తే దళితుల కంటే దయనీయమైన స్థితిలో బీసీ బిడ్డలున్నారనే విషయం అర్థమవుతున్నది. ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్లో ఏ విధంగానైతే ‘వెనుకబడిన తరగతులు’ అని రాసినట్టుగా బీసీలు అన్నింటిలోనూ వెనకబడే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఇంకా బీసీలను దగా చేస్తూనే ఉన్నది. యాదగిరిగుట్టలో దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టికి చిన్నపీట వేసి మిగతా అగ్రవర్ణాలు పెద్ద పీటల మీద కూర్చున్నట్టే, బీసీ బిడ్డ అయిన పీసీసీ అధ్యక్షుడికి చిన్నపీట వేసి ముఖ్యమంత్రి పెద్ద పీట మీద కూర్చొని వినాయక పూజలో పాల్గొన్నారు. పాలకునికి ఎంతటి కుల దురహంకారమో అన్నది దీన్నిబట్టే అర్థమవుతున్నది. ప్రజలు గమనిస్తున్నారు. కర్రు కాల్చి వాతపెట్టే సమయం ఎంతో దూరం లేదు.
(వ్యాసకర్త: హైకోర్టు న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు)
-ముఖేష్ సామల 97039 73946