బండి సాయి భగీరథ్ నిర్వాకం ఎందరినో బోనులో నిలబెట్టింది. పోక్సో కేసులో నిందితుడైన మంత్రి ముద్దుల బిడ్డను కాపాడేందుకు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు కొద్దో గొప్పో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాయి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్‌పై ఫిర్యాదు అందిన తర్వాత తొమ్మిది రోజులపాటు ప్రభుత్వ వ్యవస్థలు, ప్రజా సంఘాల మధ్య భీకర పోరు జరిగింది. రోజులు గడిస్తున్న కొద్దీ ఆయన అరెస్టుపై పోలీసుల తాత్సారం పట్ల ప్రజలు, ప్రజాసంఘాల బహిరంగ వ్యతిరేకత పెచ్చరిల్లడంతో బండి రక్షణ వ్యవస్థ ఒక్కొక్కటి తోక ముడిచింది. ఎర్రని ఎండలో ప్లకార్డులు పట్టుకొని వందలాది మహిళలు ప్రధాన కూడళ్లలో, పోలీసు స్టేషన్ల ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పెద్దల కుట్రపై
ప్రజలదే విజయమైంది. ప్రజల ముందు ముఖం చెల్లక సీఎం నుంచి కేంద్ర మంత్రుల వరకు ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు.
బీజేపీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు, కోర్టులు, హిందూ సంఘాలు అన్నీ చేతులు ఎత్తేయడంతో కేంద్ర మంత్రి ఒంటిగా మిగిలిపోయారు. ఆయన తన పవర్‌తో కొడుకును పోలీసు గడప తొక్కనీయకుండా ఆయన చేసిన విశ్వ ప్రయత్నం బెడిసికొట్టి ‘అప్పగింత’ నాటకానికి తెర లేచింది. నిన్నమొన్నటి వరకు పార్టీలో, ప్రభుత్వంలో బలమైన వ్యక్తి కొడుకుగా భగీరథ్ అన్ని వ్యవస్థలను ధిక్కరించే స్థాయిలో ఉన్నాడు. వైరల్ అయిన కొన్ని వీడియోల ప్రకారం ఆయన ఎవరినైనా కొట్టగలడు, నోటికొచ్చినట్టు తిట్టగలడు. ఎవరైనా కిమ్మనకుండా భరించవలసిందే. తాను పెట్టే బాధలను నోరెత్తకుండా అందరు భరిస్తూ ఉండడంతో తనకు ఎదురేలేదు అని అహంకారం ఆయనను కమ్మేసింది. తండ్రి రాజకీయ పరపతిని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా వ్యవరించడంలో భాగంగానే ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణను పరిగణించాలి.
సాధారణంగా ఏ కొడుకు దుష్ప్రవర్తనకైనా నైతికంగా మొదటి దోషిగా తండ్రి నిలుస్తాడు. కరీంనగర్ ప్రజల యోగ క్షేమాల కోసం తన సమయాన్నంతా వెచ్చిస్తూ తన కొడుకుతో సరిగా మాట్లాడలేకపోయానని తండ్రి జన సమూహం ముందు విన్నవించుకున్నారు. అందుకు తనను క్షమించాలని వేడుకున్నారు. తన కొడుకు ఏ తపూ చేయకున్నా రాజకీయ కక్షతో నేరం మోపుతున్నారని ఆరోపించారు. ఓ వైపు పోలీసులు వెతుకుతున్నా సాక్ష్యాధారాల సేకరణ కోసం ఇంకా సమయం పట్టేలా ఉన్నందున కొడుకును అప్పగిస్తున్నానని అన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రం అర్థమవడానికి ఆయనకు తొమ్మిది రోజుల సమయం పట్టింది. కొడుకుపై మమకారంతో కాపాడుకోవాలని తండ్లాడిన క్రమంలో ఇమేజి చాలా డ్యామేజ్ అయింది. పోలీసులు నోటీసు జారీ చేయగానే కొడుకును అప్పగించేయమని ఆయనకు చెప్పిన శ్రేయోభిలాషులు ఉన్నారో లేదో కానీ, అదే పని చేసి ఉంటే ఆయన పరువు కొంచమైనా నిలిచేది.
భగీరథ్ పోక్సో కేసు విషయంలో పోలీసుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హత్యలు, లైంగిక దాడులకు పాల్పడిన ఎందరినో అరెస్టు చేసి, శిక్ష పడేలా చేసిన రాష్ట్ర పోలీసులు, ఇప్పుడు మాత్రం ప్రభుత్వ స్క్రిప్ట్ ప్రకారం నటిస్తూ కాలం గడిపారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
నిరుడు డిసెంబర్ 31న రాత్రి తన కుమార్తెపై బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డాడని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ చుట్టూ మూడు నెలలు తిరుగుతున్నా తన ఫిర్యాదును వారు స్వీకరించలేదని బాధితురాలి తల్లి పేర్కొన్నది. ఈ విషయం పైఅధికారుల వరకు వెళ్లలేదా? అనే అనుమానం కలుగకమానదు. చివరకు మే 9న జరిగే ప్రధాని సభలో ఆత్మాహుతి చేసుకుంటామని ఆ తల్లి అనడంతో మే 8న పిటిషన్ తీసుకున్నారని కూడా తెలుస్తున్నది. ఇక్కడ భగీరథ్ పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కకముందే కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ పేరిట బాధితురాలిపై హానీట్రాప్ కేసు నమోదైంది. అంటే బాధితురాలి కదలికలన్నీ నిందితుడి తడ్రికి తెలిశాయన్నది స్పష్టమవుతున్నది. ఇలా చాటుగా కేంద్రమంత్రికి సహకరించిన వారెవరో బయట పెట్టవలసిన బాధ్యత పోలీసుపై ఉన్నది. ఫిర్యాదు అందగానే ముద్దాయిని పట్టుకోకుండా నోటీసులతో, ప్రతి నోటీసులతో కాలం గడిపే అవసరం పోలీసులకు ఎందుకొచ్చింది? సకాలంలో, చట్టప్రకారం పోలీసులు స్పందించకపోవడాన్ని సీరియస్‌గా తీసుకోకుండా వారిని ముఖ్యమంత్రి వెనుకేసుకొస్తున్నారు. ‘నీ కొడుకు.. నీ ఇష్టం, ఎప్పుడైనా మీరు పోలీసుల వద్దకు వెళ్లొచ్చు’ అనే హామీ సంజయ్‌కి రాష్ట్రం నుంచి లభించిందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల వైపు నుంచి వస్తున్నాయి.
బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేశారా? ఆయనే పోలీస్ స్టేషన్లో లొంగిపోయారా? అనేది కూడా స్పష్టత లేదు. లాయర్ల సమక్షంలో అప్పగించాను అని నిందితుడి త్ంరడ్రి చెప్తున్న మాటలో పోలీసులకు దొరకకుండా దాచిపెట్టారనే అర్థం కూడా వస్తున్నది. రాష్ట్రంలోనే సంచలనమైన ఈ కేసులో ముద్దాయిని అదుపులోకి తీసుకున్నామని ఒక్క పోలీసు అధికారి కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పడం లేదు. సాధారణంగా అలా దొరికిన వారిని ముసుగు కప్పి మీడియా ముందు ప్రవేశపెట్టడం మన పోలీసుల ఆనవాయితీ. పోలీసుల వద్ద ఉన్నది బండి భగీరథే అని ప్రజలు నమ్మటానికైనా ఒక చిత్రాన్ని విడుదల చేస్తే మంచిది. భగీరథ్ పట్టుబడిన వార్త వినడమే తప్ప కండ్లకు కనబడిందేమి లేదు. పోలీసులు ఎవరి కోసం ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
భగీరథ్ దిగి రావడానికి ఎంతో శ్రమించిన వర్గాలకు ప్రజలు జేజేలు చెప్పాలి. సామాజిక మాధ్యమాలు, మహిళా సంఘాలు అలుపెరుగని కృషి చేశాయి. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పట్టు వదలని విక్రమార్కుడిలా పని చేశారు.
మాజీ పోలీసు అధికారి కాబట్టి విషయ పరిజ్ఞానంతో ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను నిలదీయగలిగారు. వీరికి జడిసి ప్రభుత్వం దారికొచ్చింది. ఇక లాభం లేదని బండిని కదిలించారు. గొప్పోరి బిడ్డని వ్యవస్థ ఎలా కాపాడే ప్రయత్నం చేస్తుందీ, ఆ వ్యవస్థను నిలువరించేందుకు తెలంగాణ ప్రజలు ఎలా తిరగబడతారు అని చెప్పేందుకు భగీరథ్ ఘట్టం ఉదాహరణగా నిలుస్తుంది.
బద్రి నర్సన్