కొందరి వ్యాఖ్యలు కలకాలం కలవరపెడుతూనే ఉంటాయి. ఇంకించుకోలేక, విస్మరించనూ లేక ఏదో ఒక చర్యకు పూనుకొమ్మని ప్రజలను పురిగొల్పుతుంటాయి. పొలాలను చెరబట్టే, కల్లాలను తగలబెట్టే, అన్నదాతల ఆనందాన్ని అంతం చేసే దుర్మార్గపు ఉద్దేశాలను ఎవ్వరైనా క్షమిస్తారా?
తెలంగాణ జనం జలదరింపులకు, ఈసడింపులకు కారణమైన రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల వెనుక వాస్తవాలను, మనోవైకల్య స్థితిని బుద్ధిజీవులందరూ గమనించే ఉంటారు. మిడతల దండుకు మాటలొచ్చి ఉంటే, రాబందుల నోటికి పలికే సామర్థ్యం ఉండి ఉంటే అచ్చం రేవంత్రెడ్డిలానే అరిచి ఉండేటివి. నడిరాత్రి, గాఢనిద్రలో లేపి అడిగినా, నాయకుడి నోటెంట రాకూడని అశుద్ధపు మాటలు, మట్టికి మకిలం పూసెయ్యాలనే దరిద్రపు ధోరణులు టీపీసీసీ అధ్యక్షుడికి సుగుణాలుగా మారిపోయాయి. అయినా పొలాలను ప్లాట్లుగా, రియల్ ఎస్టేట్లుగా మాత్రమే చూడగలిగేవాళ్లు, తక్కెట్లలో తూకమేసి కాసుల లెక్కలేసుకునే నైజం కలిగిన రేవంత్‌రెడ్డి లాంటి వారి నోటెంట ఇలాంటి మాటలకంటే మరేం ఆశించగలం? అమెరికాలో అసలు నైజాన్ని బయటేసుకొని, హైదరాబాద్ కొచ్చి బుకాయిస్తే, ప్రజలు నమ్ముతారని భ్రమించడం విడ్డూరం. రంకునేర్చినోడు బొంకు నేర్వడా? అసలే ఈ విద్యలో రేవంత్ ఆరితేరినవాడు. నాటి కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ, యమకింకరుడికీ ఎదురునిలిచి, ప్రాణం పెట్టి పోరాడిన కేసీఆర్‌ను బషీర్‌బాగ్ కాల్పుల ఘటనకు కారకుడని, ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదని టీడీపీతో చెప్పించింది కేసీఆరే అని ఆరోపిస్తున్న రేవంత్‌ను చూసి తెలంగాణ రైతు లోకం అసహ్యించుకుంటున్నది.
తాజాగా రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరాపై చేసిన దుర్మార్గపు వ్యాఖ్యల వెనక ఉన్నది మనసులో మాటలో చంద్రబాబు రాసుకున్న సిద్ధాంతమే. ఎటుతిప్పి ఏం మాట్లాడినా, అంతరంగంలో పేరుకుపోయిన అన్యాయపు ఆలోచనలను పీసీసీ అధ్యక్షుడు ఆవిష్కరించేశాడు. సమాజానికి అడ్డంగా దొరికిపోయిన రైతు ద్రోహి, రాగాలెన్ని ఆలపించినా, ప్రజారాశుల ఛీత్కారాలను తప్పించుకోజాలడు. బట్టకాల్చి ఎదుటివారి మీద వేస్తే, బయటపడటానికి ఇది రేడియో కాలం కాదు కదా? ఊరూరా సెల్ఫోన్ల జాతరలో మార్మోగుతున్న సోషల్ మీడియా యుగం. నాగలి మీద నోరు పారేసుకున్న రేవంత్‌రెడ్డి, పచ్చి దొంగగా ప్రచారమైపోయాడు. విత్తనాన్ని వధించే ఉన్మాదిగా రైతాంగం మదిలో నిలిచిపోయాడు. ప్రగతి వ్యతిరేకులను పట్టుకోవడంలో ప్రజల నేర్పరితనానికి చరిత్రే నిలువెత్తు సాక్ష్యం.
తెలంగాణ సమాజానికి ద్రోహులపై నిర్దిష్టమైన అభిప్రాయం వచ్చేసింది. ఇప్పుడు ఉనికిలో ఉండాల్నో, వద్దో తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రమే. కాంగ్రెస్ పార్టీల నాయకుల వ్యాఖ్యలతో రగులుతున్న రైతాంగం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉన్న రైతు వేదికల సాక్షిగా హస్తం పార్టీపై నిరసన నగారా మోగిస్తున్నది.
కేసీఆర్‌ను దించేయాలని ఉబలాటపడుతున్నది రవ్వంతో, పువ్వం తో కాదు. పెద్ద తలల పన్నాగమే ఉంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రాజెక్టులు, కాలువలు లేని తెలంగాణలో విద్యుత్ రంగాన్ని, సింగరేణిలో రాష్ట్ర వాటాను ప్రైవేటీకరణ చేయించుకొని పంచేసుకుందామని భ్రమించిన బడా పెట్టుబడిదారుల నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ప్రాజెక్టులకు ప్రాణం పోసి, కాలువలకు కాళ్లు తొడిగి పొలాలకు మళ్లించిన కేసీఆర్‌పై కంటగింపు పెరిగింది. కరెంట్‌కు కన్నులు ప్రసాదించి ఊరూరా వెలుగులు పూయించిన సీఎం కేసీఆర్‌ను చూసి దేశ దొంగలందరికీ భయం పట్టుకున్నది. ఇదే రేపు దేశమంతా జరిగితే మా గతేంటనే ఆందోళన అంబానీ, అదానీ లాంటి వాళ్లందరిలో మొదలైంది. అందుకే దేశ ప్రజల రెక్కల కష్టాన్ని ఎత్తుకుపోయే బూచోళ్లందరూ బాబు శిష్యుల ద్వారా రాజకీయ అధర్మ అలజడిని సృష్టిస్తున్నారు.
ఎంతమంది కలిసి ఎత్తులేసినా తెలంగాణ జనానికి ఎనిమిదేండ్లలో ఎక్కడికొచ్చామో? ఎంత భద్రంగా బతుకును ఆస్వాదిస్తున్నామో తెలియదా? 2014లో రాష్ట్ర స్థాపిత విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 7,778 మెగావాట్లు ఉండగా, నేడు 18,543 మెగావాట్లకు పెరిగిన నిజం గ్రామ గ్రామాన వెలుగై ఎలుగెత్తి చాటడం లేదా? రాత్రి, పగలు కండ్లల్లో కొవ్వొత్తులు పెట్టుకొని, కరెంటు కోసం జాగారం చేసిన దినాలను, నేడు దర్జాగా ఎప్పుడంటే అప్పుడు మోటరేసుకొని నీరు పారించుకుంటున్న సత్యాన్ని రైతులు అర్థం చేసుకోరా? ఏటా 16 వేల కోట్లు ఖర్చు చేస్తూ.. 24 గంటలు వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయడం వల్లనే రైతుల బలవన్మరణాలు, విషనాగుల కాటుకు ఒరిగిన దుర్వార్తలు లేని తెలంగాణ సాకారమైందనే నిజాన్ని జనం ఎత్తిపట్టకుండా ఎట్లుండగలరు? నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం, కరెంట్ కష్టాల నుంచి రాష్ట్ర రైతు లోకాన్ని గట్టెక్కించడానికి కేసీఆర్ పడ్డ తపన వారికి తెలియదా? దాదాపు 37 వేల కోట్ల రూపాయలను విద్యుత్ సరఫరా వ్యవస్థ పునరుద్ధరణ కోసం ఖర్చుచేసింది కేసీఆర్ ప్రభుత్వమే కదా? ఇలా ఎన్నని.. రైతుల కంటనీరు కానరాని సమాజ నిర్మాణం కోసం కట్టిన సాగు నీటి ప్రాజెక్టులు, తిరిగి జీవం పోసిన చెరువులు, చెక్కిన ఎత్తిపోతల జలపాతాలు పంటను, ఫలప్రదమైన జీవితాలను సాకారం చేసినవే కదా? కాదనే వాడెవ్వడున్నా.. కనికరమెరుగని వాడే కదా?
రైతుబంధు, రైతు బీమా అడిగినవారెవ్వరు? అడగనిదే అమ్మయినా పెట్టదనే నానుడిని తిరగరాసి, అడగకున్నా ఆదుకునే దయామయమైన నాయకుడుంటాడని నిరూపించి చూపించాడు కేసీఆర్. ఆదాయ, వ్యయాల పద్దు పుస్తకానికి మట్టి తిలకం దిద్దిన మానవీయ సర్కార్ కేసీఆర్‌ది. బడ్జెట్ నుదుటిన నాగలిని నిలబెట్టిన రైతుల ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానిది. రైతులు కల్లా కపటం ఎరుగని తెల్ల పావురాలు. వారిని ఆకాశమే హద్దుగా ఎగరనిద్దాం. ఎగుమతుల దేశంగా దిగుమతుల భారతం ఎదగాలంటే, రైతు దేశంలో అన్నదాతల ఆశయాలు నెరవేరితీరాలనేదే సీఎం కేసీఆర్ అంతిమ లక్ష్యం. చూస్తూ ఉండండి.. ఈ దేశం మరోచరిత్రను లిఖించుకొని తీరుతుంది. కేసీఆర్ నాయకత్వాన, తెలంగాణ వెలుగులో, గెలిచి తీరుతుంది. మైకుల్లో కాకుల్లా మొత్తుకునే రాజకీయ అవివేకులను ప్రజలు నచ్చరు. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ తెలంగాణకు చేసిన దాంట్లో సగం ప్రచారంలో పెట్టినా చాలు. నీటిని తగలబెట్టాలనుకునే వాళ్లందరూ నవ్వులపాలై పోతారు.
(వ్యాసకర్త: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్)
-డాక్టర్ ఆంజనేయ గౌడ్
98853 52242