ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు ఎన్నారై బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా నాయకులు నాగరాజు గుర్రాల శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 2 భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అని ఆయన పేర్కొన్నారు. యావత్ తెలంగాణ కలలుగన్న రోజు.. జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేని రోజు ఇదని అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పట్టలేని ఆనందంతో సంబరాలు నిర్వహించిన రోజు ఇదని, తెలంగాణలోని ప్రతి పల్లె, పట్నం, ఊరు, వాడ చిన్నా పెద్దా తేడా లేకుండా వేడుకలు అంబరాన్నంటాయని తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో అనేక త్యాగాలు, ఉద్యమాలు, విద్యార్థుల పోరాటాలు, అమరవీరుల ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని నాగరాజు గుర్రాల గుర్తుచేశారు. తెలంగాణ ప్రతి బిడ్డ గర్వంగా చెప్పుకునే ఆత్మగౌరవ చిహ్నమని అన్నారు. ఒకప్పుడు అభివృద్ధి దిశగా దూసుకెళ్లిన తెలంగాణ.. ఇప్పుడు మళ్లీ తిరోగమన దిశలో నడుస్తోందని విమర్శించారు. ఎక్కడ చూసినా నిరాశే కనిపిస్తోందని, అటు రైతులు ఆవేదనలో, ఇటు నిరుద్యోగులు ఎదురుచూపుల్లో ఉన్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదనే చర్చ జరుగుతోందని అన్నారు.
తెలంగాణను సాధించడం ఒక్కటే కాదు.. సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజలు మరోసారి ఆలోచించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యతిరేక శక్తుల కుట్రలను చేధించి, మన తెలంగాణను.. మన భవిష్యత్తును.. మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.