మాతృదేశాన మాతృమూర్తులకు లభిస్తున్న గౌరవమర్యాదలు చూసి సగటు స్త్రీగా, భారత పౌరురాలిగా మతిపోతున్నది. నిజంగా ఈ సమయంలో మతితప్పి ఉంటే బాగుండుననిపిస్తున్నది. రాజ్యాంగస్ఫూర్తి విలువలు దహించివేయబడిన పాలనలో ఉన్నామా అనిపిస్తున్నది. మైనారిటీలు, ఆదివాసీలు, కొన్ని తెగల, సమూహాల పౌరసత్వాలూ, అస్తిత్వాలూ ప్రశ్నార్థకమవుతున్నాయి.
దేశంలో స్త్రీల అస్తిత్వాలకు పెనుసవాల్ ఎదురవుతున్నది. భారతీయ సమాజాన్ని వేధిస్తున్న వ్యవస్థను చూస్తే విస్మ యం కలుగుతున్నది. దేశంలో మతతత్వం, కులతత్వం, ప్రాంతీయ దురహంకారం ఉన్మాదంతో చెలరేగిపోతున్నది. వారి అరాచకాలను సమర్థించుకోవడానికి, ఓటు బ్యాంకులను కొల్లగొట్టి అధికారాన్ని సుస్థిరం చేసుకోడానికే ఈ రాజకీయ హత్యాకాండల న్నీ. అయినా దేశాన్ని, ప్రజలను ఉద్ధరిస్తున్నామని చెప్పే ప్రభుత్వానికి ఇవేం పట్టవు.
మతం ఈ రోజున దేశానికి ప్రధాన రాజకీయ వనరుగా మారిం ది. ఈర్ష్యాద్వేషాల ముసుగులను వేసుకొని నగ్నతాండవం చేస్తున్నది. ఇదంతా చేస్తున్నది చేయిస్తున్నది మతవాదులే అని తేటతెల్లమైంది. మతమంటే మారణ హోమమా? మన భారతీయ సంస్కృతిని మనం ఎలా నిర్వచించుకుందాం?
నా జ్ఞానానికి, అనుభవానికి తెలిసినంతవరకు మతం, ఆచారాలు, సంప్రదాయాలు, తంతులూ అన్నీ కూడా మన సంస్కృతిలో భాగం మాత్రమే. స్వార్థపర దుష్టశక్తులు తమ పగద్వేషాలూ, దుండగాలు, దోపిడీల కోసం మతాన్ని సంస్కృతి నుంచి విడదీసి దాన్నొక ఆయుధంగా వాడుకుంటున్నారు. సంఘ సమగ్రతను చిన్నాభిన్నం చేస్తూ రక్త క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. ఈ దేశాన్ని ‘భారతమాత’ అంటూ మోకరిల్లుతూ ఆరాధిస్తున్నట్టుగా నటిస్తూ భరతమాతకు చెడ్డపేరు తెస్తున్నారు.
ఒక భారత స్త్రీగా, పౌరురాలిగా, దేశభక్తురాలిగా, సమతా సామ్యవాద శాంతి విలసిల్లే సమాజాన్ని ఆశిస్తున్నాను. కానీ నారీశక్తిగా నేను కలతల లోకంలో కల్లోలిత జీవితం గడపాల్సి వస్తున్న ది. అమానుషత్వాల, అగౌరవానికి నిత్యం బలిపశువునై ఆక్రందనలు చేయాల్సి వస్తున్నది. అందుకే వెంటాడుతున్న మానవ మృగా ల నీడలకు భీతిల్లి ప్రాణ, మాన రక్షణ కోసం పరితపించాల్సి వస్తున్నది. గాయపడిన దేహాలతో చిరిగిన పీలికల్ని చుట్టుకొని, అర్ధ నగ్నంగా పరిగెత్తుకుంటూ పోతున్న స్త్రీమూర్తుల వారసురాలిగా ఆందోళన చెందాల్సి వస్తున్నది. ఆడపిల్లగా పుట్టినందుకు లైంగిక దాడులకు, ఆడజన్మనెత్తినందుకు అత్యాచారాలకు నన్ను వేదికగా చేసుకుంటున్నారు. గౌరవంతో, హుందాతనంతో జీవించే హక్కునూ, అర్హతను నిరాకరిస్తున్నారు. ఇలాంటి వింత మృగాళ్ళ నడుమ ఉన్నందుకు నాలో విపరీత ఆలోచనలు కలుగుతున్నాయి. సిగ్గులేని మనుషుల నడుమ సిగ్గుతో తలవంచుకొని, నన్నూ నా దేహాన్ని లోలోపలికి కుచించుకొని బతకాల్సి వస్తున్నది.
ఈ రోజున దేశానికీ ‘దేశమాత’కూ దిక్కు దిశ లేదు. రాజ్యాంగాన్ని చదువాల్సి వస్తుందని, పాటించకుంటే ప్రశ్నిస్తారని ఏ చీకటి గుహల్లోనో సమాధి చేశారు. మానవీయ భావనలను మధ్యయుగాల్లోకి మళ్లించారు. ఆడవాళ్ల దేహాలపై నగ్న రాజకీయాల పచ్చబొట్లు పొడుస్తున్నారు. ఈ రోజున రాజకీయాలు సృష్టించిన ‘మతం’తో జతగట్టి భారతమాత ప్రతినిధులైన స్త్రీల నగ్న దేహాల తో రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు. తమ తమ మత ఉన్మాదాలకు రక్తసిక్త నగ్న చరిత్రలు రాసి వికృతత్వానికి పట్టం కడ్తున్నారు. మతం చిచ్చుకు తోడు ‘మర్దాంగీ’(మగతనం)లను మేల్కొల్పి స్త్రీలపై విరుచుకుపడి మృగ(మగ)తనాలను నిరూపించుకుంటున్నారు. నిజంగా వీళ్లు మతం అంటే ఏమిటో తెలిసినవాళ్లేనా? నిజంగా వీళ్లు భారతీయులేనా? దేశమన్నా, దేశభక్తియన్నా వీరికి అర్థం తెలుసా? నిజంగా వీళ్లు స్త్రీలను గౌరవించి పూజించే వ్యక్తులేనా? స్త్రీలను ‘సతి’ చేసిగాని చల్లబడే మత రక్షకులే కదా, మూర్ఖ పాలకులే కదా.
‘భారత్ బచావో’ అన్న భావన నినాదమై ఈ రోజున దేశవ్యాప్తంగా అలజడిగా మారింది. పౌర సమాజం పాలకుల నేరాల పట్ల అట్టడుగు నుంచి ఉడికిపోతున్నది. భరతమాత కన్నీటి గంగలు ప్రవాహాలుగా ప్రళయాలు సృష్టిస్తున్నవి. భేటీ బచావో, బడావో, పడావో మాటలు చిలుం పట్టి తుక్కులా రాలిపోతున్నవి.
అయ్యా! దేశ ఏలికల్లారా! పాలకుల్లారా! అధికార పీఠాలను అధిష్ఠించిన రాజకీయ, మత నేతల్లారా! మానవత్వం కన్నా ‘మహోన్నత మతం’ ఏదో, ఎక్కడుందో సెలవిస్తారా? మానవ సేవకన్నా మాధవ సేవంటూ ఉందా! దేశప్రజల క్షేమం, రక్షణ, వారికిచ్చే భరోసా, నమ్మకాలను మించిన సంక్షేమ శాంతి పరిపాలన ఇంకేమైన ఉన్నదా? లౌకికశక్తుల నిర్భంధం, అరాచకశక్తుల విశృంఖలత్వమే మీ సైద్ధాంతిక విధానమా? దాన్ని అరాచక అత్యాచారాల పునాదులపై లేచిన కబేళాలతో నింపాలనుకుంటున్నారా? అందుకు ఈ (మా) దేశపు స్త్రీలమైన మా దేహాలే మీకు వేదికలా? మా శవాలపైనే మీ సింహాసనాలా?
అయ్యా అన్నీ కన్నీటి ప్రశ్నలే… అంతా సంక్షుభిత పరిస్థితులే! అంతటా రక్తపు తడిలో తడిచి రెపరెపలాడున్న నెత్తుటి పతాకాలే! మీ దేశభక్తికీ మత ధర్మ ఉద్ధరణలకు ఒక నిరసన దండం!
(వ్యాసకర్త : ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు)
అనిశెట్టి రజిత
98494 82462