టోక్యో : జీవితంలో ఏదో ఒక పని చేస్తూ బతుకు బండి లాగడం ప్రతి ఒక్కరూ చేసే పనే. ఆస్తిపాస్తులు ఉన్న వారు మినహా ప్రతి ఒక్కరూ రెక్కల కష్టంపై బతకాల్సిన పరిస్థితే. అయితే అసలు ఏమీ చేయకుండానే అలవోకగా సంపాదిస్తున్నాడు టోక్యోకు చెందిన షోజి మోరిమోటో. తాను పనిచేయకుండా ఉన్నందుకే తనకు డబ్బులు ఇస్తారని మోరిమోటో (38) చెబుతున్నాడు. అతిధులకు తోడుగా వెళ్లేందుకు క్లయింట్ల నుంచి ఒక్కో బుకింగ్‌కు అతడు 10,000 యెన్లు (రూ . 5663) వసూలు చేస్తున్నాడు.
గత నాలుగేండ్లుగా మోరిమోటో ఏకంగా 4000కు పైగా సెషన్స్‌లో పాలుపంచుకున్నాడు. అతిధుల వెంట వెళ్లేందుకు తాను రెంట్‌కు సిద్ధంగా ఉన్నానని, తాను వారి వెంట ఉండటమే తప్ప ప్రత్యేకంగా ఓ పని అంటూ చేయనని మోరిమోటో చెప్పుకొచ్చాడు. ఎక్కువమంది క్లైంట్లు తనను తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంప్రదిస్తారని మైక్రో బ్లాగింగ్ సైట్‌పై 2.5 లక్షల పాలోయర్లను కలిగిన మోరిమోటో ఓ వార్తాసంస్ధతో మాట్లాడుతూ తెలిపాడు.
వీరిలో ఒకే వ్యక్తి మోరిమోటోని 270 సార్లు హైర్ చేసుకున్నారు. అయితే క్లైంట్లను ఎంపిక చేసుకోవడంలో మోరిమోటో కొన్ని పరిమితులు విధించుకున్నాడు. వస్తువులను తరలించడం, లైంగిక అవసరాలు తీర్చడం వంటి పనులకు తాను దూరమని చెప్పాడు. పదిమందిలో శారీ కట్టుకుని కనిపించడానికి భయపడే 27 ఏండ్ల డేటా అనలిస్ట్ అరుణ చిద మోరిమోటో లేటెస్ట్ క్లైంట్. ఈ జాబ్‌కు ముందు మోరిమోటో పబ్లిషింగ్ కంపెనీలో పనిచేయగా అక్కడ ఏమీ చేయకపోవడంతో అతడి నుంచి ఉద్యోగం నుంచి తొలగించారు. కానీ నిజంగా ఏమీ చేయకపోవడం మంచిదేనని, ప్రజలు నిర్దిష్ట పద్ధతిలో ఉపయోగకరంగా ఉండవలసిన అవసరం లేదు” అని మోరిమోటో అంటాడు.