ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటు రైతులను, అటు వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన విషయం తెలిసిందే. వ్యవసాయరంగాన్ని మరింత దెబ్బతీసేలా ఇప్పుడు మరో నిర్ణయంతో ముందుకువస్తున్నది.
జన్యుమార్పిడి పంటల స్థానంలో జీనోమ్ ఎడిటింగ్ పద్ధతిలో బహుళజాతి సంస్థలు రూపొందించిన నూతన వంగడాలు, వాణిజ్య పంటలపై ఉన్న అన్నిరకాల ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. ఫలితంగా అవసరం లేకపోయినా బహుళజాతి విత్తన సంస్థలు ఆయా విత్తనాలను రైతుల నెత్తిన మోపే ప్రమాదం ఉన్నది. జీనోమ్ ఎడిటింగ్ పద్ధతి దేశ వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దేశంలో ప్రధాన ఆహారపంటలు వరి, గోధుమ. వాణిజ్య పంటలలో పొద్దు తిరుగుడు, క్యాబే జీ, కాలిఫ్లవర్, టమాట వంటివి ఎకువ విస్తీర్ణంలో సాగవుతున్న కూరగాయలు. బహుళజాతి విత్తన సంస్థలు ఈ పంటల్లో జీనోమ్ టెక్నాలజీని ప్రవేశపెట్టి కొత్త వంగ డాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీపై ఆయా కంపెనీలకు పేటెంట్ ఉండటం వల్ల కేవలం లాభార్జనే ధ్యేయంగా బహుళజాతి విత్తన సంస్థ లు ముందుకు సాగనున్నాయి.
దేశంలో జీనోమ్ ఎడిటింగ్ పద్ధతిలో అభివృద్ధి చేసిన పంటలను సాధారణ పంటలలాగే విడుదలకు అనుమతిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ అటవీశాఖ జీవో జారీ చేసింది. జన్యుమార్పిడి పంటలకు అవసరమైన అన్నిరకాల క్షేత్రస్థాయి పరిశీలన, బయోసేఫ్టీ పరీక్షలు వీటికి అవసరం లేదని తేటతెల్లం చేసింది. ఫలితంగా ఈ జీనో మ్ ఎడిటింగ్ పద్ధతికి సాంకేతికంగా భారతదేశంలో అనుమతిస్తున్నట్లు అవుతుంది. ఈ పద్ధతిలో అభివృద్ధి చేసిన పంటలను ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు మాత్రమే అనుమతిస్తున్నాయి. అత్యాధునిక ప్రయోగశాలలు లేని దేశాలు అనుమతించడం లేదు.
జీనోమ్ ఎడిటింగ్ విధానంపై ఇప్పటికే పలు దేశాల్లో పర్యావరణవేత్తలు, సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నాయి. ‘ది ఇండిపెండెంట్ సైన్స్ ప్యానెల్’ అనే అంతర్జా తీయ సంస్థ విడుదల చేసిన ఒక నివేదికలో.. జీనోమ్ ఎడిటింగ్ వంటి ప్రయోగాల ఫలితంగా వాతావరణం లోకి కొత్త బ్యాక్టీరియా, వైరస్లు విడుదలై మానవాళిని హడలెత్తించే మహమ్మారులు విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2001లో ఒక జెనెటిక్ ఇంజినీరింగ్ ప్రయోగం నుంచి పుట్టిన వైరస్ ఎలుకలను పెద్ద ఎత్తున నిర్మూలించిందని గుర్తుచేసింది. జన్యుపరమై న ప్రయోగాలు జన్యువుల మధ్య సహజసిద్ధంగా ఉండే సంబంధాన్ని పరిగణనలోకి తీసుకోవటం లేదని, దీనివ ల్ల కూడా ఈ ప్రయోగాలతో వాతావరణంపై పలు రకాల దుష్ప్రభావాలు పడుతున్నాయని మలేసియాలో జరిగిన ‘రీ డిఫైనింగ్ లైఫ్ సైన్సెస్’ సదస్సు పేర్కొన్నది.
జన్యుమార్పిడి పంటలకు వర్తించే కఠిన నిబంధనలను జీనోమ్ ఎడిటింగ్ పంటలకు వర్తించకుండా చూసుకునేలా బహుళజాతి కంపెనీలు పావులు కదుపుతున్నాయి. కానీ, న్యాయస్థానాలు వాటికి అడ్డుకట్ట వేస్తున్న దృష్టాంతా లున్నాయి. యూరప్‌లోని అత్యున్నత న్యాయస్థానం.. జన్యుమార్పిడి పంటలకు వర్తించే నిబంధనలన్నింటినీ జీనోమ్ ఎడిటింగ్ పంటలకు కూడా వర్తింపజేయాలని 2018 జూలైలో తీర్పునిచ్చింది. అంతేగాక జీనోమ్ ఎడిటింగ్ ఆహార ఉత్పత్తుల ప్యాకేజీలపై ఆయా ఉత్పత్తుల తాలూకు పూర్తి వివరాలను ముద్రించాలని ఆదేశించింది. ఈ విధంగా ప్రపంచదేశాలు ప్రజారోగ్యం దృష్ట్యా ఈ తరహా పంటలపై ఆంక్షలు విధిస్తుంటే.. మనదేశంలో మాత్రం కేంద్రప్రభుత్వం వీటికి తలుపులు తెరువటం గర్హనీయం. బహుళజాతి కంపెనీల ప్రయోజనాలే తప్ప ప్రజల ఆరోగ్యం తనకు పట్టదని ప్రభుత్వం చాటుకున్న ట్లయ్యింది. మనదేశంలో ఇప్పటివరకూ ఆహారపదార్థాల లేబులింగ్ వ్యవస్థ సరిగా లేదు. ఇటువంటి తరుణంలో జీనోమ్ ఎడిటింగ్ వంటి ప్రయోగాలను అనుమతిస్తే విపత్కర పరిణామాలు ఎదురవుతాయి. కాబట్టి ఈ విధా నాన్ని అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది.
-మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి, 91827 77036