‘తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసినట్టయితే ఈ ప్రాంత సాగునీటి కోసం నిర్మిస్తున్న, నిర్మించాలనుకుంటున్న పలు ప్రాజెక్టులు పూర్తికావన్న భయాందోళనలు, నదీజలాలు దిగువకు తరలించుకుపోతారన్న అనుమానాలు ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నందున అన్నిరంగాల్లో అప్పటికే అభివృద్ధి
చెందిన ఆంధ్రతో సమానంగా తెలంగాణను కూడా అభివృద్ధి చేసి, 1962లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో మూడింట రెండొంతుల మంది శాసనసభ్యులు అప్పటికీ తెలంగాణను ఆంధ్రతో కలిపేందుకు అంగీకరిస్తే విలీనం చేయవచ్చు’నని అప్పటి స్టేట్స్ రీ-ఆర్గనైజేషన్ కమిషన్ (ఎస్ఆర్సీ) సిఫారసు చేసింది. అయినా ఏ మాత్రం పట్టించుకోకుండా తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి గోదావరి జలాలకు మరణశాసనం రాసింది అప్పటి (కాంగ్రెస్) ప్రధాని నెహ్రూ, ఆయన ఒత్తిళ్లకు లొంగి విలీనానికి అంగీకరించిన అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు.
గోదావరి జలాలకు మరణశాసనం- సమైక్య రాష్ట్రం: 1956 నవంబర్ 1న ఏపీ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నీలం సంజీవరెడ్డి (ఆంధ్ర) తన తొలి మూడేండ్ల పాలనలోనే గోదావరి జలాలకు మరణశాసనం రాశారు. అప్పటికే రెండవ పంచవర్ష ప్రణాళికలో చేర్చి, నిధుల కేటాయింపు పొంది, నిర్మాణ పనులు ప్రారంభమైన దేవునూరు బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించనవసరం లేదని, దీనికోసం కేటాయించిన రూ.2.20 కోట్లను పోచంపాడుకు మళ్లించాలని స్వయంగా అధికారిక లేఖను కేంద్ర ప్రభుత్వానికి రాశారు నీలం సంజీవరెడ్డి. 1959 ఆగస్టులో ప్రణాళికా సంఘం సభ్యుడు త్రివేదిని నీలం సంజీవరెడ్డి కోరినప్పుడు.. ‘దేవునూరు జలవిద్యుత్తు ప్రాజెక్టును మీరు వదులుకున్నా పోచంపాడుకు నిధులను బదిలీ చేయడం కుదరద’ని స్పష్టం చేశారు.
దేవునూరు ప్రాజెక్టు రద్దు: 27 టీఎంసీలకు తగ్గించి అనుమతి పొందిన ప్రాజెక్టు దేవునూరు. మెదక్ జిల్లాలో లక్ష ఎకరాలకు మంజీరా నది నుంచి సాగునీరు, హైదరాబాద్ నగరానికి 150 క్యూసెక్కుల తాగునీరు, 14,250 కిలోవాట్ల విద్యుదుత్పాదన, దిగువన ఉన్న నిజాం సాగర్‌కు నదిలో ఇసుక కొట్టుకురాకుండా నివారించడం తదితర లక్ష్యాలుగా రూ.11.95 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలనుకున్న దేవునూరు ప్రాజెక్టును రద్దు చేసిన ‘ఘనత’ కాంగ్రెస్ పాలకులదే.
కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం నిజాంసాగర్: 1931లోనే నిజాం ప్రభుత్వం నిర్మించిన నిజాంసాగర్ కాల్వల కింద కోటి ఆశలతో కోస్తాంధ్ర నుంచి వలసవచ్చి చెరుకు, వరి పంటలు పండిస్తున్న రైతుల నోట్లో మట్టికొట్టిన (తెలంగాణ రైతుల నోట్లో కూడా) మరో వలసవాది కాంగ్రెస్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు. అప్పటికే నిజాంసాగర్ నీటి నిల్వ సామర్థ్యం సుమారు 30 టీఎంసీల నుంచి 11.8 టీఎంసీలకు తగ్గింది. దీనికి కారణం ఇసుక కొట్టుకురాకుండా దేవునూరు ప్రాజెక్టును మంజీరా నదిపై నిజాంసాగర్‌కు ఎగువన నిర్మించాలని నదికి ఇరువైపులా కొంత దూరం వరకు భూమి కోతకు గురికాకుండా లక్షలాది మొక్కలు నాటాలన్న నిజాం ప్రణాళికను అమలుచేయకపోవడం. అసలే 11 టీఎంసీలకు నిజాంసాగర్ నీటి నిల్వ సామర్థ్యం పడిపోయిందంటే, ఆ కొద్ది నీటిని కూడా రానివ్వకుండా ఎగువన మంజీరాపై హైదరాబాద్ పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం సింగూరు ప్రాజెక్టును నిర్మించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.
నిజాంసాగర్ రైతులు దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేయగా ‘మీకు నీళ్లివ్వడానికే సింగూరులో నిల్వ చేస్తున్నా’మని నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. సింగూరు ప్రాజెక్టు కింద కాల్వలు నిర్మించి 2 టీఎంసీలతో మెదక్ జిల్లాలో 40 వేల ఎకరాలకు సాగునీరిస్తామని ఈ ప్రాంత రైతులను నమ్మించడానికి తూములు పెట్టి కాల్వలు నిర్మించకుండా వదిలివేశాయి కాంగ్రెస్ తదనంతర తెలుగుదేశం ప్రభుత్వాలు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో అప్పటి సీఎం వైఎస్ఆర్తో (సోనియాగాంధీ చొరవతో) జరిపిన హై లెవెల్ మీటింగ్‌లో సింగూరు కాల్వలను నిర్మించాలని పట్టుబట్టారు. తదనంతరం ఎనిమిదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో ఉన్నా కాల్వల పనులు పూర్తిచేయలేదు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే రైతుల పొలాలను సింగూరు నీళ్లు తడిపాయి. తగ్గిన నిజాంసాగర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని రైతుల ఆందోళనల కారణంగా 11.8 టీఎంసీల నుంచి 17.8 టీఎంసీలకు పెంచినా మంజీర నీళ్లను సింగూరు నుంచి వదలకుండా హైదరాబాద్ అవసరాలకు తరలిస్తుండటం వల్ల నిజాంసాగర్ కింద యాభై వేల ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పైన పేర్కొన్న సాగునీటి ప్రాజెక్టుల్లో వివక్ష, తీవ్ర నిర్లక్ష్యం వల్ల తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో కన్నబిడ్డలకు ఇంత అన్నం పెట్డానికి లక్షలాది మంది విద్యావంతులు, నిరక్షరాస్యులైన తెలంగాణ రైతు కూలీలు గల్ఫ్ దేశాలకు వలసబోయి
దారుణమైన బాధలుపడ్డారు. వేలాదిగా మరణించడమో, జైలు పాలు కావడం జరిగింది. ఈ జిల్లాల్లోనే 1970 తర్వాత నక్సలైట్ ఉద్యమం మొదలై వేలాదిగా యువతీ యువకులు తుపాకులు పట్టుకొని భారతదేశమంతా మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.
జీవం కోల్పోయిన మంజీరా: మంజీరా నది ఎగువన ఎలాంటి అనుమతులు లేకుండానే తెలంగాణ రైపేరియన్ రైట్స్‌ను హరిస్తూ మహారాష్ట్ర అప్పర్ మంజీరా డ్యాం ఎత్తు పెంచినా, నదిపై 32, ఉపనదులపై వందలాది బ్రిడ్జ్ కం బ్యారేజీలు, ప్రధాన నదిపై కర్ణాటక 5 బ్యారేజీలు కట్టినా.. ఈ వ్యాసకర్త 2002లో మంజీరా నదిపై పర్యటించి ఈ అక్రమ బ్యారేజీలను వెలుగులోకి తెచ్చేదాకా మన ప్రభుత్వాలకు, ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వానికి సోయి రాలేదు. ప్రాజెక్టు ఆయకట్టులో బోర్లు వేసుకునే దుస్థితి నిజాంసాగర్ రైతులకు రావడానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పాలకులే.
కె.ఎల్.రావు అనుమానాలే నిజమయ్యాయి: మంజీరా నీళ్ల దుస్థితి ఇలా ఉంటే నిజాం నిర్మించాలనుకున్న గోదావరి (ఆరు జిల్లాల్లో 28 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే) ప్రాజెక్టును నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డిల నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు 1963 జూలై 26న కేవలం 66 టీఎంసీల వినియోగంతో 5.70 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రాజెక్టుగా కుదించి నెహ్రూతో శంకుస్థాపన చేయించారు.
ఒక్కరోజు ముందు శంకుస్థాపన చేసిన శ్రీశైలం డ్యాం నిర్మాణానికి పోచంపాడు మెషినరీని తరలించడంతో 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం సందర్భంగా తెలంగాణ రీజినల్ కమిటీతో పాటు ప్రొఫెసర్ జయశంకర్, ఇతర నేతలు ఈ ప్రాజెక్టు జాప్యం, నిధుల కొరతపై ప్రశ్నించిన తర్వాతే కొద్దిగా నిధులు విడుదల చేశారు. పోచంపాడు పేరును అప్పటి సీఎం చెన్నారెడ్డి శ్రీరాంసాగర్‌గా మార్చి (జీవో నెం.355 తేదీ 20.11.78) ఆయకట్టును తొలిదశ 9,54,000 ఎకరాలు, రెండో దశ 4,40,000 ఎకరాలు, వరదకాల్వ మరో 2,00,000 ఎకరాలు పెంచినా ఈ పనులన్నీ పూర్తికావడానికి నాలుగు దశాబ్దాల జాప్యం జరిగింది.
ఈలోగా శ్రీరాంసాగర్‌కు ఎగువన గోదావరి ప్రధాన నదిపై బాబ్లీతో పాటు 13 బ్యారేజీలు, ఉప నదులు, వాగులపై వందల సంఖ్యలో బ్యారేజీలు నిర్మించడంతో 196 టీఎంసీలను వినియోగించాల్సిన శ్రీరాంసాగర్‌కు చుక్క నీరు రావడమే కరువైంది. క్లౌడ్ బరస్ట్ అయి భారీ వర్షాలు ఎగువన కురిసినప్పుడే ఈ ప్రాజెక్టుకు నీరు చేరుతుంది. సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు వివక్షకు, నిర్లక్ష్యానికి గురైనందున ఏనాడూ మొదటి దశలో సగం ఆయకట్టుకు కూడా నీళ్లు రాలేదు. రెండో దశ కాల్వలు, వరద కాల్వల్లో చుక్క నీరు రాలేదు. అలీ నవాజ్ జంగ్ నిర్మించాలనుకున్న పెన్‌గంగా, ప్రాణహిత, ఇచ్చంపల్లి ప్రాజెక్టులను నీలం సంజీవరెడ్డి నుంచి కిరణ్‌కుమార్ రెడ్డి దాకా కాంగ్రెస్, టీడీపీ ముఖ్యమంత్రులెవరూ నిర్మించడానికి ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదు.
దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి, బస్తర్: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పైన పేర్కొన్న సాగునీటి ప్రాజెక్టుల్లో వివక్ష, తీవ్ర నిర్లక్ష్యం వల్ల తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో కన్నబిడ్డలకు ఇంత అన్నం పెట్డానికి లక్షలాది మంది విద్యావంతులు, నిరక్షరాస్యులైన తెలంగాణ రైతు కూలీలు గల్ఫ్ దేశాలకు వలసబోయి దారుణమైన బాధలుపడ్డారు. వేలాదిగా మరణించడమో, జైలు పాలు కావడం జరిగింది. ఈ జిల్లాల్లోనే 1970 తర్వాత నక్సలైట్ ఉద్యమం మొదలై వేలాదిగా యువతీ యువకులు తుపాకులు పట్టుకొని భారతదేశమంతా మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.
పీపుల్స్‌వార్ మాజీ కార్యదర్శి గణపతి (ముప్పాళ లక్ష్మణరావు) నుంచి ప్రస్తుత కేంద్ర కమిటీ నేత మల్లోజుల వేణుగోపాలరావు వరకు ఉత్తర తెలంగాణకు చెందిన అగ్రనేతలే. అబూజ్‌మడ్‌లో మరణిస్తున్న వందలాది మంది విప్లవకారుల్లో డజన్ల మంది ఉత్తర తెలంగాణవారే. తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని అణచివేయగానే నక్సలైట్ ఉద్యమాన్ని తెలంగాణలో ప్రారంభించిన నక్సలైట్లే కొండపల్లి, సత్యమూర్తిల నాయకత్వం నుంచి బయటపడి, మలిదశ తెలంగాణ ఉద్యమానికి సన్నద్ధమయ్యారు. ‘దగాపడిన తెలంగాణ’ లెక్కలు బయటపెట్టి గద్దర్‌తో ‘అమ్మా తెలంగాణమా’ అంటూ ఆకలి కేకల గానాన్ని వినిపించారు. తెలంగాణ చూడకుండానే అసువులుబాసిన లాల్గర్ కిషన్ జీ, నల్లా ఆదిరెడ్డి తొలిదశ తెలంగాణ ఉద్యమ ధ్రువతారలే.
సింగరేణి బొగ్గు గనుల్లో తట్టమోస్తున్న వేలాది మంది ఉత్తర తెలంగాణ రైతు కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలే. సికాసను రగిలించి హక్కుల కోసం పోరాడి అమరులైన వారెందరో! బొంబాయి, భీవండి, సూరత్, షోలాపూర్ వంటి దూరప్రాంతాలకు (తాము నేసిన బట్టలను కొనేవారు లేక) కూలీలుగా వేల సంఖ్యలో వలసబోయిన పద్మశాలీ బిడ్డలు ఈ ఉత్తర తెలంగాణవారే. రెండు దశాబ్దాల కాలంలో సాగునీరు లేక, బావులు, బోర్లు లక్షలాదిగా ఎండిపోవడంతో బోరులో నీళ్ల కోసం పదుల సంఖ్యలో బోర్లు వేసి అప్పులపాలై, పరువు పోయి పెరుగన్నంలో పురుగుమందు కలుపుకొని, చెట్ల కొమ్మలకు, ఇంటి దూలాలకు ఉరిబెట్టుకొని బలవన్మరణాలకు పాల్పడ్డ వేలాది రైతు బిడ్డలు ఉత్తర తెలంగాణవారే.
– (వ్యాసకర్త: చైర్మన్, భారత వర్షాధార నదీ పరీవాహక ప్రాంతాల కౌన్సిల్) వి.ప్రకాశ్