అబద్ధపు హామీలు, జూటా మాటలతో రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి దగా చేసింది. పంద్రాగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సుమారు 11 లక్షల మంది రైతుల నోట్లో మట్టికొట్టారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ఊరికెళ్తే ఆ ఊర్లోని దేవుడి మీద ఒట్టేసి ‘రుణమాఫీ చేస్తా’నని చెప్పిన సీఎం రేవంత్ ఆఖరికి దేవుళ్లను సైతం మోసం చేశారు. ఒకేసారి రుణమాఫీ అని కోట్లు ఖర్చుచేసి పత్రికలకు ప్రకటనలు ఇచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడు దఫాల్లోనైనా ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో రైతు రుణమాఫీని పూర్తి చేయలేకపోయింది. మూడో దఫాలోనైనా తమ రుణం మాఫీ అవుతుందని ఆశగా ఎదురుచూసిన రైతుల ఆశలు అడియాసలయ్యాయి. రుణమాఫీ తీసుకున్న రైతుల్లో దాదాపు 35 శాతం మందికి ఇంకా రుణమాఫీ కాకపోవడం శోచనీయం. ఇదిలా ఉంటే రుణమాఫీ ప్రక్రియ మొత్తం పూర్తయిందంటూ రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిస్సిగ్గుగా ప్రకటించుకోవడం వారి మోసపూరిత విధానానికి, దగాకోరుతనానికి నిదర్శనం.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 9 కూడా వచ్చిపోయింది. కానీ, రైతు రుణమాఫీ మాత్రం కాలేదు. పైగా రోజులు గడిచేకొద్దీ ఆ తేదీ మారుతూ వచ్చింది. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న రైతు రుణమాఫీ, 6 గ్యారంటీల హామీలను చూసే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారనే విషయం తెలియనిది కాదు. కానీ, రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నది. డిసెంబర్ 9నే రైతు రుణమాఫీ అవుతుందని ఎదురుచూసిన రైతులు దానికోసం సుమారు 8 నెలలు ఆగాల్సి వచ్చింది. ఆలస్యమైనా ఫర్వాలేదు, రుణమాఫీ అయితే చాలని భావించిన రైతులు ఇప్పుడు నెత్తీనోరు బాదుకుంటున్నారు. రుణమాఫీకి నోచుకోని 11 లక్షల మంది రైతులు తల్లడిల్లుతున్నారు.
అయితే, ‘మార్పు’ పేరిట ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మాయమాటలతో మరోసారి గారడి చేస్తున్నారు. రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ నాయకులపై అవాకులు, చెవాకులు పేలుతున్నారు. బ్యాంకు రుణం మాఫీ కాని సుమారు 11 లక్షల మంది రైతులు ‘రుణమాఫీ’పై ఇక ఆశలు వదులుకోవాల్సిందేనని కాంగ్రెస్ నాయకుల మాయమాటలు చెప్పకనే చెప్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న మరో మోసం ఏమంటే.. ఆరు గ్యారంటీల అంశాన్ని పక్కదారి పట్టించడం. అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీ ‘మహిళలకు ఉచిత బస్సు’ పథకాన్ని ప్రారంభించింది. అరకొర వసతుల మధ్య సాగుతున్న ఈ పథకం మహిళలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నది. బస్సుల కొరత, సమయానికి రాని బస్సులే అందుకు కారణం. ప్రయాణికులకు సరిపడా బస్సులను పెంచాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘పల్లె వెలుగు’ బస్సులకే ‘డీలక్స్ బోర్డు’లు పెట్టి రాష్ట్రంలో తిప్పుతున్నది. డీలక్స్ బస్సుల్లో మహిళలకు ఆధార్ కార్డు మీద జీరో టికెట్లు జారీ చేయకపోవడంతో మహిళలు అటు గమ్యాన్ని చేరుకోలేక, ఇటు ఇంటికి చేరుకోలేక రోడ్లపైనే నానా అవస్థలు పడుతున్నారు. అయితే, ఈ ‘ఉచిత బస్సు’ పథకాన్ని గొప్పగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు సుమారు 8 నెలల పాటు కాలాన్ని వెళ్లదీశారు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ నేతలకు మరికొంత కాలం పాటు కాలాన్ని వెళ్లదీసే అవకాశం మళ్లీ ‘రుణమాఫీ’ పథకంతో లభించింది.
అవును మరి, మొదటి దఫా రుణమాఫీ చేయకముందే ‘ఒకేసారి రుణమాఫీ చేస్తున్నాం’ అని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అంతకుమించిన ప్రచారాన్ని చేసుకోదనే గ్యారంటీ ఏమున్నది? అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాని ఒక ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే.. ఎన్నికలకు ముందు మీ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మొత్తం 32.5 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామన్న మీరు 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు. పూర్తిస్థాయిలో, ఇంకా సుమారు 11 లక్షల మందికి రుణమాఫీ చేయడంలో మీరు విఫలమయ్యారు. అందుకే ‘రుణమాఫీ చేయడంలో మా ప్రభుత్వం విఫలమైంద’ని ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పితీరాలి. అంతేకాదు, ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలుచేస్తామని ప్రగల్భాలు పలికిన మీరు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది. అయినా ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదు. కాబట్టి ఆరు గ్యారంటీల అమలుపై దృష్టిసారించాలి.
అయితే ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరు తిరిగిన రేవంత్రెడ్డి ‘మేం అధికారంలోకి వస్తే… డిసెంబర్ 9న రూ.40 వేల కోట్లు రుణమాఫీ చేస్తా’మని చెప్పిన మాట అందరికీ తెలియనిది కాదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి.. ఒక దశలో రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నట్టు మాట మార్చారు. ఆపై 2024-25 బడ్జెట్లో రుణమాఫీ కోసం రూ.26 వేల కోట్లను మాత్రమే కేటాయించారు. తీరా అసలు సమయానికి రూ.17,869 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులను ఏ విధంగా మోసం చేసుకుంటూ, ఏమార్చుకుంటూ వచ్చారో దీన్నిబట్టి స్పష్టంగా అర్థమవుతున్నది.
కాంగ్రెస్ నాయకులకు అంతిమంగా చెప్పేదేమంటే.. ఇకనైనా మీ మాటల గారడికి చరమగీతం పాడండి. అభివృద్ధి పథంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణను ఆగం చేయకండి. రాష్ట్ర ప్రగతికి అడ్డుపడకండి. ‘లేదు, మేమింతే! తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా మారుస్తా’మంటే మాత్రం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు.