గవర్నమెంటే గండమయ్యాక, దాని నెత్తి మీదున్న గంపలో ఏముంటుందో ప్రజలకు తెలియదా? అందుకే, నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నా, మొహం అటువైపు పెట్టేవారే లేరెవ్వరు. నిజానికి బడ్జెట్ సమావేశాలకు మూడు, నాలుగు నెలల ముందునుంచే వివిధ వర్గాలు నిధుల కేటాయింపుల కోసం మంత్రి మండలికి దరఖాస్తుల దండలేసేవి. కానీ, ‘ఉండబట్టలేక ఓటేస్తే/ ఉన్న బట్టా లాక్కున్నట్టు’ అని అలిశెట్టి ప్రభాకర్ అన్నట్టుగా, ఏడాదిన్నర నుంచి హస్తం సర్కార్ అన్నీ లాగేసుకున్నాక, సర్కారు వారి వరాల కోసం ఆశపడే వెర్రివాళ్లు ఇంకా ఉంటారా? అందుకే, ఇందిరమ్మ సర్కార్ బీరువాలోకి కన్నేసే ఆలోచన కలలో కూడా ఎవరికీ లేకుండా పోయింది.
వాస్తవానికి ఏడాదిన్నర కిందటి దాకా కేవలం అవగాహనపరులే కాదు, ఆశా జీవులందరికీ మార్చి నెలపై ఎంతో ఆసక్తి ఉండేది. వర్షాకాల, శీతకాల శాసనసభ, మండలి సమావేశాల కంటే, పద్దును ప్రజల ముందుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైనే కొన్నిరోజుల ముందు నుంచే జనంలో జోరైన చర్చలు నడిచేవి. మీడియా కూడా గత బడ్జెట్లో వివిధ రంగాలకు జరిపిన కేటాయింపులు, వాస్తవ ఖర్చులు, అంచనాలు, ఖర్చులకు మధ్య ఫలితాలు, తదితర వాస్తవాలపై లోతైన కథనాలను ప్రసారం చేసేది. నిజానికి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ దురంధరులు, ఘనాపాటీలెందరో చట్టసభ సభ్యులుగా ఉన్నప్పటికీ, మిగతా సభాసమావేశాలు ఆకర్షించినంతగా బడ్జెట్ సెషన్లు సామాన్యుల దృష్టిని ఆకట్టుకోకపోయేటివి. ప్రజల అనుభవంలో ప్రతిఫలించని, అసలు వారికి అర్థమే కానీ అంకెల విన్యాసాలుగా బడ్జెట్ సమావేశాలుండేవి. సర్కార్ వారి ఆదాయ, వ్యయాల ప్రణాళికలు బేతాళ మాంత్రికుడి చిక్కు ప్రశ్నల్లా అందరినీ బెదరగొట్టేవి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల బడ్జెట్ల విశ్లేషణ ఆర్థికరంగ నిపుణుల సంబంధిత వ్యవహారంగా అందరూ భావించేవారు.
కానీ, 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో బడ్జెట్ సెషన్స్ ప్రాధాన్యమే పూర్తిగా మారిపోయింది. ఊకదంపుడు ఉపన్యాసాలు, స్వోత్కర్షలు, పాండిత్య ప్రదర్శనలు, కొటేషన్లు, కొర్రీలు, వేళాకోళాల వాదోపవాదాల స్థానంలో, వివేకవంతమైన విశ్లేషణ, వివక్షపై లోతైన అన్వేషణ మొదలైంది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల్లో పాలకుల పక్షపాతం, రాబడి, వ్యయాల వ్యత్యాసం వెనుక రాజకీయ కనికట్టును కేసీఆర్ కుండబద్దలు కొటినట్టుగా తేటతెల్లం చేయడంతో, విత్త విధానంపై తెలంగాణ తన చూపును తిప్పింది. ఆనాటి సమైక్యాంధ్ర సర్కార్లు నిధుల కేటాయింపులో తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని, చాట్‌లో నిప్పులు పోసి చెరిగినట్టు కేసీఆర్ సభ లోపల, వెలుపల చీల్చి చెండాడటంతో, జరుగుతున్న మోసం జనాల చెవికెక్కడం మొదలైంది. పద్దులో పస్తులు తెలంగాణకు, పండుగను సీమాంధ్రకు పంచే పక్షపాత పూరిత బడ్జెట్ ప్రసంగాలను బట్టలిప్పేసి, నగ్నంగా నిలబెట్టగలిగింది గులాబీ పార్టీ. దాంతో నాలుగున్నర దశాబ్దాల తర్వాత బడ్జెట్లో వడ్డిస్తున్న దగా మొత్తం దర్పణంలో చూసినట్టుగా రాష్ట్ర ప్రజలందరి ముందు ఆవిష్కృతమైపోయింది. అప్పటిదాకా పడుతూ లేస్తూ, పనైపోయిందని అందరూ భావించిన ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి బడ్జెట్‌ను భాస్వరంలా వాడి మండించింది బీఆర్ఎస్ పార్టీ. దానివల్ల ఆదాయ, వ్యయాల అంచనాల్లో సర్కార్ల అంకెల గారడీ అందరినోటా చర్చనీయాంశంగా మారింది.
1956 నుంచి 2014 మధ్య కాలంలో ఉద్దేశపూర్వకంగా అమలుచేసిన ఆర్థిక విధ్వంసక నమూనా, తెలంగాణ నుంచి సర్వస్వం లాగేసుకొని ఈ ప్రాంతాన్ని నిస్సహాయమైన నేలగా మార్చివేసింది. జీవితాలను జైళ్లు, బెయిల్లుగా మార్చి, ఊర్లను వలసలు, స్మశానాలుగా పెంచిన వికృత వృద్ధి నమూనాకు వ్యతిరేకంగా చీమల దండుకు మర్మం నేర్పినట్టు, మేకల మందను యుద్ధానికి సిద్ధం చేసినట్టు తెలంగాణ జనాన్ని తిరగబడేలా తీర్చిదిద్దింది కేసీఆర్ అనుచరదళం. ఉపరితలంలో సల్పుతున్న నొప్పులకు పునాదిలో తిష్టవేసుకొని ఉన్న సుదీర్ఘ మౌలిక రుగ్మతలపై స్పష్టమైన అవగాహనను ఉద్యమ అనుభవంలోంచి అవగాహన చేసుకున్న బాధ్యతాయుత రాజకీయ శక్తి బీఆర్ఎస్. అందువల్లనే ఉద్యమ కాలంలో బడ్జెట్లో వివక్షా గోడలను శాసనసభ లోపలే ఎలా బద్దలు కొట్టిందో, అధికార పార్టీగా సైతం విత్త నిర్వహణను సమగ్రాభివృద్ధి విప్లవానికి ఆదెరువుగా రూపొందించింది. దానివల్లనే ప్రగతిలో ఫీనిక్ష్ పక్షిలా తెలంగాణ రాష్ట్రం స్వల్పకాలంలోనే ఆరోగ్యకర అభివృద్ధిని సాధించింది. పర్యాటకం, పోలీస్ బాధ్యతలకు మాత్రమే సర్కార్లు అనే ప్రపంచ బ్యాంకు విధానాన్ని విసిరి, పదేండ్ల పద్దుల్లో ఆర్థికశాస్త్రం, సామాజిక శాస్త్రంకు పొత్తు కుదుర్చి నవీన వృద్ధి నమూనా జెండా ఎగరేసింది గులాబీ సర్కార్.
పేదల కన్నీరు తుడువని ఆర్థిక ప్రగతి అస్థిరమైనది మాత్రమే కాదు, అన్యాయమైనది కూడా అనే కేసీఆర్ ఉదాత్తమైన భావనల వెలుగులో 2014-15 నుంచి 2023-24 దాకా రాష్ట్ర బడ్జెట్లు రూపొందించబడ్డాయి. 2,90,396 కోట్లతో నాటి ఆర్థికమంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వ చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే నాటికే తెలంగాణ విపణి మార్పులను సంధానం చేసుకొని సౌభాగ్య రాష్ట్రంగా నిలదొక్కుకుంది.
పదేండ్ల కిందట, తొలి నాటే కేసీఆర్ సర్కార్ ప్రతి ఇంటి కన్నీటినీ గుర్తించి, కారణాలు శోధించి, పరిష్కారాలకు ప్రతి పద్దులో చోటు కల్పించబట్టే తెలంగాణ అన్ని రంగాల్లో రారాజుగా ఎదిగింది. తలసరి ఆదాయం, పంటల దిగుబడి, వ్యవసాయ అనుబంధ రంగాల రాబడి, ఐటీ, పారిశ్రామిక ఉత్పత్తుల్లో దేశంలోనే తొలి ర్యాంకింగ్ రాష్ట్రంగా తెలంగాణ నిలవడం వెనుక అన్నివర్గాల ఆకాంక్షలు నెరవేర్చే శాస్త్రీయ ఆదాయ, వ్యయాల ప్రగతి ప్రణాళికలను ప్రతి ఏటా కేసీఆర్ ప్రభుత్వం రూపొందించింది.
కానీ, ఏడాది కిందట లంకె బిందెలు కల గని కుర్చీనెక్కిన కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ విజయగాథను తలకిందులుగా తిప్పేసింది. ఆడలేక మద్దెల ఓడన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పని చేతకాక సాకులు వల్లె వేస్తున్నాడు. లేకపోతే పంటలెండిపోతే నేను కారణమంటున్నారని వాపోయిన రేవంత్ లాంటి ముఖ్యమంత్రిని గతంలో చూశామా? భవిష్యత్తులో చూడగలమా? రైతులు రాలుతున్నా, విద్యార్థులు ఒరుగుతున్నా, ఆటో డ్రైవర్లు ఊపిరి విడుస్తున్నా.. ఒట్లూ, తిట్లూ, ఓట్ల జపం చేస్తూ కాలక్షేపం చేస్తున్న రేవంత్ రెడ్డిని ఏమన్నా పాపం లేదు. అందుకే జనం చెప్పలేని రీతిలో హస్తం సర్కార్‌పై బూతులతో దుమ్మెత్తి పోస్తున్నారు.
ప్రభుత్వ నిర్వహణ చేతగాక, ప్రజా పట్టింపే లేక మంత్రి మండలి మొత్తం చేతివాటం కళా ప్రదర్శన చేయడంలో తలమునకలై ఉన్నారు. ఈ ప్రభుత్వ పనితనం పూర్తిగా అర్థమయ్యే, హస్తం సర్కార్ ఆర్థిక పద్దుపై ప్రజలు ఏ ఆశలూ వ్యక్తం చేయడం లేదు. 2024-25 వార్షిక బడ్జెట్లోనే 70 పేజీల్లో కుడి ఎడమల దగా సినిమా చూపించారు. పదేండ్ల ప్రగతి పంటపై పడిన బుల్డోజర్లా గతేడాది బడ్జెట్ కూల్చివేతను మిగిల్చింది. ఎక్కడైనా ఎద్దు పొడిచి ఎళ్లిపోయిన వారుంటారు కానీ, తెలంగాణలోనే పద్దు పొడిచి ప్రాణాలు వదిలిన ప్రజలున్నారు. మళ్లీ అదే గారడీతో జనం రాబడిపై దాడే తప్ప, రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్‌తో వొరిగేదేముంటుందనేదే అన్ని వర్గాల భావన.