రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకుల్లో ఐకమత్యం లోపించింది. కుల, మత, ప్రాంతాల వారీగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల
నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మొత్తం ఉపాధ్యాయుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర ఉపాధ్యాయులు ఒకవైపు, తెలంగాణ రాష్ట్రం కోరుకునే ఉపాధ్యాయులు మరోవైపు రెండు సంఘాలుగా విడిపోయారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా పనిచేస్తున్నవారు జీవితకాలం తామే ఉండాలని కోరుకుంటున్నారు. ‘మీరు ఎన్నికై దశాబ్దకాలం గడిచింది? ఇంకెంతకాలం మీరు కొనసాగుతారు?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారు.
ప్రతి సంఘం నుంచి మూడు, నాలుగు సంఘాలు విడిపోయాయి. ఉదాహరణకు గతంలో ఎస్టీయూ సంఘం ఉండేది. ఎస్టీయూ నుంచి యూటీఎఫ్, డీటీఎఫ్, ఏపీటిఎఫ్లుగా ఏర్పడ్డాయి. పంచాయితీరాజ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించాలని, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులైనా, ప్రభుత్వ ఉపాధ్యాయులైనా డీఎస్సీ ద్వారానే ఉద్యోగానికి ఎంపిక అవుతున్నారని, కామన్ సీనియారిటీ కావాలనే పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) ప్రస్తుత పేరు ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ). తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ పీఆర్టీయూగా తర్వాత పీఆర్టీయూ తెలంగాణగా నాలుగు రకాల పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాలున్నాయి. ఈ విధంగా ఎన్నో ఉపాధ్యాయ సంఘాలు ఉండటం వల్ల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావడం లేదు.
గతంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు ఏదైనా పిలుపునిస్తే అధికార పార్టీ నేతలు వెంటనే పరిష్కరించేవారు. నాటి నాయకులకు ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో) మీద, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మీద మంచి పట్టు ఉండేది. నేటి నాయకులకు డబ్బు యావ తప్ప, కనీస అవగాహన కూడా ఉండటం లేదు. దాదాపుగా రాష్ట్రంలో 58 ఉపాధ్యాయ సంఘాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏడు సంఘాలకు ఓడీ సౌకర్యం కల్పిస్తే దానిలో ఐదు ఉపాధ్యాయ సంఘాలే ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు నాయకత్వం వహించే నాయకులు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఏకతాటిమీదకు తెచ్చి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఉద్యోగ, ఉపాధ్యాయుల పే రివిజన్ కమిటీ (పీఆర్సీ) గడువు ముగిసి ఏడాది గడిచినా అడిగే నాథుడే లేడు. ఐదు, ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నా నాయకుల్లో ఉలుకు లేదు, పలుకు లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నగదు రహిత ఆరోగ్య కార్డులను పంపిణీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని పెండింగ్‌లో పెట్టింది. అయినా ఏ నాయకుడూ అడగడం లేదు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం దయతలచి ఎప్పుడో పదోన్నతులు, బదిలీలు చేస్తే అప్పుడు వారు సాధించిన విజయంగా గొప్పగా చెప్పుకొని క్షీరాభిషేకాలు చేస్తుండటం సిగ్గుచేటు. 317 జీవో, స్పౌజ్ కేసులలోనూ అంతే నిర్లక్ష్యం కనపడుతున్నది. అయినా ఏ నాయకుడూ పట్టించుకోడు.
హైదరాబాద్ ఫ్రీ జోన్‌గా ఉండేది. సమైకాంధ్రలో హైదరాబాద్‌ను వేరుగా, 7వ జోన్‌గా హైదరాబాద్ లోకల్ ప్రజలకు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు చార్మినార్ జోన్ అంటూ 4వ జోన్లో రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తిలతో హైదరాబాద్‌ను కలిపినా అడిగే ధైర్యం ఉద్యోగ, ఉపాధ్యాయులకు లేదు. హెచ్ఆర్ఏ 30 శాతం నుంచి నగరాలలో 24 శాతంగా చేసి 6 శాతం బేసిక్ పే నుంచి తీసివేసినా ఏ నాయకుడూ పట్టించుకోవడం లేదు.
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా ల నాయకులకు ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహించాలి. నగదు రహిత ఆరోగ్య కార్డులను జారీచేయాలని తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భర్త ఒక చోట, భార్య మరో చోట, వారి పిల్లలు ఒకచోట, ఉంటూ మానసిక క్షోభను అనుభవిస్తున్న స్పౌజ్ కేసులను మానవత్వంతో పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు కోరుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
-డాక్టర్ ఎస్.విజయభాస్కర్
92908 26988