Congress Govt | కొత్తగా ఏర్పడిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒక విషయం గుర్తుంచుకోవాలి. గత ప్రభుత్వ పాలనలో ఏవైనా లోపాలున్నట్లు భావిస్తే వాటిని ఎత్తిచూపటం కొద్దికాలం వరకు సరే. కాని ఆ పని దీర్ఘకాలం పాటు చేస్తూపోయినా, స్వయంగా తాము నెరవేర్చని హామీలకు బలి పశువులను, సాకులను గత ప్రభుత్వంలో వెతుకుతూ పోయినా ప్రజలు హర్షించరు. అందుకే గదా మీకు అధికారం ఇచ్చింది? చేస్తామన్నవి చేయకుండా సాకులు వెతుకుతారా? అంటారు. ఆ ధోరణిని అసమర్థతగా తీసుకుంటారు.
కేసీఆర్ ప్రభుత్వపు మంచిచెడులు ఏమిటన్నది ప్రజలు తమ పద్ధతిలో తాము ఇప్పటికే చూశారు. ఆయన తమకోసం ఎంతెంతో చేసినట్టు ఎన్నికల ముందు చెప్పుకున్నట్టే ఆ తర్వాత కూడా చెప్పుకొంటున్నారు. అయినప్పటికీ ఎన్నికలలో ఓటమి ఎందుకు సంభవించిందనే ప్రశ్నపై పట్టణాల్లో, గ్రామాల్లో నిరంతర చర్చలు సాగుతున్నాయి. కేసీఆర్ పాలన చేసిన మేలేమీ లేదన్నది సార్వజనీన అభిప్రాయమై ఉంటే వారి తీర్పు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మహా తీవ్రంగా ఉండేది. కానీ తీర్పు అట్లా లేదు. చర్చలు అట్లా సాగటం లేదు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రాగల కాలంలో పరిపాలన సాగించేందుకు ఈ విధమైన స్పృహ కూడా పలు భూమికలలో ఒకటి కావాలి. సూటిగా చెప్పాలంటే, ఆయన ప్రభుత్వం గత ప్రభుత్వ పాలనలో బలి పశువులను వెతుకుతూ, తమ హామీలు నెరవేర్చని తనాన్ని ఆ బలి పశువులకు అంటగడుతూ పోవాలని చూస్తే, అందుకు ప్రజలు ఒప్పుకోగల పరిస్థితులు లేవని గుర్తించాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఇప్పుడు సూటిగా చూస్తున్నది హామీల అమలు కోసం. ప్రజలు కొన్నేండ్ల కిందటి వరకు కన్జర్వేటివ్గా ఉండేవారు. మన దేశపు దీర్ఘకాలిక ఫ్యూడల్ వ్యవసాయిక నేపథ్యం, గ్రామీణ కుల సమాజం, మత ప్రాబల్యం, నెమ్మదిగా సాగే అరకొర సంస్కరణలు, పేదరికం, నిరక్షరాస్యత, బలమైన కుటుంబ వ్యవస్థల వంటి పరిస్థితులలో ఈ కన్జర్వేటిజం రూపుదిద్దుకొని వర్ధిల్లింది. ప్రజలు రాజకీయ పార్టీలను చూడటం గాని, ప్రభుత్వాల నుంచి ఏదైనా ఆశించటం గాని అందుకు అనుగుణంగానే ఉండేది. ఆ కాలమంతా ప్రజలు అల్ప సంతోషులు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాల కోసం ఓపికగా ఎదురుచూసేవారు. ఇద్దరికి ఏదైనా లభిస్తే తక్కినవారు తమ వంతు కోసం వేచి ఉండేవారు. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు, ఆ తర్వాత కూడా ఈ స్థితి ఉండేది.
కాని 1990లు వచ్చేసరికి ప్రజల ఆలోచనలు, స్వభావాలు మారటం మొదలైంది. ఆర్థిక సంస్కరణల ప్రభావం కూడా పడసాగింది. అందుకు తగినట్టు కొత్త తరాలు ముందుకువచ్చాయి. ఫ్యూడల్ పట్టుసడలి నెమ్మదిగా పెట్టుబడిదారీ ఆర్థికాభివృద్ధి, మనుషుల అవసరాలు, పరిసర పరిస్థితులు, వేగంగా సాగుతుండిన పట్టణీకరణ,కన్జూమరిజం, విదేశాలకు ఎక్స్పోజర్, పెరుగుతున్న చదువుల వంటివి కనిపించసాగాయి.
ఇక్కడ నక్సలైట్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, కొన్ని సామాజిక ఉద్యమాలు తెచ్చిన చైతన్యం అందుకు అదనమయ్యాయి. దీనంతటి ప్రభావంతో ప్రజలు, యువతరాలు ఆయా రాజకీయపార్టీలను చూసే సరళి కూడా సహజంగానే మారసాగింది. మంచిచేసిన నాయకునికి అభిమానంతో కట్టుబడి ఉండటం క్రమంగా తగ్గుతున్నది. తన జేబు నుంచి ఇస్తున్నాడా, ఎవరొచ్చినా ఇస్తారనే ధోరణి పెరుగుతున్నది. ఈ విధమైన ఓటరు పరివర్తన, సామాజిక, ఆర్థిక పరివర్తనను అన్ని పార్టీలు అర్థం చేసుకోవటం మంచిది.
ఇదంతా చర్చించటం ఎందుకంటే, ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు ఒకప్పటి వలె ఓపికగా దీర్ఘకాలం ఎదురుచూసే పరిస్థితి లేదు. మరొక మాటలో చెప్పాలంటే హానీమూన్ కాలం ఇప్పుడు అతి చిన్నది. ఉదాహరణకు ఇందిరాగాంధీ గరీబీ హటావోలో జరిగినవి అరకొర అయినా ఏండ్ల తరబడి వేచి ఉండిన ప్రజలు, కేసీఆర్ దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఒక పక్క నుంచి క్రమంగా ఇస్తుండినా తక్కినవారు ఓపిక పట్టలేకపోయారు. దీనంతటి సారాంశం ఏమంటే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వ హామీల అమలు ఆలస్యమైనా లేక అసలు అమలు కాకపోయినా, అందుకు గత ప్రభుత్వంలో బలి పశువులను వెతికితే ప్రజలు హర్షించబోరన్న మాట.
అట్లాగని ఇంతకాలపు పరిపాలనను కొత్త ప్రభుత్వం అసలు సమీక్షించవద్దని కాదు. సమీక్షించవచ్చు, అందులో లోపాలు కనుగొంటే సరిదిద్దవచ్చు, మంచిని గ్రహించదలచుకుంటే గ్రహించవచ్చు. అంతే తప్ప, ఒక వేళ తాము మునుముందు విఫలమైతే అందుకు సాకులు వెతికిపెట్టుకోవటమే సమీక్షల పరమోద్దేశం కాకూడదు. ప్రజలు ఆమోదించనిది సరిగా ఈ వైఖరినే. పైగా, కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలలో ఏమేమి చేసిందన్నది ప్రజల కళ్లెదుట ఉన్నప్పుడు, వారి అనుభవంలోని విషయమైనప్పుడు, వాస్తవం ఏమిటి? కొత్త ప్రభుత్వం తన హామీలను అమలుపరుస్తున్న తీరేమిటి? అన్న విషయాలన్నింటిని ప్రజలు బేరీజు వేసుకోవటం ఎక్కువ ఆలస్యం లేకుండానే మొదలవుతుంది.
ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ మ్యానిఫెస్టోను చూద్దాం. ఆ 42 పేజీల పత్రంలో 37 భాగాలున్నాయి. అవిగాక సుపరిపాలన, 6 గ్యారంటీల కార్డు, 5 డిక్లరేషన్లు, అనుబంధ మ్యానిఫెస్టో పేర జాబ్ క్యాలెండర్లున్నాయి. వీటిలో వారు అన్నింటికన్న ఎక్కువగా ప్రచారం చేసింది గ్యారంటీల కార్డు గురించి. దాని అమలుకు 100 రోజుల గడువును వారే ప్రకటించారు. అదిగాక జాబ్ క్యాలెండర్లో ఆయా ఉద్యోగాలకు నిర్దిష్టమైన తేదీలు ఇచ్చినందున అవికూడా గడువుల వంటివే. అంతేకాదు, అధికారానికి వచ్చిన తర్వాత తొలిమంత్రి వర్గ సమావేశంలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత, మెగా డీఎస్సీ ప్రకటన, 9వ తేదీ నాడు రూ.2 లక్షల రుణమాఫీ వంటి ఇతర నిర్దిష్టమైన హామీలున్నాయి. గడువు అయితే 100 రోజులు ఉన్నప్పటికీ, యాసంగి పంటలు మొదలవుతున్నందున అందుకోసం రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి ఈ విడతగా రూ.7,500, కౌలుదార్లకు రూ.7,500 చొప్పున వెంటనే ఇవ్వవలసి ఉంది.
కల్లాల్లో ఉన్న పంటను కొనటంతో పాటు, క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాల్సి ఉంది. వీటన్నింటి పరిస్థితి (జాబ్ క్యాలెండర్లో మొదటిది అయిన గ్రూప్ వన్‌కు ఫిబ్రవరి 1 వరకు సమయం ఉంది.) ఏమిటో అందరూ చూస్తున్నదే. 100 రోజుల గడువు గల గ్యారంటీ కార్డు విషయానికి వస్తే, అందులోని అంశాలు 6. వాటిలోని ఉప అంశాలన్నింటిని లెక్కిస్తే మొత్తం హామీలు 13. వాటిని పేర్కొనాలంటే, 1.మహాలక్ష్మి. అందులో భాగంగా మహిళలకు ప్రతి నెల రూ.2500, బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్. 2.రైతు భరోసా. అందులో భాగంగా రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15,000. కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15,000. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12,000. వరి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్. 3. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. 4.ఇందిరమ్మ ఇండ్లు. అందులో భాగంగా ఇల్లులేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం. 5.యువ వికాసం. అందులో భాగంగా విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, అదిగాక ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూళ్లు. 6.చేయూత. అందులో భాగంగా నెలవారీ పింఛన్లు రూ.4,000కు పెంచటం. రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు హెచ్చించటం. వీటన్నింటి అమలుకు గడువు 100 రోజులు. అంతేగాక ఈ కార్డుకు చట్టబద్ధత కల్పించటం. దాని అర్థం ఈ అన్నింటిలో ఏది అమలుకాకపోయినా, వాటి అమలు కోసం ప్రజలు కోర్టుకు వెళ్లవచ్చునన్న మాట.
ఈ మొత్తం 13 ఉప అంశాల్లో ఇప్పటికి అమలుకు తెచ్చినవి రెండు. ప్రభుత్వం 7వ తేదీన ఏర్పడిన తర్వాత మొదటి రెండు రోజుల్లోనే ఆరింట రెండింటిని అమలుచేసినట్టు ప్రజలకు చెప్తున్నది. కాని అది నిజం కాదని గ్యారంటీ కార్డును చూసినట్టయితే స్పష్టమవుతుంది. మహాలక్ష్మి, చేయూత అనే రెండు అంశాలలో గల ఐదు ఉప అంశాలలో ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ అనే రెండు అంశాలు అమలుకు తేగా (నిజానికి ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచటం కేసీఆర్ ప్రభుత్వం ఏడాది క్రితమే చేసింది) ఇంకా మూడు మిగిలి ఉన్నాయి.
ఆ విధంగా మొత్తం 13 ఉప అంశాలలో ఇంకా 11 అమలు కావలసి ఉంది. పోతే, రైతు భరోసా లోని మూడు ఉప అంశాలలో ఒకటి మాత్రం అమలుకు వచ్చింది. అది కూడా కొంత మేరకే. రైతులకు ఎకరానికి పంటకు రూ.7,500 అని చెప్పగా, ఈ పంటకు పాత పద్ధతిలో రూ.5,000 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం పెట్టుకున్న గడువు 100 రోజులు అయినందున, వచ్చే మార్చి 15లోగా తక్కిన రూ.2500 బకాయీ చెల్లించవలసి ఉంటుంది. అట్లాగే ఆ సరికి మిగిలిన 11 ఉప అంశాలు అమలుచేయవలసి వస్తుంది. అదేవిధంగా కార్డుకు చట్టబద్ధత.
మార్చి నాటికి కొత్త ప్రభుత్వం తన బడ్జెట్‌ను ప్రతిపాదిస్తుంది గనుక, తమ మ్యానిఫెస్టో యావత్తు అందులో ప్రతిఫలించగలదని ప్రజలు ఆశిస్తారు. అందులో భాగంగా ఈ 13 ఉప అంశాలు శాశ్వత ప్రాతిపదికపై, పూర్తిస్థాయిలో ఉండాలి.
ఈ ఆరు గ్యారంటీ హామీలలో ప్రభుత్వం నగదు రూపంలో ఈ 100 రోజులలోనే చెల్లించవలసినవి మహిళలకు నెలకు రూ.2500, రైతులకు, కౌలుదారులకు ఎకరానికి రూ.15,000 లెక్క చొప్పున ఈ యాసంగికి రూ.7,500, వ్యవసాయ కూలీలకు అదే ప్రకారం సగం చేసినా రూ.6,000, కల్లాలలో ఉన్న వరికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్, ఇల్లులేని వారికి జాగతోపాటు రూ.5 లక్షలు, నెలవారీ పింఛన్లు రూ.4,000. మిగిలిన మొత్తాలు గ్యాస్ ఏజెన్సీలు, ఆర్టీసీ, విద్యుత్తు సంస్థలు, వైద్య సంస్థలకు భర్తీ చేయవలసినవి గనుక ఆ బిల్లులు ఆపి ఉంచవచ్చు.
ఇవిగాక తక్కిన మ్యానిఫెస్టో హామీల్లోనూ నగదు చెల్లింపుల అంశాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12,000 సహాయం, నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి, ఎస్సీ, ఎస్టీలకు దళితబంధు తరహాలో రూ.12 లక్షల ఆర్థిక సహాయం, దివ్యాంగుల పింఛన్లు రూ.6,000కు హెచ్చింపు, కళాకారులకు పింఛన్లు నెలకు రూ.3,000 మొదలైనవి. ఇందులో రుణమాఫీ అయితే రేవంత్‌రెడ్డి తాము అధికారానికి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నాడు ఆ పని చేయగలమని, రైతులు వెంటనే బ్యాంకులకు వెళ్లి రెండేసి లక్షలు రుణం తెచ్చుకోవాలని చెప్పారు. ఆ మాఫీ ప్రకటన ఆ రోజున రాలేదన్నది అటుంచితే, ప్రజలు మొదట 100 రోజుల గడువు హామీల కోసం మరీ ముఖ్యంగా ఎదురుచూస్తారు. గ్యారంటీ కార్డుపై ఇక్కడి కాంగ్రెస్ నాయకులే గాక ఢిల్లీ వారు కూడా పదే పదే నమ్మబలికారు గనుక. అట్లా మార్చి 15 వరకు 100 రోజుల కాలంతో పాటు ప్రభుత్వం ప్రతిపాదించే కొత్త బడ్జెట్ పద్దుల కోసం కూడా ఎదురుచూస్తారు.
ఇదంతా వివరించుకోవటం ఎందుకంటే, 6 గ్యారంటీలకు మొదటి మంత్రివర్గ సమావేశంలోనే చట్టబద్ధత కల్పిస్తామని ఆ పనిచేయకపోవటంపై, రైతుభరోసా సొమ్ము తగ్గటంపై, ఎందుకు తగ్గించారో తక్కిన రూ.2500 మాటేమిటో వివరణ లేకపోవటంపై, అధికారానికి రాగానే డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ హామీపై, మొదటి క్యాబినెట్ మీటింగులోనే మెగా డీఎస్సీ అన్న మాట గురించి, కల్లాలలో గల పంటకు రూ.500 బోనస్ విషయమై గ్రామాలలో, ఇతరత్రా కూడా మాటలు వినవస్తున్నాయి. ప్రజావాణి ప్రతిరోజు అని చెప్పి అంతలోనే వారానికి రెండురోజులు చేయటంపై వ్యాఖ్యానిస్తున్న వారు కూడా ఉన్నారు. వేలకు వేలుగా వస్తున్న వినతి పత్రాల పరిష్కారం మాట సరేసరి. అది కొంతకాలం వేచి చూడవలసిన విషయం.
మొత్తమ్మీద అటు ప్రజలు, మరొక వైపు నిపుణులు, మేధావుల్లో హామీల అమలు సాధ్యాసాధ్యాలపై జరుగుతున్న చర్చలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచగలవని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అమలు వెనుకముందులు అయే పక్షంలో ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. ఈ స్థితి అంతా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి బలి పశువులను వెతికే అవసరాన్ని సృష్టించవచ్చు. కాని అట్లా సాకులు వెతికే ప్రయత్నం చేసినట్టయితే తమ విశ్వసనీయత దెబ్బతినగలదని, ప్రజలు ఆ ప్రయత్నాలను ఆమోదించబోరని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి.
-టంకశాల అశోక్