ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దుమ్ముగూడెం ఇందిర సాగర్, రాజీవ్ సాగర్లను విలీనం చేసి సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2016 ఫిబ్రవరి 16న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2016 నుంచి 2023 వరకు ఐదేండ్లలో ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులు చేపట్టారు.
ఈ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలు, 31 మండలాల పరిధిలో 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌కు అనుసంధానం చేయడం, ఇతర చెరువులు నింపడం వల్ల సాగర్ ఆయకట్టుతోపాటు మరో 3.45 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు నిర్ణయించారు. గోదావరి నది నుంచి సుమారు 67 నుంచి 70 టీఎంసీల నీటిని తరలించేందుకు దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద హెడ్ రెగ్యులేటర్, పంప్‌హౌస్‌లు, కాల్వల నిర్మాణానికి రూ.13,058 కోట్ల అంచనాతో రూపొందించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం దిగేనాటికి ప్రధానమైన పంపుహౌస్‌ల నిర్మాణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చివరి ఖమ్మం జిల్లా సరిహద్దు వరకు ప్రధాన కాలువల నిర్మాణం పూర్తిచేశారు. ఖమ్మం జిల్లాలో కూడా ప్రధాన కాలువల పనులు కొంత పూర్తయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల సరిహద్దు పాపకొల్లు, చీమలపాడు మధ్య గుట్టల కింద అండర్ టెన్నెల్, యాతాలకుంట టెన్నెల్ నిర్మాణం పూర్తిచేయాల్సి ఉన్నది. మూడు మండలాల్లో భూసేకరణ చేసి ప్రధాన కాలువల నిర్మాణం ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలో సొరంగం ద్వారా కాలువల నిర్మాణం, 125 కిలోమీటర్లతోపాటు పంట కాలువల నిర్మాణం పెండింగ్‌లో ఉన్నాయి.
గోదావరి నదిపై 150 ఏండ్ల క్రితం నిర్మించిన చెక్‌డ్యామ్‌కు 200 మీటర్ల దిగువభాగంలో దుమ్ముగూడెం గ్రామం వద్ద రన్ ఆఫ్ రివర్ సీతమ్మ బరాజ్ 68 మీటర్ల ఎత్తు, పునాది 20 మీటర్లు, పొడవు 1,263 మీటర్లు, నీటి నిల్వ సామర్థ్యం 36.576 టీఎంసీలుగా ప్రతిపాదనలు తయారుచేసి పనులు ప్రారంభించారు. కేంద్ర పర్యావరణ, ఫారెస్ట్ శాఖ అనుమతులు రాక పనులు నిలిచిపోయినా ఇటీవల క్లియరెన్స్ వచ్చింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు రామజపం మాదిరిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మీద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నాయకత్వంలో సమీక్షలు తప్ప పురోగతి లేదు. ప్రాజెక్టు పూర్తికాకుండానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2025 ఆగస్టు 15న అశ్వాపురం మండలం బి.జి కొత్తూరు, ముల్లకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం మూడుచోట్ల ఉన్న పంపుహౌస్‌లకు స్విచ్ఛాన్ చేసి నీటి ఎత్తిపోతను ప్రారంభించారు. అయితే, ఆ సంవత్సరం గోదావరి జలాలు తరలించలేదు. 2025 ఆగస్టులో 10 రోజులు, 2026 జూలై 7 నుంచి 24 రోజులు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు తరలించారు.
ప్రాజెక్టు డిజైన్‌లో లేని రాజీవ్ లింక్ కెనాల్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనులు పూర్తిచేసిన వాటి ఆధారంగా రూ.150 కోట్లు ఖర్చు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభా నగర్ నుంచి ఏన్కూరు మండల కేంద్రం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఈ ప్రాజెక్టును లింక్ చేయడం ద్వారా అక్కడ నుంచి సాగర్ లెఫ్ట్ కెనాల్లో గోదావరి జలాల 14 కిలోమీటర్ల దూరం రివర్స్ ప్రయాణించి తిమ్మరావుపేట సాగర్ ఎస్కే ఛానల్ ద్వారా వైరా రిజర్వాయర్‌కు అనుసంధానం చేశారు.
రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభం, గోదావరి జలాల విడుదల పేరుతో పంపుహౌస్‌లు స్విచ్ఛాన్ చేసి 2025 ఆగస్టు 15న ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో రైతు భరోసా సభ నిర్వహించారు. ఆ సభలో ముఖ్యమంత్రి 2026 ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టు పనులు సంపూర్ణంగా పూర్తిచేస్తామని ప్రకటించారు. కానీ నేటికీ ఆచరణయోగ్యం కాలేదు. సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో రూ.665 కోట్లు, 2026-27 బడ్జెట్లో రూ.323 కోట్లు నామమాత్రంగా కేటాయించింది. కేసీఆర్ ప్రభుత్వం సమయంలో పూర్తయిన పనులు తప్ప కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత చేసిన పనులు చాలా తక్కువ.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో రూ.948 కోట్ల కేటాయింపులు ఉంటే సీతారామ ప్రాజెక్టు పూర్తిచేయాలంటే మరో పుష్కరకాలం పడుతుందేమో. మూడు జిల్లాలకు సాగు నీరు అందించే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేసి ఖమ్మం జిల్లా రైతులకు ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
(వ్యాసకర్త: అఖిల భారత కిసాన్ సభ సభ్యుడు)
బొంతు రాంబాబు
94900 98205