ఆమెకు మెల్ల కన్ను, మెడ వంకర. అడుగడుగునా అవమానాలు. ఉద్యోగం కోసం వెళ్తే తిరస్కరణలు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు ఉద్యోగాలు ఆమెను కాదు పొమ్మన్నాయి. దీంతో జీవితం మీద విరక్తి కలిగింది. ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లింది. వాటన్నింటినీ అధిగమించి నేడు అందరికీ ఆదర్శమయ్యారు రాధికా గుప్తా. 33 ఏళ్లకే ఓ కంపెనీ సీఈవోగా పగ్గాలు అందుకున్నారు. తన జీవిత ప్రయాణంలో అడుగడుగునా ఎదుర్కొన్న అవమానాలు, ఎదురైన సవాళ్లను ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఎడెల్వీస్ సీఈవో రాధికా గుప్తా ‘హ్యుమన్స్ ఆఫ్ బాంబే’ అనే ఫేస్బుక్ పేజీతో పంచుకున్నారు.
రాధికా గుప్తా తండ్రి విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేసేవారు. దీంతో ఆమె ఢిల్లీ, పాకిస్తాన్, న్యూయార్క్, నైజీరీయాల్లో నివసించాల్సి వచ్చింది. ఆమెకు పుట్టకతోనే మెల్ల కన్ను, మెడ వంకరగా ఉండేవి. దీంతో ఎక్కడికెళ్లినా తోటి విద్యార్థులనుంచి వెక్కిరింపులు, అవమానాలే. నైజీరీయాలో ఆమె భాష చూసి తోటివాళ్లు ఆటపట్టించేవారు. ‘ది సింప్సన్స్’లోని ‘అపు’ అనే తికమక క్యారెక్టర్ పేరును రాధికా గుప్తాకు తగిలించారు.
ఆమె కనిపించినప్పుడల్లా ఈవ్‌టీజింగ్ చేసేవారు. ఆమె చదివే స్కూళ్లోనే వాళ్ల అమ్మ పనిచేసేది. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమెతో పోలుస్తూ.. రాధికా గుప్తా అంధ విహీనంగా ఉందంటూ ఎగతాళి చేసేవారు. దీంతో ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోయింది. ఆత్మన్యూనతను అధిగిమంచి ఉద్యోగం చేయాలనుకుంది. కానీ, 22 ఏళ్ల వయస్సులో ఏడు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే, అన్నింటిలోనూ తిరస్కరణకు గురైంది. దీంతో ఆమె తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. కిటికీలోంచి దూకి చచ్చిపోవాలనుకుంది. కానీ, ఆ సమయంలో ఆమె స్నేహితురాలు కాపాడింది.
తీవ్ర డిప్రెషన్లో ఉన్న రాధికా గుప్తాను ఆమె స్నేహితులు సైకియాట్రిక్ వార్డులో చేర్చారు. అదే సమయంలో ఆమెకు మరో ఇంటర్వ్యూ కోసం పిలుపొచ్చింది. ఈ సారి అనుమానంగానే వెళ్లిన ఆమెకు ఊహించని ఫలితం వచ్చింది. అమెరికాలోని మెకిన్సేలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఆమె జీవితం ట్రాక్‌లో పడింది. 2008లో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడింది. మూడేళ్ల తర్వాత రాధికా గుప్తా ఇండియాకు వచ్చింది. ఇక్కడే తన భర్త, స్నేహితుడితో కలిసి సొంత అసెట్ కంపెనీని ప్రారంభించింది.
భర్త సహకారంతో కంపెనీ సీఈవోగా..
రాధికా గుప్తా, ఆమె భర్త నళిన్ మోనిజ్, స్నేహితుడు సొంత కంపెనీతో సెటిల్ అయ్యారు. కొన్నేళ్లలోనే ‘ఎడెల్వీస్’ అనే కంపెనీని కొనుగోలు చేశారు. చీరకట్టులో రాధికాగుప్తా కార్పొరేట్ నిచ్చెన ఎక్కారు. ఉన్నతమైన అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. తన భర్త ప్రోత్సాహంతో ‘ఎడెల్వీస్’ కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. రాధికా గుప్తా ఇప్పుడు 33 వ ఏట అతి చిన్న వయస్సులోనే కార్పొరేట్ కంపెనీ సీఈవో అయిన మహిళల్లో ఒకరుగా నిలిచారు. ఆ తర్వాతి సంవత్సరమే ఆమె ఒక వేదికపై ఆమె తన వైకల్యాలను, ఆత్మన్యూనతా భావాన్ని అధిగమించి ఓ కంపెనీకి సీఈవో ఎలా కాగలిగానో వివరించారు. అందరి మన్ననలూ పొందారు. త్వరలోనే తన స్ఫూర్తివంతమైన జీవిగాథను పుస్తకంగా తీసుకొస్తున్నానని చెబుతున్నారు రాధికా గుప్తా.