అరిషడ్వర్గాలు మామూలు మనుషుల్లో ఉంటే వారు, వారి కుటుంబాలు మాత్రమే నాశనమవుతాయి. కానీ ఈ లక్షణాలు పాలకులలో ఉంటే దేశాలు నాశనమవుతాయి. ఈనాడు ప్రజలను పరిపాలించేవారిని రాజకీయ నాయకులు అంటున్నాము. ఈ నాయకులలో రాజసం పాలు కొద్దిగా ఎక్కువ ఉంటుంది కనుక వారికి ఈ నకారాత్మక భావాలు కొద్దిగా బలంగా ఉంటాయి. కానీ అవి శృతి మించితే మిగతా మానవతా భావాలు మాయమై, రాక్షసులలాగా ప్రవర్తించే ప్రమాదం ఉంది.
నిజానికి రాష్ర్టాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. అడిగినపుడు, ప్రమాణం చేసినపుడు ఇవ్వడాన్ని ఆదరం అంటారు. ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం ఇవ్వడాన్ని ‘అవకాశవాదం’ అంటారు. ఈ సారి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ రాష్ర్టాన్ని ఇచ్చిందంటే కర్రు కాల్చి వాత పెట్టాలి! ఊరి నుంచి తరిమి కొట్టాలి.
ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఈ పరిస్థితి ఎన్నికలప్పుడు మరింత తీవ్రరూపం దాలుస్తుంది. తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. రెండుసార్లు విజయం సాధించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయటమే కాకుండా, అన్ని రంగాలలోనూ ప్రప్రథమ స్థాయిలో నిలిపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదీ కేవలం తొమ్మిది సంవత్సరాలలో! మరి మిగతా (ఇక్కడ విపక్షం అనదగిన స్థాయి లేదు కనుక) పార్టీలు ఇప్పుడు ఏం చేస్తాయి? ప్రజలు ఏమేం మాటలు వినాల్సి వస్తుంది? ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఏమి నిర్ణయం తీసుకోవాలి? ఎన్నికలలో ఎవరిని గెలిపించాలి? చూద్దాం! తెలంగాణలో అత్యధిక సంఖ్యా బలం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ తొమ్మిదేండ్లలో ఏం చేసిందో ప్రజల కండ్ల ముందే ఉంది. ఇంకా ఆ పార్టీ ఏమి చేస్తుందో అక్టోబరులో మ్యానిఫెస్టో చెప్తుంది. మొన్న పత్రికా సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పనే చెప్పారు. “ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కొనసాగుతుంది. రాష్ర్టాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం” అని. మరి మిగతా పార్టీల విషయం?
మొట్టమొదటగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో చూద్దాం. 1999 నుండీ తెలంగాణను బీజేపీ మోసం చెయ్యటం మొదలుపెట్టింది. “ఒక్క ఓటు, రెండు రాష్ర్టాలు” అని ఓట్లేయించుకున్న నినాదం అధికారంలోకి వచ్చాక గాలిలో కలిసిపోయింది. వారి పాలనలో మూడు కొత్త రాష్ర్టాలను ఏర్పరచినా తెలంగాణ బాధలు పట్టించుకోలేదు. దానికి మన రెండు కండ్ల సిద్ధాంతి గారి ప్రభావం ఉండి ఉండొచ్చు అనుకున్నాం. ఎందుకంటే తన అపారమైన బుద్ధి బలంతో బీజేపీని గెలిపించి వాజ్‌పేయిని ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోపెట్టి, వారికి పాలన నేర్పించిన చంద్రబాబు చెయ్యో, కాలో అడ్డుపెట్టి ఉండొచ్చు. ఇక 2014 దాకా బీజేపీకి అధికారం లేక తెలంగాణకి సహాయం చెయ్యలేదేమో అనుకోవటానికి వారి తరువాతి ప్రవర్తన, మాటలు సహకరించటం లేదు. ఇంకా అధికారంలోకి రాకుండానే, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ రాష్ట్ర విభజనను “తల్లిని చంపి, పిల్లని బయటకు తీశారని” వర్ణించారు. ఆ మాట వారి అవగాహన లేమినే కాకుండా, తెలంగాణ రాష్ట్రం పట్ల వారి విద్వేషాన్ని కూడా బహిర్గతం చేసింది. పోనీ ఆంధ్రా రాజకీయ నాయకుడు ఆ మాటలు రాసిచ్చాడేమో అనుకోవటానికి వీల్లేకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట మాత్రం చెప్పకుండా 7 మండలాలని బలవంతంగా ఆంధ్ర ప్రదేశ్‌లో కలిపేశారు మోదీ! ఇది వారిలో ఉన్న మూడు నకారాత్మక భావాల్ని – క్రోధం, మోహం, మాత్సర్యాన్ని ప్రదర్శితం చేసింది. ఇక ఈ భావాలు వామనుడిలా పెరిగి, రాష్ర్టానికి రావలసిన నిధుల కట్టడి, నీటి పంపకాలలో వివక్ష, అన్యాయపు ఆరోపణలు, కేసులతో అసలు తెలంగాణ భారతదేశంలో రాష్ట్రం కాదన్నట్టే ప్రవర్తిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
నిజానికి ఇక్కడ గెలిచిన ఇద్దరో, ముగ్గురో నాయకులు ఏం చేస్తున్నారు? కేంద్రాన్ని ఒప్పించి నిధులు తేవటం మాట అటుంచి, ప్రగతిపథంలో దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, అవమాన పరచాలని చేయని ప్రయత్నం లేదు. కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా, తమ సోయి లేకుండా రాష్ట్రం మీద ప్రేమ లేని ఈ బీజేపీ నాయకులకి ప్రజలెందుకు ఓటేయాలి? క్రితంసారి గెలవక ముందు చేసిన వాగ్దానాలేమయ్యాయని నిలదీయాలి. డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాలి. ఊళ్ళల్లోకి రానియ్యకూడదు.
ఇక బీఆర్ఎస్ పాలన చూసి అసూయతో ఉడికిపోతున్న కాంగ్రెస్ పార్టీ సంగతి చూద్దాం. 55 ఏండ్ల పైన పాలన చేసి, 11 సార్లు ఎన్నికలలో ఓట్లు వేసిన ప్రజలకి వారు చేసిన మేలు ఏమిటి? ఆంధ్రా నాయకులకి ఊడిగం చేసి, వారి అక్రమ సంపాదనలో పావలా వాటాతో తృప్తి పడి తెలంగాణ ప్రజల జీవితాలను మూడు తరాలపాటు దుర్భరం చేశారు. వ్యవసాయం, విద్య, వైద్యం ఏదీ ఇక్కడి ప్రజలకి కల్పించ లేదు. ఉద్యోగాలు దొరకని యువత నక్సలైట్లుగా మారితే, తమకి గన్మెన్లని పెట్టుకున్నారు కానీ తెలంగాణ ప్రాంత సమస్యలు పట్టించుకోలేదు. ఆఖరికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పాలకులు చేసిన ప్రమాణాలు గంగలో కలుపుతుంటే కిమ్మనలేదు. రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసి వెనక్కి పోతే కూడా కేంద్రం మీద భక్తి, ఆంధ్రా నాయకుల సేవ వదులుకోలేదు. ఈ చచ్చు పుచ్చు నాయకులని చూసి రోసిన యువతలో 1200 మంది ప్రాణత్యాగాలు చేసినా కూడా వీరికి కించిత్తు బాధ కలుగలేదు. ఆఖరికి పార్లమెంట్ ఎదురుగా ఉరి వేసుకున్న యువకుడిని చూసి కూడా వారి అధిష్ఠానం చలించలేదు. నిజానికి రాష్ర్టాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. అడిగినపుడు, ప్రమాణం చేసినపుడు ఇవ్వడాన్ని ఆదరం అంటారు. ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం ఇవ్వడాన్ని ‘అవకాశవాదం’ అంటారు. ఈ సారి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ రాష్ర్టాన్ని ఇచ్చిందంటే కర్రు కాల్చి వాత పెట్టాలి! ఊరి నుంచి తరిమి కొట్టాలి.
సినిమా హీరోలు చాలా మంది రాజకీయాలలో వైఫల్యం చెందారు. కానీ ఈ రెండు పార్టీల నాయకులు రాజకీయ నటన బాగా చేస్తారు. దానిని వివేకవంతులైన ప్రజలు తిరస్కరించాలి. 5 దశాబ్దాలలో రాష్ట్రం ఎంత ప్రగతి సాధించిందో లెక్కలడగాలి. ఇప్పుడు జరుగుతున్న అద్భుత ప్రగతి గురించి చెప్పి వాళ్ల గుడ్డితనం వదిలించాలి. కేవలం అధికార మోహం, అధికారంలో ఉన్న వారి పట్ల అసూయతో మాట్లాడే మాటలను ఖండించాలి. ఉమ్మడి రాష్ర్టానికి, తెలంగాణ రాష్ర్టానికి ఉన్న భేదం చెప్పి వెళ్ళగొట్టాలి.
అభివృద్ధి, సంక్షేమం పెనవేసుకుని సాగుతున్నది ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో. అందుకే అధికారం కోసం డబ్బులు పంచటం కాకుండా, ఇంకా వందేళ్ళకి సరిపడా వసతులు కల్పిస్తున్న ప్రభుత్వాన్ని కొనసాగించాలి. అదానీ, అంబానీ ఆదాయాన్ని కలిపి దాన్నే జీడీపీ అని చెప్పి.. మనం ఆర్థిక సూచీలో ఎగిరి పోతున్నామని ప్రధాని మోదీ చెప్తారు. కానీ మన ముఖ్యమంత్రి రాష్ట్రంలో సాధించిన తలసరి ఆదాయాన్ని, తగ్గిన బీదరికాన్ని, ఆగిన వలసలని, పెరిగిన ధన, ధాన్య సంపదని, సమకూర్చుకున్న పరిశ్రమలని, విద్యాసంస్థలని, పెరిగిన జీవన ప్రమాణాలని చూపి ఓట్లు వెయ్యమని అడుగుతున్నారు. ఏ మాటైనా చేతలతో నిరూపించబడితేనే దానికి విలువ. ఇదివరకు చెయ్యనిది ఇప్పుడు చేస్తామన్న వాళ్ళని నమ్ముతామా? లేక చేసి చూపించిన వాళ్ళని నమ్ముతామా? చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు ఎన్నికలలో సరైన పార్టీని గెలిపించి తాము గెలిచి నిలవాలి.
కనకదుర్గ దంటు
89772 43484