లండన్ : ఐఫోన్ ఆర్డర్ ఇచ్చిన మహిళ తీరా ఇంటికి వచ్చిన బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో పగిలిన ఇటుక కనిపించడంతో అవాక్కయ్యారు. బ్రిటన్ లోని లాంక్ షైర్ కు చెందిన ఒలివియ పార్కిన్సన్ ఐఫోన్ 12 ప్రొమ్యాక్స్ కు ఆర్డర్ ఇచ్చారు. ఏప్రిల్ 14న వచ్చిన బాక్స్ ను ఆమె తెరిచి చూడగా అందులో ఇటుక కనిపించిందని ఐఫోన్ 12 ప్రొమ్యాక్స్ ఎక్కడంటూ ప్రశ్నిస్తూ ఒలివియా ఆ ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంత జరిగినా వర్జిన్ మీడియా ఐదు రోజులకు గాని తనకు వివరణ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.
ఇప్పటికీ దీనికి బాధ్యులెవరనేదానిపై నిగ్గుతేల్చేందుకు విచారణ చేపట్టారని తెలిపారు. చివరికి తాను ఇంతవరకూ అందుకోని ఐఫోన్ కు డబ్బు చెల్లించాలని వర్జిన్ మీడియా చెబుతోందని మీరంతా రీట్వీట్లు చేసి తనకు సాయం చేయాలని ఈ చెత్త కంపెనీ నుంచి ఎవరూ సర్వీసులు తీసుకోవద్దని పది రోజుల తర్వాత ఆమె మరో పోస్ట్ చేశారు. మరోవైపు జరిగిన తప్పిదంలో ఒలివియా బాధితురాలిగా తమ దర్యాప్తులో తేలిందని వర్జిన్ మీడియా ప్రతినిధి వెల్లడించారు. ఆమె ఖాతాను రద్దు చేసి ఆమె చెల్లించిన మొత్తాన్ని తిరిగి అందచేస్తామని పేర్కొన్నారు.