ఓ అత్యాచారం కేసు ఒక జర్నలిస్టు జీవితాన్ని తలకిందులు చేసేసింది. 28 నెలల పాటు ఆయనను జైలుపాలు చేసింది. అతని కెరీర్ సర్వనాశనమైంది. సర్వస్వాన్ని పోగొట్టుకున్న అతనెవరో కాదు, ప్రముఖ జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్. ఆయన నేరమో, ఘోరమో చేయలేదు. చేసిందల్లా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ కేసు గురించి రిపోర్టింగ్ చేయడానికి ప్రయత్నించడమే. పదేండ్ల పాలనలో ఒక్క ప్రెస్‌మీట్ కూడా పెట్టని మోదీ హయాంలో జర్నలిస్టులు, ప్రెస్ ఫ్రీడమ్‌పై జరుగుతున్న దాడులకు ఓ మచ్చుతునక ఈ ఉదంతం. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పత్రికా స్వేచ్ఛ మరింతగా క్షీణించవచ్చని విమర్శకులు ఆందోళన చెందుతున్నారు.
అది 2020. అక్టోబర్ నెల. మలయాళ న్యూస్ వెబ్సైట్లో కప్పన్ ఫ్రీలాన్సర్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. దళిత బాలికపై ఉన్నత వర్గాలకు చెందిన కొందరు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలున్న హత్రాస్ కేసును రిపోర్టింగ్ చేసేందుకు ఆయన ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్నారు. కానీ, హత్రాస్‌కు చేరుకోకముందే కప్పన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద నిరోధక, మనీలాండరింగ్ చట్టాల కింద అతనిపై అభియోగాలు మోపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కప్పన్ కుట్ర పన్నుతున్నట్టు పోలీసులు ఆరోపించారు. ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. మత విద్వేషాలను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఆయన ఆర్టికల్ రాస్తున్నట్టు కోర్టులో వాదించింది. ఇదంతా మత వైషమ్యాలను రెచ్చగొట్టి, దేశంలో భయాందోళనలను వ్యాపించే కుట్రలో భాగమేనని కూడా చెప్పింది. తీవ్రమైన నేరారోపణలు చేయడంతో కప్పన్ 28 నెలల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయితే గతేడాది ఫిబ్రవరిలో అతనికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఇప్పుడు బయటే ఉన్నప్పటికీ.. కేసు ఇంకా నడుస్తుండటంతో కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తున్నది.
అయితే బెయిల్ వచ్చిన తర్వాత తన కుటుంబాన్ని పోషించుకునేందుకు సరైన ఉపాధి దొరక్క కప్పన్ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మీడియా సంస్థల యాజమాన్యాల భయమే అందుకు కారణమని ఆయన చెప్పారు. ఎందుకంటే, ప్రభుత్వ ప్రకటనలపైనే మీడియా ఎక్కువగా ఆధారపడుతుంది. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడాన్ని, ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడాన్ని ఎవరూ ఇష్టపడరు. కప్పన్ ఉదంతం చాలామంది ఇతర జర్నలిస్టులను భయాందోళనకు గురిచేసింది.
ప్రపంచంలోని అతిపెద్ద మీడియా మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. పారిస్‌కు చెందిన రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) ప్రకారం.. మన దేశంలో 20 వేలకు పైగా దినపత్రికలు ఉన్నాయి. వివిధ భాషల్లో ప్రసారమయ్యే 450కి పైగా ప్రైవేట్ న్యూస్ చానళ్లున్నాయి. 2015 నుంచి 2023 మధ్యకాలంలో ప్రెస్ ఫ్రీడమ్ సూచీలో 25 స్థానాలు దిగజారిన భారత్ 161వ స్థానంలో నిలిచినట్టు ఆర్ఎస్ఎఫ్ తెలిపింది. ఈ సూచీలో పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకల కంటే భారత్ దిగువన ఉండటం శోచనీయం.
గత పదేండ్లుగా భారత్‌లో మీడియా స్థితి చాలా దిగజారిపోయిందని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) ప్రతినిధి కునాల్ మజుందార్ తెలిపారు. నేరస్థులుగా చిత్రీకరించేందుకు గానూ జర్నలిస్టులను జైలుపాలు చేయడం, ఉగ్రవాద నిరోధక చట్టాల కింద అభియోగాలు మోపడం అందులో భాగంగానే జరుగుతున్నాయని ఆయన అన్నారు. సీపీజే ప్రకారం.. 2014-2023 మధ్యకాలంలో 21 మంది జర్నలిస్టులు జైలుపాలయ్యారు. 2004-2013 మధ్యకాలంలో ఈ సంఖ్య నాలుగు మాత్రమే. ఎలాంటి విచారణ లేకుండానే 180 రోజుల పాటు నిర్బంధించేందుకు అనుమతించే ఉగ్రవాద నిరోధక చట్టాలను జర్నలిస్టులపై ప్రయోగించడం ఈ పదేండ్లలో పెరగడం ఆందోళనకరం.
అదే ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ఉపయోగించి పోలీసులు న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థను అదుపులోకి తీసుకున్నారు. 2020లో ఢిల్లీలో అల్లర్లను ప్రేరేపించినట్టు, కొవిడ్ గురించి దుష్ప్రచారం చేసినట్టు, ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూర్చినట్టు న్యూస్‌క్లిక్‌పై పోలీసులు అభియోగాలు మోపారు. ఈ ఆరోపణల కారణంగా గతేడాది అక్టోబర్ నుంచి జైలు జీవితం గడుపుతున్న పురకాయస్థ.. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇటీవల విడుదలయ్యారు. అతని అరెస్టు, రిమాండ్.. చట్టం దృష్టిలో చెల్లవని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొనడం గమనార్హం.
ఇదిలా ఉంటే ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను విమర్శించేవారు వేధింపులకు గురవుతుండటం మరింత ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే, విమర్శించే జర్నలిస్టులను హిందూ జాతీయవాదులు బెదిరించేందుకు వెనుకాడటం లేదని ఆమ్నెస్టీ తెలిపింది. ప్రముఖ జర్నలిస్టు రవీశ్ కుమార్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎన్డీటీవీలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన రవీశ్.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని చెప్పడంతో ఎన్డీటీవీకి రాజీనామా చేశారు. మోదీ-బీజేపీకి, అదానీకి మధ్య ఉన్న సామీప్యత కారణంగా ఇకపై తాను ప్రభుత్వాన్ని కఠినంగా ప్రశ్నించలేనని తెలిసి బయటకు వచ్చేసినట్టు రవీశ్ తెలిపారు.
మీడియాను ప్రభుత్వ అనుకూల వార్తలు ఆక్రమించేయడం ఆందోళనకరం. న్యూస్‌లాండ్రీ సంస్థ అధ్యయనం ప్రకారం.. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 12 మధ్యకాలంలో 400కి పైగా సెగ్మెంట్లను అధ్యయనం చేయగా 52 శాతం ప్రసార సమయాన్ని ప్రతిపక్షాలను విమర్శించేందుకు కేటాయించినట్టు తేలింది. 27 శాతం ప్రసార సమయాన్ని మోదీ
అనుకూల ప్రచారం కోసం కేటాయించినట్టు వెల్లడైంది.
పత్రికా స్వేచ్ఛపై దాడి అక్కడితోనే ఆగిపోలేదు. స్థానిక జర్నలిస్టులతో మొదలైన ఈ దాడుల పరంపర అంతర్జాతీయ మీడియా కరస్పాండెంట్ల వరకు కొనసాగింది. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ దక్షిణాసియా బ్యూరో చీఫ్ అవనీ డియాస్కు వీసా నిరాకరించడంతో ఆమె భారతదేశాన్ని వీడాల్సి వచ్చింది. గతంలో ఫ్రెంచ్ జర్నలిస్టు వనెస్సా డూగ్నాక్ కూడా భారతదేశాన్ని వీడారు. ప్రధాని నరేంద్ర మోదీపై డాక్యుమెంటరీని విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత బీబీసీ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. తర్వాత సోషల్‌మీడియాలో ఆ డాక్యుమెంటరీపై నిషేధం విధించారు. ఇలా అనేక విధాలుగా గత పదేండ్లుగా ప్రెస్ ఫ్రీడమ్ అణచివేతకు గురైంది.
(సీఎన్ఎన్ సౌజన్యంతో)
-ఐశ్వర్య ఎస్.అయ్యర్