హైదరాబాద్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు(Ugadi celebrations) అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో ఘనంగా జరిగాయి. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు.
అనంతరం సింగపూర్ (Singapore) స్థానిక కాలమాన ప్రకారం ప్రత్యేకంగా రాయించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేశారు. ఈ గంటల పంచాంగాన్ని ప్రముఖ జ్యోతిష్య పండితుడు, పంచాంగ కర్తలు కప్పగంతు సుబ్బరామ సోమయాజులు, మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ సిద్ధం చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.