జాతిని నడిపించగా.., జన చేతన జాడగా.. కేసీఆర్ అమ్ములపొదిలోని అస్ర్తాలకు బోణీ ఖమ్మంలో జరుగనున్న ‘ప్రజా ఆశీర్వాద అఖండ బహిరంగ సభ’. దేశంలోని ప్రజాస్వామికవాదులను ఏకంజేసే కంకణధారిగా ఖమ్మం సరికొత్త సమకాలీన, భావిభారత చరిత్ర తొలి పేజీలో సగర్వంగా తలెత్తుకొని చేవ్రాలు చేయబోతున్నది. ఆ మొదటి పుట ‘భారత్ రాష్ట్ర సమితి’ పుట్టుకకు ఆసన్నమైన సమయానికి, సమూల సమగ్ర నేపథ్యానికి చిత్రిక పట్టనున్నది.
చరిత్ర గాయాలమయమైతే. వర్తమానం సాధారణ జనజీవనాన్ని విధ్వంసం చేస్తున్నది. ప్రపంచంలో మరే దేశానికి లేని సౌభాగ్యం సొంతమైన ప్రకృతి వనరులను సగటుజీవి హితానికై అనుభవంలోకి తేలేని విఫల నాయకత్వాలు పెనుశాపంగా మారాయి. ఘనత వహించిన వర్తమాన నేతృత్వాలు అంతేలేని భారంగా పరిణమించాయి. వాగ్దానాలే గానీ, వాస్తవ రూపం మచ్చుకైనా లేవు. పైగా సమాజాన్ని విడదీసే ఎత్తుగడల లోగుట్టు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నది. నాగరిక ప్రపంచాన్ని నడిపించాల్సిన మార్గంలో కాకుండా పిడికెడు మంది కుబేరుల కోసం, పార్టీ మనుగడ కోసం, తమ పీఠాల కోసం పాటుపడుతున్న వైనం భారతీయులను కలవరపరిచే, బాధపెట్టే విపరిణామం. నాయకత్వం దార్శనికత, నిబద్ధత పరంగా విపరీతమైన వెలితి దేశం నలుమూలలా నెలకొన్నది. సమర్థ నాయకత్వం కోసం, సుసంపన్నతను అనుభవంలోకి తెచ్చే ప్రభుత్వం కోసం ప్రతి భారతీయ పౌరుడు వేయి కండ్లతో వేచిచూస్తున్న తరుణంలో దక్షిణాన ఓ చంద్రోదయం ఆవిష్కృతమైంది.
సగటు జీవి బంగారు భవితే సదాశయంగా, కార్మిక, కర్షకలోకం సుభిక్షమే లక్ష్యంగా నూటికి నూరు శాతం స్వచ్ఛమైన దృక్పథంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మస్తిష్కంలోంచి పురుడు పోసుకున్నదే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్). భారతీయుల మనోభావాలను, అంతరంగాలను, వెర్రి తలల మత పిచ్చి మచ్చుకైనా పొడసూపని అభిమతంగా, ఖమ్మం నుంచి కశ్మీరం దాకా.. సకల మానవాళి సమతా, మమతలే ఆకాంక్షగా బీఆర్ఎస్ ఆవిర్భవించింది. స్వరాష్ట్రం కోసం స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మొట్టమొదటి సింహగర్జన సభ కరీంనగర్ గడ్డపై జన తరంగ ఫిరంగిలా ఢిల్లీ దిక్కు ఎక్కుపెట్టింది. నాటి 2001 సభ ప్రత్యేక రాష్ట్రం అనివార్యతకు బీజం వేయడంలో ఉద్యమకారుడిగా కేసీఆర్ విజయవంతమయ్యారు. అదొక చరిత్ర.
కేసీఆర్ తమ పదునైన వాగ్ధాటితో ఢిల్లీ పెద్దలు తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పని చతురతల చరిత్ర. నెత్తురు చిందకుండా గాంధేయమార్గాన్నే అనుసరించిన అభినవ మహాత్ముడు కేసీఆర్ మరో అధ్యాయానికి ఆద్యులయ్యారు. దేశంలో ముసురుకున్న చీకట్లను పోగొట్టే గట్టి కాగడాలను ఎత్తుకున్నారు. ఆ వెలుగు అడుగుజాడలలో లక్షలతో మొదలై, కోటాను కోట్ల భారతీయులను గెలిపించే మహత్తరమైన శక్తిని ఖమ్మం బహిరంగ సభ ద్వారా దేశవ్యాప్తం చేసే శక్తిని మరోసారి లోకం ముందుంచుతున్నారు. ముంచే పాలకుల నిజస్వరూపం కండ్లకు కడుతూనే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశం కోసం చేయబోయే సేవల విధి విధానాలను వెల్లడించనున్నారు. అందుకు సంక్రాంతి కాంతుల అనుభూతి నడుమ ఈ నెల 18వ తేదీని ఖరారు చేశారు. దక్షిణ భారతంలోని మన ఖమ్మం వేదికగా యావత్భారతానికి సందేశం ఇవ్వబోతున్నారు.
దేశం దశ మార్చే ఈ ప్రజాశీర్వాద అఖండ సభకు ఆయా దిశల నుంచి సాక్షాత్తూ ముఖ్యమంత్రులు, ఆయా విపక్షపార్టీల బాధ్యులు, వివిధ రంగాల దిగ్గజాలు ఖమ్మం సభలో కేసీఆర్తో స్వరం కలపబోతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ప్రభుత్వాధిపతి పినరయి విజయన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ సారథి అఖిలేష్ యాదవ్ ఇంకా మరెందరో భారతదేశ ఉజ్వల భవితను కాంక్షించే ఖమ్మం సభలో భాగం కానున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో కదలాడిన అద్భుత భారతదేశం సుమారు 140 కోట్ల భారతీయుల అనుభవంలోకి తీసుకొచ్చే అపూర్వ తొలి బహిరంగ సభ ఘట్టానికి ముహూర్తం సమీపిస్తున్నా కొద్దీ దేశవ్యాప్తంగా అన్నిరంగాలు, వర్గాల దృష్టి ఖమ్మం సభపైనే కేంద్రీకృతమైంది.
టీఆర్ఎస్ తొలి బహిరంగసభ కరీంనగర్ సింహగర్జన రాష్ట్ర సాధనకు ప్రజాశక్తిని కూడగట్టింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్, యూపీ, ఢిల్లీ తదితర రాష్ర్టాల ప్రతినిధులతో పాటు నాలుగైదు లక్షల మం ది పాల్గొనే ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభ దేశవ్యాప్త శక్తిగా విస్తరించనున్న ది. ఈ సభ నవీన రాజకీయాలకు అంకురార్పణ అవుతున్న అపూర్వ సందర్భం.
(వ్యాసకర్త: ఇల్లెందుల దుర్గాప్రసాద్ , 94408 50384 స్వతంత్ర జర్నలిస్ట్)