‘ప్రియమైన నరేంద్రమోదీ గారికి, 1964 మే 27న నేను ఈ లోకానికి వచ్చిన తర్వాత సాధారణంగా లేఖలు రాయడం మానేశాను. అయితే పాత అలవాట్లు అంత సులభంగా పోవు. నా కుమార్తె, మనవళ్లు ఇక్కడే ఉన్నారు. మాలో ఎవరికీ మీతో వ్యక్తిగత పరిచయం లేదు. అయినా మీరు ప్రధాన మంత్రిగా సాగిస్తున్న పాలన గురించి మేం తరచుగా చర్చించుకుంటాం. ఎందుకంటే ఎంతో బాధ్యతతో కూడిన ఆ పదవిని అలంకరించిన నా తర్వాత వారిలో మీరు కూడా ఒకరు.
ప్రియమైన మోదీ, 2026 జూన్ 10 నాటికి మీరు ప్రధానమంత్రిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారని తెలుసుకొని నాకు చాలా సంతోషం కలిగింది. ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. మీరు అద్భుతమైన ఆరోగ్యంతో, ఉత్సాహంతో కనిపిస్తున్నందున, 1999 ఆగస్టు 9 నుంచి అధ్యక్షుడిగా గానీ, ప్రధాన మంత్రిగా గానీ సేవలందిస్తున్న మీ మిత్రుడు రష్యాకు చెందిన వ్లాదిమిర్ పుతిన్ నెలకొల్పిన రికార్డును కూడా అధిగమించాలని మీరు ఆశపడవచ్చు.
అయితే, మీకూ, నాకూ మధ్య జరిగే పోలికలు పూర్తిగా సముచితమేనా అనే సందేహం తరచూ కలుగుతున్నది. నా తండ్రి మోతీలాల్నెహ్రూ, రవీంద్రనాథ్ఠాగూర్ జన్మించిన 1961 మే 6నే జన్మించారు. నా తండ్రి అపారంగా సంపాదించారు. ఆయన కోరుకొని ఉంటే ఇంకా ఎంతో ధనాన్ని కూడబెట్టగలిగేవారు. అయితే ఆయన సౌకర్యాలను వదులుకొని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆయనను రెండుసార్లు అరెస్ట్ చేశారు. శాసనోల్లంఘన ఉద్యమంలో మా నాన్నతోపాటు నన్నూ అరెస్ట్ చేశారు. మా నాన్న మొత్తం 7 నెలలు జైలు జీవితం గడిపారు. చివరిసారిగా జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కొంత కాలానికే ఆయన మరణించారు.
మా తండ్రి తర్వాత నేను భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను. ఆ రోజుల్లో నా అతిపెద్ద బలం మహాత్మా గాంధీ. నేను ఆయనకు సొంత కుమారుడి కంటే ప్రియమైన వాడినని ఎలాంటి సందేహం లేకుండా చెప్పగలను. స్వాతంత్య్ర పోరాటంలో నేను దాదాపు తొమ్మిదేండ్లు జైలు జీవితం గడిపాను. మీరు స్వాతంత్య్రం తర్వాత జన్మించారు కాబట్టి, మీరు ఆ ఉద్యమంలో జైలుకు వెళ్లే అవకాశం మీకు రాలేదు. అయితే నా అనాలోచిత కుమార్తె దేశంపై విధించిన ఎమర్జెన్సీ సమయంలో మీరు ఎలా అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారో, మిస్టరీగానే అనిపిస్తున్నది.
1947లో ప్రధాన మంత్రి పదవి నిర్వర్తించడం, 2014లో ప్రధాన మంత్రి పదవి చేపట్టడం రెండూ ఒకటే అనుకుంటే, మీ అపోహను తొలగించాలని కోరుకుంటున్నాను. బ్రిటిష్ వారు నిర్మించిన రైల్వే మార్గాలు, పోస్టల్, టెలిగ్రాఫ్ వ్యవస్థలు, సైనిక శిబిరాలు తప్ప జాతీయ మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి. ఆకలి చావులు సర్వసాధారణంగానే ఉండేవి. ప్రైవేట్ రంగం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అప్పటికే దేశ విభజన మాకు పెను సవాళ్లను మిగిల్చింది. మేడ్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని నేను సృష్టించలేదు. కానీ భారత్ తన అవసరమైన వస్తువులను తానే తయారు చేసుకోగలిగే స్థాయికి చేరాలని మేం ప్రయత్నించాం. ఆనాడు మా ముందున్న అత్యంత ముఖ్యమైనపని దేశ నిర్మాణం. రాజ్యాంగం ఆధారంగా ప్రజాస్వామ్య సంస్థల నిర్మాణం, అభివృద్ధి. మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు స్వతంత్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశాం. మరో విషయంలో నేను మీకంటే అదృష్టవంతుడిని. స్వాతంత్య్ర ఉద్యమంలో నా పాత్ర వల్ల ఎన్నికల్లో గెలువడం నాకు సులభంగా ఉండేది. దేవాలయాలు, మసీదులు, చర్చిలను చాలా అరుదుగానే సందర్శించేవాడిని. అయినా ప్రజలు నన్ను నమ్మి ఓట్లు వేసేవారు.
మీరు జపాన్ ప్రధానమంత్రి షింజో అబేను వారణాసికి తీసుకెళ్లి ఘనమైన గంగాహారతిని చూపించారట. ఈ విషయాన్ని ఎవరో నాకు ఇక్కడ చెప్పినప్పుడు నవ్వుకున్నాను. నేను చైనా ప్రధాని చౌఎన్లైని పంజాబ్ తీసుకెళ్లి భాక్రానంగల్ ఆనకట్టను చూపించిన జ్ఞాపకం ఉన్నది. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులకు క్రమం తప్పకుండా లేఖలు రాసేవాడిని. నేను ఇచ్చిన ప్రతి బహిరంగ ప్రసంగానికీ విస్తృతమైన సన్నాహాలు అవసరమయ్యేవి. అధ్యయనం చేసి, నోట్స్ సిద్ధం చేసుకొని, ఆ తర్వాతే ప్రసంగించాల్సి వచ్చేది. మీకు టెలిప్రాంప్టర్ అనే సౌకర్యం ఉన్నది. బహుశా టెలిప్రాంప్టర్ వల్ల ఆదా అయ్యే సమయాన్ని నోట్ల రద్దు వంటి ధైర్యమైన నిర్ణయాలను తీసుకోవడానికి వెచ్చించవచ్చునేమో. నా కాలంలో వివిధ దేశాలకు నేరుగా విమాన సర్వీసులు ఉండేవి కావు. అమెరికా వెళ్లాలంటే అనేక చోట్ల ఆగాల్సి వచ్చేది. ఈ రోజు మీరు కొన్ని గంటల్లోనే ఖండాలను చుట్టేయగల విమానాలను కలిగి ఉన్నారు.
మీరు విలేకరుల సమావేశాలు నిర్వహించనందుకు నేను నిందించను. మీకు సామాజిక మాధ్యమ వేదికలు ఉన్నాయి. అసౌకర్యం కలిగించే ప్రశ్నలు లేకుండా వాటి ద్వారా ప్రపంచంతో మాట్లాడవచ్చు. నేను మాత్రం జర్నలిస్టులను కలిసేవాడిని, వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాడిని. ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థలను స్థాపించడంలో శ్రద్ధ పెట్టాను. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని మీరు స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో నిర్మించారు. అది చంద్రుడి నుంచి కనిపిస్తుందా లేదా అనే విషయం నేను కచ్చితంగా చెప్పలేను. పటేల్ గారూ నేను ప్రత్యర్థులమని కొందరు తరచూ చెప్తుంటారు. మేం వాదించుకున్నాం, విభేదించుకున్నాం. కానీ కొత్తగా ఏర్పడిన దేశ సేవ కోసం కలిసి పని చేశాం.
మీరు సుదీర్ఘ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న మీకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ప్రధానమంత్రి తన కంటే ముందు ప్రధానమంత్రులు మలిచిన భారతదేశాన్ని వారసత్వంగా స్వీకరిస్తారు. తన నిర్ణయాలు, తన విధానాలతో మార్పు చెందిన దేశాన్ని తర్వాత తరాలకు వదిలి వెళ్తారు. 1947లో నేను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి దేశంతో పోల్చితే, అపారమైన బలమైన, సంపన్నమైన, ఆత్మవిశ్వాసం కలిగిన దేశాన్ని మీరు వారసత్వంగా పొందారు. దేశానికి మీ సేవను కొనసాగించండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వ్యక్తుల కంటే సంస్థలు ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. భిన్నాభిప్రాయం దేశద్రోహం కాదు. విభేదించేవారిని ఎలా చూస్తామనేదే అధికారానికి అసలైన పరీక్ష. ఎన్నికల ఫలితాలు, పేరు ప్రతిష్టలతో సంబంధం లేని ప్రదేశం నుంచి మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’
ఇట్లు,
జవహర్లాల్ నెహ్రూ.
(ఇండియన్ కరెంట్స్ సౌజన్యంతో)
ఏజే ఫిలిప్