రానున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్ దిశగా పయనిస్తున్నదని సర్వేలన్నీ స్పష్టంగా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగి రేసులో ఉండగలదా? టీఆర్ఎస్ 90 సీట్లు చేరుకోగలదన్న అంచనాలను కాంగీయులు అడ్డుకునే పరిస్థితి ఉన్నదా అంటే లేదనే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకువెళ్తుంటే కాంగ్రెస్‌ను గత కాలపు తప్పిదాలు నీడలా వెంటాడుతున్నాయి. జాతీయ నాయకత్వ, స్థానిక నేతల కొట్లాటలు వెరసి ఒక్క చాన్స్ ఇవ్వండన్నా అనే నినాదంతో వెళ్తున్న కాంగ్రెస్‌కు ఆశాభంగం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి!
2009 డిసెంబర్లో తెలంగాణ ఏర్పాటు కోసం చిదంబరం చేసిన ప్రకటన, 10 నెలల్లోపు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయకుండా సీమంధ్రలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మె ల్యే, ఎంపీలు ప్రజలను రెచ్చగొట్టి తద్వారా 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో ఇటు కేసీఆర్ అటు జగన్ ద్వారా లబ్ధి పొందుదామని ప్రయత్నించటం ఆ పార్టీ పతనానికి ప్రధాన కారణం. కాంగ్రెస్ కుతంత్రాలను గమనించిన కేసీఆర్ 2014 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేసి విజయం సా ధించటం ద్వారా రాష్ట్ర దశ, దిశ మార్చారనటంలో ఎలాం టి అతిశయోక్తి లేదు. కాంగ్రెస్ విభజన బిల్లులో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు ఇచ్చిన హామీల్లో మెజారిటీ చూడండి, సాధ్యపడితే చేయండనే విధంగా ఉండటంతో బయ్యారం, కడప స్టీల్ప్లాంట్లు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, ఆంధ్రాకు ప్రత్యేక క్యాటగిరితో సహా మరికొన్నింటిని బీజేపీ తమకు రాజకీయ లబ్ధి లేదు కాబట్టి పూర్తిగా అటకెక్కించింది. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి దక్షిణాది రాష్ర్టాలు మెజారిటీ పార్లమెంట్ స్థానాలు అందిచ్చాయి. ప్రత్యేకించి ఆరు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు పర్యాయాలు తప్ప అన్ని ఎన్నికల్లో కాం గ్రెస్‌కు 30 నుంచి 41 స్థానాలు అందించాయి. ప్రత్యేకించి 77లో జనతా ప్రవాహంలో కూడా 41 స్థానాలు అం దిం చి, ఇందిరాగాంధీనీ మెదక్ నుంచి అత్యధిక మెజారిటీతో 1980లో గెలిపించి తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకున్నారు.
తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న ఐదేండ్ల కాలంలో ఆర్థిక సంస్కరణల ద్వారా ఐటీ, పారిశ్రామిక రంగాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి గ్రామీణ, వ్యవసాయ రంగాలకు వేల కోట్ల కేటాయింపులు జరిపి దేశాన్ని ఆదుకున్నారు.
తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న ఐదేండ్ల కాలంలో ఆర్థిక సంస్కరణల ద్వారా ఐటీ, పారిశ్రామిక రంగాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి గ్రామీణ, వ్యవసాయ రంగాలకు వేల కోట్ల కేటాయింపులు జరిపి దేశాన్ని ఆదుకున్నారు. ప్రధానిగా ఆయన పరిపాలనకు ఎన్నో ఇబ్బందులు కల్పించారు. పీవీ పార్ధ్థివ దేహాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్న కుసంస్కారం కాంగ్రెస్ పెద్దలది. అట్టడుగు కూలీ నుంచి కార్మిక నేత, ముఖ్యమంత్రిగా ఎదిగిన అంజయ్యను నాటి కాంగ్రెస్ యువరాజు బేగంపేట ఎయిర్‌పోర్టులో అవమానించిన తీరు పట్ల ప్రజలు రగిలిపోయారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ర్టాల్లో ఓట్లు దండుకున్నది కానీ, అభివృద్ధిలో ఆమడదూరం, అవమానంలో అగ్రతాంబూలం ఇచ్చింది. ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వయంగా తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశం కానీ, పార్టీని నడుపుకునే పరిస్థితి కానీ లేదు. హైదరాబాద్ టు ఢిల్లీ సాగే కాంగ్రెస్ నేతల ప్రయాణం కర్ణాటక ఎన్నికల తర్వాత వయా బెంగళూరుగా మారిపోయింది.
దశాబ్దాల చరిత్ర, నాయకత్వం ఉన్న కాంగ్రెస్ నేడు సునీల్ కనుగోలు లాంటి స్ట్రాటజిస్టులు, అక్రమ ఆదాయ కేసులు ఎదుర్కొంటున్న డీకే శివకుమార్ వంటి నేతల పర్యవేక్షణలో పనిచేయాల్సిన దుస్థితిలో ఉన్నారు. పోనీ రాష్ట్రం పట్ల నిబద్ధతతో కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమం కంటే మెరుగ్గా ఏం చేయగలమో స్పష్టంగా ప్రజలకు చెప్పలేకపోతున్నారు. కాళేశ్వరం, ధరణి, దళితబంధు, ఐటీ పాలసీ, రైతు బంధు, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు తదితర అంశాలపై కాంగ్రెస్ నాయకుల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రజల్లో మరింత చులకనవుతున్నారు. వలస వచ్చిన నేతలను ప్రోత్సహిస్తున్నారు తప్ప, పార్టీ పట్ల నిబద్ధతతో దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న ఎందరో కీలక నేతలను పట్టించుకోలేదు.
ఇప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు పూర్తిగా, మహబూబ్‌నగర్, మెదక్‌లో ఉన్న పట్టణ ప్రాంతలోని 34 నియోజకవర్గంలో నేటికీ 5-6 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ బలంగా ఉన్నదని పలు సర్వేల్లో స్పష్టమవుతున్నది. బీఆర్ఎస్ వల్ల సీమాంధ్రులు హైదరాబాద్‌లో దౌర్జన్యాలు, వివక్షతతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని, నక్సలైట్లు వస్తారు, కరెంట్ రాదంటూ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మొదలుకొని ఉభయ రాష్ర్టాల్లో కాంగ్రెస్ నేతలు విభజన సమయంలో పలు ఆరోపణలు చేశారు.
కేసీఆర్ సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే నోటితో తీస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నారు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ వారిని రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ నేటికీ ఒక్క అసెంబ్లీ స్థానం కూడా సెటిలర్లకు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం అన్నింటా అద్భుతమైన పురోగతిలో పయనిస్తున్న ఈ పరిస్థితుల్లో మరో మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లో కేసీఆర్ మూడోసారి విజయం ఖాయమనే చెప్పాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
ఇనగంటి రవికుమార్
94400 53047