హైడ్రా, మూసీ ప్రక్షాళన, గాంధీ ప్రాజెక్ట్ వంటి ప్రభుత్వ తుగ్లక్ చర్యలతో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతుంటే, ఇప్పుడు 22-ఏ రూపంలో మరో పిడుగుపడింది. భూములను కాపాడాల్సిన చట్టం.. భూయజమానులనే భయపెడుతున్నది. చట్టబద్ధమైన పలువురి భూములు, ఇండ్లు, అపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలోకి చేరాయి. ఈ పరిణామాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కష్టపడి సంపాదించిన ఆస్తులను కూడబెట్టినవారు, పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టినవారు ఆ ఆస్తి రిజిస్ట్రేషన్ కాదని తెలియడంతో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
హైదరాబాద్ నగరంలోని వందలాది కాలనీలు, ప్రముఖ ప్రాంతాల్లోని ఆస్తులపై 22-ఏ ప్రభావం పడుతున్నదన్న వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఎమ్మెల్యే కాలనీ, పంజాగుట్ట, శ్రీనగర్‌కాలనీ, జూబ్లీహిల్స్, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో 30-40 ఏండ్ల క్రితం నిర్మించిన అపార్ట్మెంట్లు, ఇండ్లు, స్థలాలు కూడా ఈ జాబితాలోకి వచ్చినట్లు బాధితులు చెప్తున్నారు. నగరంలో ఎక్కడ చూసినా ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో అనిశ్చితి నెలకొంటే..అది కేవలం రెవెన్యూ రికార్డుల సమస్యగా ఎలా తీసుకోవాలి? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కొత్తగా నిర్మించిన కొన్ని ప్రముఖ అపార్ట్మెంట్ సముదాయాలు కూడా 22-ఏ జాబితాలోకి వచ్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఒక అపార్ట్‌మెంట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడం అంటే కేవలం ఒక భూమి రికార్డును మార్చడం కాదు.. వందలు, వేల కుటుంబాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడం. ఒక సర్వే నంబర్లో ఒక భూమి మీద వివాదం ఉంటే.. ఆ సర్వే నంబర్లోని అన్ని భూములు, వాటి మీద నిర్మించిన మొత్తం అపార్ట్మెంట్ సముదాయాన్ని ఎలా అనుమానాస్పదంగా చూస్తారు? ఇక్కడ మరో ముఖ్యమైన అంశం బ్యాంకు రుణాలు.
ఈ ఆస్తులపై బ్యాంకులు ఇప్పటికే కోట్ల రూపాయల రుణాలు ఇచ్చాయి. ప్రజలు తమ ఇండ్లు, ఫ్లాట్లు, స్థలాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. బ్యాంకులు కూడా ప్రభుత్వ రికార్డులను పరిశీలించి, చట్టబద్ధమైన ఆస్తులేనన్న నమ్మకంతో రుణాలు మంజూరు చేశాయి.
ఇప్పుడు అదే ఆస్తులు 22-ఏ జాబితాలోకి వస్తే.. బ్యాంకుల పరిస్థితి ఏంది? రుణాలు తీసుకున్న కుటుంబాల పరిస్థితి ఏంది? ఆస్తి అమ్ముకోవాలన్నా వీలులేదు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా వీలులేదు. రుణం తీర్చుకోవాలన్నా ఆస్తిని విక్రయించలేరు. ప్రభుత్వ రికార్డుల గందరగోళానికి ఇప్పుడు బ్యాంకులూ, ప్రజలూ మూల్యం చెల్లించాలా? ఇది కేవలం ఆస్తి రిజిస్ట్రేషన్ సమస్య కాదు. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే సమస్య. రెవెన్యూ శాఖకు ఒక సర్వే నంబర్ కావచ్చు. ఒక ఫైల్ కావచ్చు. కంప్యూటర్లో ఒక ఎంట్రీ కావచ్చు. కానీ ఆ ఎంట్రీ వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ఒక తప్పు.. ప్రజల జీవితంలో విషాదంగా మారితే బాధ్యత ఎవరిది?
హుడా, హెచ్ఎండీఏ, హౌసింగ్ బోర్డు వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా అనుమతులు పొందిన లేఅవుట్లు, ప్లాట్లు కూడా నిషేధిత జాబితాలోకి వస్తున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి? రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 లక్షల ఎకరాలు నిషేధిత భూముల పరిధిలో ఉన్నాయన్న సమాచారం వస్తున్నది.
ఇంత పెద్ద సంఖ్యను సాధారణ రెవెన్యూ రికార్డుల వ్యవహారంగా తీసుకోవడం కుదరదు. నిజంగా అక్రమ భూములను గుర్తించారా? లేక రికార్డుల ఆధారంగా మొత్తం భూములను ఒకే గాటన కట్టేశారా? చట్టబద్ధమైన భూములు కూడా ఈ జాబితాలోకి ఎందుకు వచ్చాయి? ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? ఇక ఎన్వోసీ, డీలిస్టింగ్ పేరుతో కార్యాలయాల చుట్టూ తిరుగాల్సి వస్తున్నదన్న మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
ముఖ్యమంత్రి స్వయంగా ముందుకు వచ్చి సమస్యపై స్పష్టత ఇవ్వాలి. రెవెన్యూ మంత్రి పూర్తి వివరాలు వెల్లడించాలి. ఎన్ని భూములు ప్రభావితమయ్యాయి? ఎన్ని ఇండ్లు, ఫ్లాట్లు 22-ఏలోకి వచ్చాయి? ఎన్ని కుటుంబాలు ప్రభావితమయ్యాయి? ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి? ఎన్ని పరిష్కరించారు? ఇంకా ఎన్ని మిగిలాయి? ఎప్పటిలోగా అన్నింటినీ పరిష్కరిస్తారు? ప్రభుత్వ పెద్దలు ముందుకు వచ్చి భరోసా ఇవ్వాల్సిన సమయంలో అధికారులు, పోర్టల్స్, ఫైళ్ల వెనుక ప్రభుత్వం దాక్కోవడం సరైన సమాధానం కాదు.