తెలంగాణది ఒడువని ముచ్చట. విలీనంతోనే విస్మరణకు గురైంది. ఉమ్మడి ఏలికల పాలనలో వివక్షకు గురైంది. కండ్లముందు పారుతున్న కృష్ణమ్మ, గోదావరితో గొంతు తడుపుకోలేని దుస్థితి. ఉద్యమ ఆకాంక్షగా నీళ్లు నిలవడమే అందుకు తార్కాణం. స్వరాష్ట్రంలో కేసీఆర్ పదేండ్ల పాలనలో తరలిపోయిన జలాలు మళ్లొచ్చాయి. నదులు బీళ్లను ముద్దాడాయి. మాగాణాలుగా మార్చే యజ్ఞక్రతువు కొనసాగింది. కానీ, నేడు కేంద్ర సర్కారు దన్నుతో మళ్లీ ఉమ్మడి జలకుట్రలకు తెరలేచింది. గోదావరిని కొల్లగొట్టే ఎత్తులకు ఏపీ సిద్ధమైంది. వరదజలాల మాటున కృష్ణాలో చేసిన పన్నాగాలతో గోదావరిలో ప్రణాళికలను రూపకల్పన చేసింది. దానిపేరే గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు. చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే ఇది ఏపీకి గేమ్‌చేంజర్. కానీ, తెలంగాణకు మాత్రం చాలా డేంజర్.
గోదావరి జలాల్లో ఉమ్మడి ఏపీ వాటా 1,480 టీఎంసీలు. అందులో తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్ర పాలకులు కేటాయించినవే 968 టీఎంసీలు. కానీ, అన్నీ కాగితాల మీదనే. ఆ మేరకు నీటి వినియోగానికి అనుగుణంగా తెలంగాణ భూభాగంలో ఒక్క భారీ ప్రాజెక్టూ కట్టలేదు. తెలంగాణ సమాజం పోరాటాలు చేస్తే, ప్రజలను మభ్యపెట్టేందుకు నీటిలభ్యత లేని చోట ప్రాజెక్టులను కట్టారు. వాటి పరిస్థితి ఏమంటే ‘చూసుక మురువ.. చెప్పుక ఏడువ’ అన్నట్లుండె. మొత్తంగా తెలంగాణ ఏర్పడేనాటికి నీటివాటాలో 200 టీఎంసీలను కూడా వినియోగించుకోలేని దీనస్థితి. తెలంగాణ ఇంచు ఇంచుపై అవగాహన కలిగిన, నీటివనరులను ఔపోసన పట్టిన ఉద్యమ నాయకుడు కేసీఆరే రాష్ట్ర సారథిగా బాధ్యతలు చేపట్టడంతో పరిస్థితి మారిపోయింది. ఉమ్మడి పాలకులు చేసిన కుట్రలన్నింటినీ బద్దలు కొట్టేందుకు వజ్రాయుధాన్ని సంధించారు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు. గోదావరిపై ఎస్సారెస్పీ దిగువ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు వరుసగా బరాజ్‌ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం.. వాటిని ప్రాజెక్టు కాలువలతో అనుసంధానించడం వంటి బీఆర్ఎస్ సర్కారు అమలుచేసిన బహుముఖ వ్యూహాలతో గోదావరిలో తెలంగాణ నీటి వినియోగ వాటా 500 టీఎంసీలకుపైగా పెరిగింది. అందుకు పంటల దిగుబడే నిలువెత్తు నిదర్శనం.
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా మారిన మరుక్షణం నుంచి, ఢిల్లీ పెద్దల దన్నుతో చంద్రబాబు గోదావరిని చెరబట్టే ప్రణాళికలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ జలహక్కుల కాలరాసేందుకు పూనుకున్నారు. ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.80 వేల కోట్లతో గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టడం అందులో భాగమే. ప్రాజెక్టు ద్వారా తొలుత రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల గోదావరి వరద జలాలను పోలవరం డ్యామ్ కుడి కాలువ ద్వారా ప్రకాశం బరాజ్‌కు, అక్కడి నుంచి పల్నాడు జిల్లాలో 150 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న బొల్లాపల్లి రిజర్వాయర్‌కు, ఆపై పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ దిగువన బనకచర్ల హెడ్‌రెగ్యులేటరీకి మళ్లిస్తారు. తద్వారా పెన్నా బేసిన్‌కు తరలిస్తారు. ఇదీ క్లుప్తంగా జీబీ లింక్ ప్రాజెక్టు ప్రణాళిక.
గోదావరిలో నికర జలాలు అంటే గ్యారెంటీగా వచ్చేవి. వరద జలాలు అంటే రాష్ర్టాలకు కేటాయించిన నికర జలాలు పోగా, అదనంగా దొర్లిపోయే జలాలు. వాస్తవానికి ట్రిబ్యునల్ అవార్డులో ఎక్కడా గోదావరిలో నికర, మిగులు జలాల విభజన లేదు. అందుబాటులోని అన్ని జలాలను కలిపే నీటిలభ్యతను లెక్కగట్టి, ఆ మేరకు బేసిన్ రాష్ర్టాలకు జలాలను ట్రిబ్యునల్ పంపిణీ చేసింది. కానీ, ఏపీ మాత్రం వరద జలాలు అంటూ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా కొత్తపాట పాడుతున్నది.
ఏపీ ఇప్పటికే తన వాటా 512 టీఎంసీలు కాదు, 715 టీఎంసీలని వాదిస్తున్నది. గోదావరిలో తెలంగాణ వాటాను నిరాకరిస్తున్నది. అందుకు అనుగుణంగానే జీబీ లింక్ ప్రాజెక్టు నీటిలభ్యతను ప్రతిపాదించిందంటేనే పరిస్థితి అర్థమవుతున్నది. ఇప్పటికే గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఏపీ కోరింది. త్వరలోనే దానిపై ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశమున్నది. ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందే ప్రాజెక్టును చేపట్టి, ఆ తర్వాత చారిత్రక రక్షణ కింద నీటి వాటా కోరాలన్నదే ఏపీ దురుద్దేశం. కృష్ణా బేసిన్లో ఏపీ గతంలో ఇలా వాదనలు చేసే జలాలను దక్కించుకుంది కూడా. గోదావరిలోనూ అదే విధానాన్ని అనుసరిస్తున్నదని స్పష్టంగా తెలుస్తున్నది. అదే జరిగితే తెలంగాణ వాటాకు గండి పడే అవకాశముంది.
తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన 968 టీఎంసీల్లో దాదాపు 830 టీఎంసీల వినియోగానికి కేసీఆర్ సర్కారు ప్రణాళికలను రూపొందించింది. ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. కేసీఆర్ సర్కారు రూపకల్పన చేసిన ప్రాజెక్టుల్లో ఇప్పటికే చాలా వాటికి అనుమతులు సాధించింది. సమ్మక్కసాగర్, వార్ధాతోపాటు పలు ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సి ఉంది. కానీ, అవేవీ రాకముందే జీబీ లింక్ ప్రాజెక్టును ఏపీ చేపట్టడం, కేంద్రం అనుమతులు ఇవ్వడమంటే తెలంగాణ జలహక్కులకు గొడ్డలిపెట్టు లాంటిదే.
రేవంత్‌రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణ నీళ్లను దోచుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ కుట్రను ముందే పసిగట్టిన కేసీఆర్ దాన్ని భగ్నం చేసేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావుతో బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయించారు. తద్వారా మన నీళ్లను చంద్రబాబు ఏ విధంగా దోచుకుపోతున్నారో, అందుకు రేవంత్‌రెడ్డి ఎలా సహకరిస్తున్నారో తెలంగాణ సమాజానికి పూసగుచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు తెలంగాణ సమాజం ముందున్న ఒకే ఒక లక్ష్యం మన నీళ్లను మనం కాపాడుకోవడమే. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు చంద్రబాబుకు దాసోహమై మన నీళ్లను దోచుకునేందుకు సహకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.