వేదిక ఏదైనా, అంశం ఎలాంటిదైనా, శ్రోతలు ఎవరైనా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసే ప్రసంగాలన్నీ సాక్ష్యం ఆధారిత, అద్భుతమైన, విలువైన సమాచారంతో ఉండేవే. శ్రద్ధపెట్టి వినేవారికి సంబంధిత అంశానికి చెందిన సమస్త విషయం స్పష్టంగా అవగతమవుతుంది. కేసీఆర్ మాట్లాడే సందర్భంలో తన ప్రసంగ భావాన్ని వ్యక్తీకరించే విధానం,అమోఘమైన జ్ఞాపకశక్తి, ఏకకాలంలో బహువిధాల వివరణ ఇచ్చే సామర్థ్యం, తప్పులు దొర్లకుండా ఆశువుగా గణాంకాల వెల్లడి, సృజనాత్మకత, ప్రజ్ఞాపాటవాలతో రంగరించిన సూక్ష్మ హాస్యం, తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషా గ్రంథాల నుంచి విషయాలను విస్తృతంగా ప్రస్తావించడమనేది అసాధారణమైన ఆయన వ్యక్తిత్వానికి, భగవంతుడు ఆయనకిచ్చిన వరానికి, ఆయన ఏండ్ల తరబడి చేసిన కృషికి ప్రత్యక్ష నిదర్శనం. కేసీఆర్ సన్నిహితులే కాకుండా విరోధులూ అంగీకరించే వాస్తవం ఇది.
కేసీఆర్ చేసిన అనేకానేక ప్రసంగాల్లో ఇటీవల 2023, ఆగస్టు 6న రాష్ట్ర శాసనసభలో ‘తెలంగాణ రాష్ట్ర సాధన, తదనంతర ప్రగతి పథం’ అనే అంశం మీద జరిగిన లఘు చర్చకు సమాధానం ఇచ్చిన సందర్భంగా, సుమారు మూడు గంటల పాటు ఆయన వివరించిన తెలంగాణ రాష్ట్ర సాధన వాస్తవాల్లో, వర్తమాన, భావితరాల వారికి అవగతమయ్యే చాలా విషయాలున్నాయి. ఆయన చేసిన యావత్ ప్రసంగాన్ని దీక్షగా, శ్రద్ధగా వినగలగాలి. అలాగే ఆయన ప్రసంగ భావాన్ని, పదాల మధ్యన, పంక్తుల మధ్యన అంతర్లీనంగా ఇమిడి ఉన్న నిగూఢార్థాన్ని, అవగాహన చేసుకుంటూ, అధ్యయనం చేసుకుంటూ, క్లుప్తంగా క్రోడీకరిస్తేనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఎవరి పాత్ర ఏమిటో బోధపడుతుంది. ఆ వర్తమాన సంక్షిప్త చరిత్ర సమాహారమే ఈ వ్యాసం.
తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్క రోజుతో వచ్చింది కానీ, రాత్రికి రాత్రే జరిగింది కానీ, లేదా, ఎవరో దయతో ఇచ్చిన బహుమతి కానీ కానే కాదు. 58 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో అనేక మంది తెలంగాణవాదులు పాల్గొనడం వల్ల మాత్రమే అది సాధ్యమైంది. ఈ సుదీర్ఘ పోరాటానికి కారకులు ఎవరని ప్రశ్నించుకుంటే నిర్ద్వంద్వంగా వచ్చే సమాధానం, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఇది తెలిసీ తెలియని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే తమ పార్టీ చలువ వల్ల రాష్ట్రం వచ్చిందని అంటుంటారు. ఉన్న (నాటి) తెలంగాణను ఊడగొట్టింది, ఆంధ్రలో కలిపింది నెహ్రూనే. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని నాడు కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు లాంటివారు వ్యతిరేకించారు. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ.
67 ఏండ్ల కిందట తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుకాకపోవడంతో ఎన్నో రకాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిపోయింది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాన్ని మేధావులు, తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఇతరులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బూర్గుల రామకృష్ణారావు ఢిల్లీ విమానం ఎక్కేముందర, తెలంగాణ తప్ప మరేదీ అంగీకారం కాదన్నారు. తిరిగివచ్చిన తర్వాత విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘నెహ్రూ సాబ్ చెప్పిన తర్వాత తానేమీ మాట్లాడలేకపోయాననీ, మజ్బూర్లో ‘ఒప్పుకున్నానని’ అన్నాడు. ఇదంతా చరిత్ర. తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పక చెప్పే చరిత్ర.
ఇక ఆ తర్వాత ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’ లాంటి అనేక ఒప్పందాలు. అవన్నీ కాలరాసినవే. ఒక్కొక్క హామీ నెరవేర్చకుండా ఉల్లంఘించుకుంటూ పోతుంటే కిమ్మనకుండా ‘ప్రేక్షక పాత్ర’ వహించింది కూడా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులే. 1956లో విలీనాన్ని వ్యతిరేకించిన అనేక మందిని జైళ్లలో పెట్టారు. హైదరాబాద్ సిటీ కాలేజీ దగ్గర పోలీసు కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు పట్టపగలే మరణించారు. ఇవేవీ ఖాతరు చేయకుండా విలీనం జరిగిపోయింది.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, విద్యార్థుల,ఉద్యోగుల నాయకత్వంలో, ఉవ్వెత్తునఎగిసిపడిన 1969 నాటి మహోద్యమాన్ని కర్కశంగా అణచివేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. నాడు, తెలంగాణలోని కళాశాలలు, హాస్టళ్లు, అన్నీ జైళ్లుగా మారిపోయాయి. ఆ ఉద్యమం సందర్భంగా ఎంతమంది అమాయకులను కాల్చి చంపారో, ఎంతమందిని రాచిరంపాన పెట్టారో, ఎన్ని బాధలు పెట్టారో, తెలంగాణ ఎంత యాతన అనుభవించిందో, ఎన్ని వేల మంది విద్యార్థులను, యువకులను కోల్పోయిందో? ఆ ‘ఘన చరిత్ర’ ఆసాంతం కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే!
1971 లోక్‌సభ ఎన్నికల్లో ‘ప్రజాస్వామ్య తెలంగాణ ప్రాంత ఓటర్లు’ 14 మందికి 11 మందిని గెలిపించి, తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. యావత్తు తెలంగాణ గుండెను చీల్చి, ‘మా తెలంగాణ మాకు కావాలని’ నినదిస్తే నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, నిర్ద్వంద్వంగా నిరాకరించి, ‘తెలంగాణ లేదు’ అని తేల్చిచెప్పారు. ముల్కీ నిబంధనలు కొల్లగొట్టబడ్డాయి, ఉద్యోగాలు మొత్తం మాయమయ్యాయి, నీటి పారుదల ప్రాజెక్టులను దశాబ్దాల తరబడి పెండింగులో పెట్టారు. తెలంగాణ నిధులను దారి మళ్లించారు. అప్పుడు కూడా మూగ, మౌన ప్రేక్షక పాత్ర వహించింది భారత జాతీయ కాంగెస్ పార్టీ తెలంగాణ నాయకులే తప్ప మరెవరో కాదు. 41 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరచిన వ్యవహారాన్ని పునశ్చరణ చేసుకొని, యావత్ తెలంగాణ సమాజానికి జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
టీడీపీ వారు పదిహేడేండ్లు చేసిన నిర్వాకంలో పరిస్థితులు ఘోరంగా దిగజారిపోయాయి. ఒకానొక సందర్భంలో ‘తెలంగాణ’ అనే పదం కూడా సభలో అనడానికి వీల్లేదని నాటి సభాపతి రూలింగ్ ఇచ్చే స్థాయికి దిగజారితే, ప్రతిపక్షంలో ఉండికూడా నోర్లు పెగలకుండా మౌనంగా, ప్రేక్షకపాత్ర వహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇది జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన జగమెరిగిన సత్యం. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సంస్కరణల ముసుగులో విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచి, 15 శాతం చొప్పున ఆ పెరుగుదల మూడేండ్లు ఉంటుందని చెప్తే, ఉప సభాపతిగా ఉన్న కేసీఆర్ రాసిన నిరసన లేఖ బహిరంగంగా అన్ని పత్రికల్లో ప్రచురించారు. చివరికి కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో 2000, ఆగస్టులో హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో నిరసన చేస్తున్న రైతుల మీద పోలీసు కాల్పులు జరిపి ముగ్గురిని దారుణంగా చంపారు. ఆ సంఘటన తర్వాత, ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండాపోయిందని, కేసీఆర్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.
ఇక సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరగదని భావించిన కేసీఆర్, ఐదారు నెలలు కొందరు సన్నిహిత మిత్రులను కలిసి, వారి అభిప్రాయం తెలుసుకొని, సుదీర్ఘంగా చర్చలు జరిపి, మేధోమథనం చేసి, తెలంగాణ ప్రజల్లో ఉద్యమం పట్ల విశ్వాసం కలిగించే విధాన రూపకల్పన చేసి, ఉద్యమ పంథా పూర్తిస్థాయిలో నిర్ణయించుకొని, చివరికి 2001, ఏప్రిల్ 27న ‘కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశ్రయం’ కలిగించిన ఇంటి ప్రాంగణంలో జెండా ఎగురవేసి, అక్కడినుంచి ‘జై తెలంగాణ’ ప్రస్థానం ప్రారంభించడం జరిగిన చరిత్ర. తెలంగాణ సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తుంటే, అనేక రకాల ప్రలోభాలు పెట్టడం, తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని చీల్చే ప్రయత్నాలు చేయడం, అనేకరకాల హింసకు గురిచేయడం, ఉద్యమాన్ని అవహేళన చేయడం జరిగినప్పటికీ, వెనుదీయకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని ఉద్యమం కొనసాగిస్తే, ఆ ఒత్తిడికి తట్టుకోలేక రాష్ట్రం ఏర్పాటు చేయడం కూడా చరిత్రే. ఆ క్రమంలోనే చోటు చేసుకున్న మరి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
నాటి టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్)2004 సంవత్సరానికల్లా అద్భుతంగా పురోగమిస్తున్న సమయానికల్లా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉండి పదేండ్లవుతున్నది. వారిలో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి.ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకుపోవాలని నిర్ణయించి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణఏర్పాటుకు సమ్మతిస్తుందని తప్పుగా భావించి, టీఆర్ఎస్ 2004 ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. అలాగే ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’లో, తదనంతరం రాష్ట్రపతి ప్రసంగంలో కూడా రాష్ట్ర ఏర్పాటు అంశం చేర్చడం జరిగింది. జరిగింది శూన్యం. మళ్లీ పాత కథే మొదలైంది.
కాంగ్రెస్ పార్టీ నాయకుల అవహేళనలు చరిత్ర ఉన్నన్ని రోజులు ఉండిపోతాయి. రెండు ‘రాష్ర్టాల పునర్విభజన కమిటీ’ వేయాలని ఆంధ్రా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతుంటే తెలంగాణ కాంగ్రెస్ వారు దానికి తబలా కొట్టారు. తెలంగాణకు పోవాలంటే ‘వీసా’ తీసుకోవాలని ‘నర్మగర్భంగా’ నంద్యాలలో మాట్లాడిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ‘తెలంగాణ ఏర్పాటు ప్రశ్నే లేదు’ అని చెప్పినప్పుడు ఘనత వహించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనం దాల్చడం వాస్తవం. కేంద్రమంత్రి రేణుకాచౌదరి, తెలంగాణ ఇవ్వడమంటే ‘ఇన్‌స్ట్టంట్ కాఫీ’ లేదా ‘దోశ’ చేసినంత సులభం కాదని అవమానంగా మాట్లాడినప్పుడు, ‘తాను తెలంగాణ ఏర్పాటుకు అడ్డం కాదు, నిలువు కాదు’ అని వైఎస్ఆర్ ముసిముసి నవ్వులు నవ్వినప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులది మౌన ప్రేక్షక పాత్రే!
ఇక ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ విషయంలో చేసిన అవమానాలు అన్నీ, ఇన్నీ కావు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే అంధకారమవుతుందని జోస్యం చెప్పినప్పుడు, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని, ఎవరేం చేసుకుంటారో చేసుకోమని శాసనసభలో మాట్లాడినప్పుడు, సభలో ఉన్న ఒక్క తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, అలా ఎందుకు అంటారని ప్రశ్నించే సాహసం చేయలేదు. బెల్లం కొట్టిన రాళ్లలాగా కూర్చున్నారు. అంతకు ముందు ‘ఒక్క ఓటు రెండు రాష్ర్టాలు’ అని తీర్మానం చేసిన బీజేపీ, దాని సారథ్యంలోని ఎన్డీయే, వాజపేయి ప్రధానమంత్రి అయిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన నాటి హోం మినిస్టర్ అద్వానీ హైదరాబాద్ తెలంగాణలో ఉండగా ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు’ అని ఉపన్యాసం ఇచ్చి వెళ్లారు. ఆ మాటలు తెలంగాణను కించపరిచాయి. అలా, అలా తెలంగాణ సర్వస్వం కోల్పోతూనే వచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణలో ఆకలిచావులు, ఆత్మహత్యలు, విద్యుత్తు కోతలు, నగరాలకు వలసలు, ఇలా ఎన్నోరకాల దయనీయ పరిస్థితి కొనసాగుతుంటే, వీటన్నింటికీ వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంటే, రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పుండు మీద కారం చల్లినట్లు 14 (ఎఫ్) తీసుకొచ్చారు. తక్షణమే కేసీఆర్ సిద్దిపేటలో 3-4 లక్షల మందితో ఉద్యోగ గర్జన సభ నిర్వహించి, అక్కడినుంచే కార్యాచరణ ప్రకటించారు. మామూలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేటట్టు కనిపించడం లేదని, మంచో, చెడో తేల్చుకోవాలని, కేసీఆర్ శవయాత్రో, లేదా, తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని నిర్ణయించి, కేసీఆర్ నిరాహార దీక్షకు దిగారు. దీక్షకు ఉపక్రమించిన కేసీఆర్‌ను అరెస్టు చేసి, ఖమ్మం జైల్లో నిర్బంధించి, తర్వాత హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు.
కేసీఆర్ దీక్షలో ఉండి చనిపోతే అప్రతిష్ట పాలవుతామని, అట్టుడికిన లోక్‌సభ, 38 పార్టీలు గోల చేస్తే, ఆ దాడికి తట్టుకోలేక, చిదంబరంతో ప్రకటన చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడ్తున్నామని ప్రకటన చేయడం, ఆంధ్రా లాబీలు ఒత్తిడి తేగానే వెనక్కు తగ్గడం జరిగింది. దరిమిలా, వందల మంది విద్యార్థులు చనిపోయారు. ఆ బాధలో ఉద్యమం ముందుకుసాగింది. హెలిక్యాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణించడం, ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం పక్కనపెట్టడం, ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఉప ఎన్నికల్లో విజయాలు సాధించడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆంధ్రా ప్రాంతంలో 2014 ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశాల్లేవని భావించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తే, ఇక్కడన్నా కనీసం 10 లోక్‌సభ స్థానాలు రాకపోతాయా అనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్ఠానం వచ్చింది.
అలా ఆ ఒత్తిడి వల్ల రాష్ట్రం ఇచ్చారు తప్ప, తెలంగాణ మీద ప్రేమతో కానీ, ఒక సిద్ధాంతంతో కానీ, ఒక నిబద్ధతతో కానీ ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే బీజేపీ కానీ, మరెవరి దయాదాక్షిణ్యాల వల్ల కానీ రాలేదు. కేసీఆర్ నాయకత్వంలోని పోరాట, ఉద్యమ ఫలితంగా వచ్చిందే తెలంగాణ రాష్ట్రం. ఇది చరిత్ర. ఇది వాస్తవం.
ఆ విధంగా 2014, జూన్ 2న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని అభివృద్ధిని అచిరకాలంలోనే సాధించింది. ‘తెలంగాణ నమూనా’ దేశానికే ఆదర్శమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా రాష్ర్టాల, దేశాల అభివృద్ధిని అంచనా వేసే గీటురాళ్లు ఉంటాయి. వాటి ప్రకారం… తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,12, 000 ఉంటే, ఒకేసారి మనతో పాటే ఏర్పాటైన పొరుగు రాష్ర్టానిది రూ.2,19,000 మాత్రమే. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక లాంటి తెలంగాణ కన్నా పెద్ద రాష్ర్టాలను తలదన్ని వాటి తలసరి ఆదాయం కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్ర ఆవిర్భావం నాడున్న రూ.5 లక్షల నుంచి రూ.13 లక్షలకు పెరిగింది. తలసరి విద్యుత్తు వినియోగం 2,126 యూనిట్లు, స్థాపిత విద్యుత్తు సామ ర్థ్యం 18,453 మెగావాట్లు, పీక్ డిమాండ్ 15,497 మెగావాట్లు ఉన్నాయి. అలాగే వైద్య, విద్యారంగాల అభివృద్ధిలో, రక్షితనీటి సరఫరా విషయంలో, మాతా శిశు మరణాల రేటు తగ్గడంలో అనేక ఆవిష్కరణలు, అన్నిరంగాల సామూహిక, సమ్మిళిత అభివృద్ధి జరిగింది. ఉద్యమ నాయకుడే రాష్ట్ర రథసారథి కావడం కూడా దీనికి కారణం.
కేవలం తొమ్మిదిన్నరేండ్లలోనే ఇంత అభివృద్ధి జరిగినప్పుడు 67 ఏండ్ల కిందటనే తెలంగాణ ఏర్పాటు జరిగి ఉంటే ఇంకెంత అభివృద్ధి జరిగి ఉండేదో? అలా జరగకుండా అడ్డుపడ్డది కాంగ్రెస్ పార్టీనే, నెహ్రూనే. విమర్శలు చేసేవారు ఇది గమనిస్తే మంచిదేమో! అలాగే జరిగిన అభివృద్ధిని గుర్తిస్తే మరీ, మరీ మంచిదేమో!
(2023 ఆగస్టు 6న రాష్ట్ర శాసనసభలో ‘తెలంగాణ రాష్ట్ర సాధన, తదనంతర ప్రగతి పథం’ అనే అంశం మీద జరిగిన లఘు చర్చకు సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం ఆధారంగా)
వనం జ్వాలా
నరసింహారావు