H-1B Visa | అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం.. ఆపై పేరొందిన ఐటీ కంపెనీలో పొందిన వారికి హెచ్1-బీ వీసా జారీ చేస్తారు. అయితే, రోజురోజుకు విదేశీయులు.. అత్యధికులు భారతీయ విద్యార్థుల తాకిడి పెరుగుతుండటంతో హెచ్-1 బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఏడాది నుంచి హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ ఫీజు పెంచుతున్నట్లు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) నిర్ణయం తీసుకున్నది. హెచ్-1 బీ వీసాతోపాటు ఎల్1 వీసా, ఎఫ్-1 విద్యార్థుల వీసా ధరలు కూడా పెంచుతున్నట్లు సంకేతాలిచ్చింది. వీసాల ప్రాసెసింగ్ ఫీజు పెంపు నిర్ణయం వచ్చే ఫిబ్రవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.
నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్లు హెచ్-1 బీ వీసా లేదా ఎల్1 వీసా కోసం దరఖాస్తు చేసేందుకు ఫామ్ ఐ-129 నింపి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ల ప్రాసెసింగ్ ఫీజు 12 శాతం అంటే 2805 డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది యూఎస్సీఐఎస్. ఇక ఇంటర్నేషనల్ విద్యార్థులు, హెచ్-1బీ వీసాదారుల భార్యలు / భర్తలు, డిపెండెంట్ల అప్లికేషన్ (ఫామ్ – ఐ-539) ఫీజు 1750 డాలర్ల నుంచి 1965 డాలర్లకు పెరిగింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కోసం దరఖాస్తు చేసుకునే ఎఫ్-1 విద్యార్థులు, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ దరఖాస్తు చేసుకునే ఇతర క్యాటగిరీ వీసాదారులు ఫామ్ ఐ-765 ప్రాసెసింగ్ ఫీజు 1500 డాలర్ల నుంచి 1685 డాలర్లకు పెరిగింది.
హెచ్-1బీ, హెచ్-3, ఈ-1, ఈ-2, ఈ-3, ఎల్-1ఏ, ఎల్-1బీ, ఎల్ జడ్, ఓ-1, ఓ-2, పీ-1, పీ1ఎస్, పీ-2, పీ-2ఎస్ తదితర వీసాల ప్రాసెసింగ్ ఫీజు 2805 డాలర్లకు పెంచారు. ఇంతకుముందు ఇది 2500 డాలర్లు మాత్రమే. హెచ్-2బీ లేదా ఆర్ -1 వీసా దారుల (నాన్ ఇమ్మిగ్రెంట్) ప్రాసెసింగ్ పీజు 1500 డాలర్ల నుంచి 1685 డాలర్లకు పెరిగింది. సాధారణంగా హెచ్-1బీ వీసాల అప్లికేషన్ల రిజిస్ట్రేషన్లు మార్చి నుంచి ప్రారంభం అవుతాయి. అప్లికేషన్ల స్వీకరణ పూర్తయిన తర్వాత లాటరీ తీసిన తర్వాత సెలెక్టెడ్ అభ్యర్థులు మళ్లీ తుది వీసా అప్లికేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది.