T-PAD on Bathukamma | బతుకమ్మ పండుగ మరింత వైభవంగా నిర్వహించడానికి డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (టీ-పాడ్) సిద్ధమవుతున్నది. దసరా (విజయదశమి) వేడుకలు జరిపేందుకు సన్నాహాలు ప్రారంభించింది. విదేశాల్లో వైభవంగా బతుకమ్మ పండుగ నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి దృష్టిని ఆకర్షించింది టీ-పాడ్. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. గతేడాది దాదాపు 12 వేల మందితో బతుకమ్మ పండుగ నిర్వహించింది. ఈ ఏడాది సుమారు 16 వేల మందితో మహా సంబురంగా, మరింత ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించడానికి టీ-పాడ్ నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
డల్లాస్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అందుకు అనుగుణంగా బతుకమ్మ పండుగ నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టాలని టీ-పాడ్ నిర్ణయించింది. వచ్చేనెల ఒకటో తేదీన కొమెరికా ఈవెంట్ సెంటర్ (డాక్టర్ పెప్పర్ ఎరెనా) వేదికగా నిర్వహించే బతుకమ్మ వేడుకకు అందరినీ ఆహ్వానిస్తున్నది. పొరుగు రాష్ట్రాలు.. ఒక్లహామా, కాన్సాస్, అర్కన్సాస్‌లో ఉంటున్న తెలుగువారు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారని టీపాడ్ ప్రతినిధులు తెలిపారు.
ఫ్రిస్కో పట్టణంలోని శుభమ్ ఈవెంట్ సెంటర్లో ఈ మేరకు నిర్వహించిన సన్నాహక సమావేశంలో టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్ అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, రావు కల్వల, అధ్యక్షుడు రమణ లష్కర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ ఇంద్రాణి పంచెర్పుల, ఉపాధ్యక్షులు మాధవి లోకిరెడ్డి, పాండు పాల్వాయి పాల్గొన్నారు. భారీగా నిర్వహించే బతుకమ్మ వేడుకలకు కాలిఫోర్నియా నివాసి,హెల్త్‌కేర్ మొఘల్ డాక్టర్ ప్రేమ్‌రెడ్డి తన మద్దతు ప్రకటించారు.
బతుకమ్మ పండుగ ఉత్సవాలు జరుపుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలందిస్తామని నాటా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి కొర్సపాటి తెలిపారు. స్థానిక నాయకులు, వ్యాపారులు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములమవుతామని తెలిపారు. కాగా, ఇటీవలే టీపాడ్ డల్లాస్‌లో టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల వెంకటేశ్వరస్వామి కల్యాణం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.