Alkaline Water | ఆల్కలీన్ వాటర్ తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాలు కూడా నయమవుతాయని కొంతమంది నమ్ముతున్నారు. దీంతోఈ నీటికి పెద్ద మార్కెట్ ఏర్పడింది. అసలు ఆల్కలీన్ వాటర్ అంటే ఏమిటి? దానిఉపయోగాలు ఏమిటి? అన్న ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం చాలా అవసరం.ఆల్కలీన్ వాటర్ ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిరూపించడానికి ఎటువంటి శాస్త్రీయ పరిశోధన జరగలేదు. దానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు.
ఆల్కలీన్ వాటర్ అనేది ఒక ప్రత్యేక రకమైన నీరు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నీటికే కృత్రిమ ఖనిజాలను కలపడం వల్ల అది నలుపు రంగులోకి మారుతుంది. ఆ నీటినే బ్లాక్ వాటర్‌గా పిలుస్తున్నారు. దీని పీహెచ్ విలువ 8-9 మధ్యలో ఉండి ఆల్కలీన్ వాటర్‌గా పని చేస్తుంది. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తాగడం వల్ల ఆల్కలీన్ వాటర్‌కు మరింత ప్రాచుర్యం లభించింది.
మనం మాంసాహారం తిన్నపుడు ఆ ఆహారం మన కడుపును ఆమ్లంగా మారుస్తుంది. చాలామంది మాంసాహారాన్ని తినేటప్పుడు నిమ్మకాయ రసాన్ని పిండుకొంటారు. సాధారణంగా నిమ్మరసం పీహెచ్ 2గా ఉండి ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. కానీ నిమ్మరసం మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత క్షారంగా మారుతుంది. మాంసాహారం తినడం వల్ల కడుపులో ఏర్పడిన ఆమ్లత్వాన్ని, క్షారంగా మారిన నిమ్మరసం తటస్థీకరించి (న్యూట్రలైజ్) కడుపులో ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. విరాట్ కోహ్లీ అధికంగా మాంసం తీసుకోవడం వల్ల కడుపులో ఎసిడిటీ ఏర్పడింది. దాన్ని తటస్థీకరించడం కోసం శరీరం అతని ఎముకల్లోని కాల్షియాన్ని సంగ్రహించింది. దాంతో అతనికి సర్వైకల్ స్ప్రీన్ దగ్గర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వీటిని నివారించడానికి డాక్టర్ సలహా మేరకు విరాట్ కోహ్లీ మాంసాహారాన్ని తగ్గించి ఆల్కలీన్ వాటర్ తాగటం ప్రారంభించాడు.
2002లో రాబర్ట్ ఓ.యంగ్ అనే ఒక అమెరికన్ ప్రకృతి వైద్యుడు, మొట్టమొదటిసారి శరీరంలో ఆల్కలీన్ పీహెచ్‌ను సృష్టించడంపై ప్రతిపాదన చేశాడు. అతను చెప్పినదాని ప్రకారం శరీరం ఆమ్లత్వాన్ని కలిగి ఉండటమే అనారోగ్యం. క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణం. దాన్ని తగ్గించాలంటే క్షారయుత ఆల్కలీన్ నీరు, ఆహారాన్ని తీసుకోవాలి. రసాయన శాస్త్రం ప్రకారం ఒక ఆమ్లం, క్షారం కలిసినప్పుడు తటస్థీకరణ జరిగి తటస్థ పదార్థాలు ఏర్పడుతాయి. అలా శరీరంలో గల హానికర ఆమ్లాలు ఆల్కలీన్‌తో చర్య జరిపి తటస్థ పదార్థాలు ఏర్పడుతాయని రాబర్ట్ యంగ్ ప్రతిపాదించాడు. తద్వారా ఆల్కలేరియన్ జీవనశైలిని ప్రవేశపెట్టాడు. రోగుల శరీరంలోకి బేకింగ్ సోడా కలిపిన ఇంట్రావీనస్ ద్రవాలను ఎక్కించాడు. బేకింగ్ సోడా క్షార స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల అది శరీరంలో క్షార పరిస్థితులను సృష్టించి వ్యాధులను నయం చేస్తుందని అతని భావన. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అశాస్త్రీయ వైద్య విధానాలు, లైసెన్స్ లేకుండా వైద్యం చేసినందుకు 2017లో అమెరికాలో రాబర్ట్‌కు మూడేండ్ల జైలు శిక్ష విధించారు.
మానవ శరీర రక్తం పీహెచ్ 7.35 నుంచి 7.45 వరకు స్థిరంగా ఉంటుంది. ఆహారం లేదా నీరు ఎంత ఆల్కలీన్ అయినప్పటికీ రక్తం పీహెచ్ మారకుండా స్థిరంగా ఉంటుంది. మూత్రపిండాలు మూత్రం ద్వారా శరీరంలో ఏర్పడిన అధిక ఆమ్లాలను బయటకు పంపిస్తాయి. ఊపిరితిత్తులు ఆమ్ల స్వభావం కలిగిన కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపుతాయి. ఈ రెండు అవయవాలు బాగా పనిచేస్తున్నంత వరకు మనం తినే ఆహార పదార్థాలు, తాగే ద్రవాలు శరీర పీహెచ్, రక్తం పీహెచ్ స్థాయిని మార్చవు. ఉదాహరణకు మనం ఆల్కలీన్ నీరు తాగామనుకోండి. ఆ నీరు కడుపులోకి చేరిన తర్వాత, కడుపులోని ఆమ్లాలు ఆ నీటిని తక్షణమే తటస్థీకరిస్తాయి. తర్వాత ఆ నీరు ఆల్కలీన్ స్వభావం కలిగిన ప్యాంక్రియాటిక్ రసం తో కలుస్తుంది. అయితే, ప్యాంక్రియాటిక్ రసం ఆల్కలీన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాని పీహెచ్ సాధారణంగా 8.3 నుంచి 8.6 వరకు ఉంటుంది. కాబట్టి అధిక పీహెచ్ కలిగిన ఆల్కలీన్ వాటర్‌ను తాగినప్పటికీ ఇక్కడ దాని పీహెచ్ సమం అవుతుంది. కాబట్టి అధిక ఖర్చు పెట్టి ఆల్కలీన్ వాటర్ తాగడమనేది వృథా. ఆమ్ల స్వభావం కలిగిన నిమ్మరసం (పీహెచ్ 2) లేదా ఆల్కలీన్ స్వభావం కలిగిన బేకింగ్ సోడా ద్రావణం (పీహెచ్ 9) తాగినా రక్తం పీహెచ్ మారదు.
158 ఏండ్ల చరిత్ర కలిగిన అమెరికాకు చెందిన మయో క్లినిక్ వైద్యులు ఆల్కలీన్ వాటర్‌కు సంబంధించి ఎటువంటి శాస్త్రీయ పరిశోధనలుగాని శాస్త్రీయ ఆధారాలుగాని లేవని తేల్చిచెప్పారు. మయో క్లినిక్‌కు చెందిన ఎండోక్రైనాలజీ/ న్యూట్రిషన్ వైద్యుడు కేథరీన్ జెరాట్స్కీ ప్రకారం చాలామంది నీరు తగినంతగా తాగరు. కానీ ఆల్కలీన్ వాటర్ అనేసరికి ఎక్కువగా తాగడం వల్ల మంచి అనుభూతి పొందుతారు. ఆరోగ్యం ఉల్లాసంగా అనిపిస్తుంది. నిజానికి దీనికి కారణం ఆల్కలీన్ వాటర్ కాదు. మామూలు నీటిని ఎక్కువగా తాగినా కూడా అదే అనుభూతి లభిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మాజీ శాస్త్రవేత్త, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)లో నిపుణుడైన వీ సుదర్శన్ రావు ఆల్కలీన్ వాటర్ గురించిన వాదనలను కొట్టిపారేశారు. ఇది కేవలం ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీల జిమ్మిక్కుగా అభిప్రాయపడ్డారు. నిజానికి ఆల్కలీన్ నీటిని అధికంగా తాగడం వల్ల జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియా చనిపోయే ప్రమాదం ఉన్నది.
వర్షపు నీరు అతి పరిశుభ్రమైన నీరు. దాంట్లో ఎటువంటి ఖనిజాలు ఉండవు. వర్షపు నీరు భూమిపై పడినప్పుడు భూమిలో గల కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఆ నీటిలో కరిగిపోతాయి. తద్వారా సహజ సిద్ధమైన ఆల్కలీన్ వాటర్‌గా మారుతుంది. ఈ వర్షపు నీరే భూమిలోకి ఇంకి భూగర్భ జలాలుగా మారుతాయి. నీటిలో కరిగి ఉన్న ఖనిజాల శాతం పెరుగుతున్న కొద్దీ నీటి ఆల్కలినిటీ పెరుగుతుంది. నీటిలోని ఖనిజాల పరిమాణాన్ని టీడీఎస్ మీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రకారం తాగు నీటి టీడీఎస్ విలువ 80 నుంచి 300 పీపీఎం మధ్య ఉండాలి (పీపీఎం అంటే పార్ట్స్ ఫర్ మిలియన్). ఈ పరిమాణంలో టీడీఎస్ విలువ గల సహజ సిద్ధమైన నీరు ఆల్కలీన్ నీరుగానే పనిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆల్కలీన్ వాటర్ శాస్త్రీయ ఆధారాలు లేనటువంటిది. కాబట్టి దాని కోసం డబ్బు ఖర్చు పెట్టడం వృథా. దీనికి బదులు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే నీరు అద్భుత ఔషధంగా పని చేస్తుంది. ఆ నీటిని కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.
(వ్యాసకర్త: ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్)
-డాక్టర్ శ్రీదరాల రాము
94411 84667