NRI News | విదేశాల్లోని తెలుగువారు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కెనడాలోని నోవాస్కోటియా ప్రావిన్స్‌లో ఉన్న హాలిఫాక్స్ నగరంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. కెనడా నోవా స్కోటియా తెలుగు అసోసియేయన్ ఆధ్వర్యంలో బెడ్‌ఫోర్డ్‌లోని ఫ్రెంచ్ స్కూల్లో నిర్వహించిన ఈ వేడుకలకు హాలిఫాక్స్, డార్ట్ మౌత్, బెడ్ ఫోర్డ్, సమీప గ్రామాల్లో ఉన్న తెలుగువారు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అంతాకలిసి సంక్రాంతి, భోగి, కనుమ వేడుకలు
రంగ రంగ వైభవంగా జరుపుకున్నారు. నిర్వాహకులు సుప్రజా హరి, ప్రియాంక సురేష్, కుమారి శ్రీలేఖ, వారి బృందం కలిసి మన సంప్రదాయం ఉట్టిపడేలా ముగ్గులు, గాలిపటాలు, పూల తోరణాలు, భోగి కుండలతో వేదికను అలంకరించారు. గణేశ వందనంతో పండుగ సంబురాలను ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం తెలుగు పండుగలకు మూలమని, భావి తరాలకు మన సంప్రదాయాలను తెలియజేసేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
నోవా స్కోటియా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీహరి రెడ్డి చల్లా ఆధ్వర్యంలో ఈ వేడుకలకు విజయ్ రాహుల్ భాష్యకర్ల, శ్రీహరి రెడ్డి చల్లా, జితేందర్ బాలి, ఆండ్రూ లీపర్, శివ నవనీథన్, శ్రీహరి బృందం స్పాన్సర్లుగా వ్యవహరించారు.
చిన్నారులు నిత్య శ్రీ విద్య, రోహిత్ సాయి చల్లా, శ్రీనివాస్ చిన్ని, మహాశ్విన్ విద్యా, సుసుష్మ ప్రదీప్,
వేదాన్షిక సురేష్, మిహిర మొగలిపురి, శ్రేష్ఠ శ్రీమయీ దొంతంశెట్టి, అమూల్య పిన్నిని, సంగీత రాజు, కీర్తన రాజీవ్, మెగ్గీ కరమ్, మోక్షిత చిన్ని, సాయి రేయాన్ష్ చిన్ని, హర్షవర్ధన్ ఆలేటి, శిబి నందన్ మహేష్ కుమార్, జోషిత్ మొగలి పురి, ఆరాధ్య మల్కా, పూజ బరన్వాల్, రితి నైనికా కోతా, రిధి బొజ్జిని తమ నృత్యాలతో ఆహుతులను అలరించారు.
చిన్న పిల్లలకు ముత్తైదువులతో భోగి పళ్లు పోయించి చిన్నారులని కలకాలం ఆయురారోగ్యాలతో ఉండమని దీవించారు. చిన్న పెద్దా అంతాకలిసి భోగి మంటల చుట్టూ నృత్యం చేశారు. సరదాలు తెచ్చే సంక్రాంతి, హరిదాసుల ప్రదర్శనలతో, డూడూ బసవన్న మాటలతో అబ్బురపరిచాయి. జానపదం, కూచిపూడి, భరతనాట్యం, ఒడిసి, తెలుగు చిత్రాల పాటలు నృత్యాల వంటి అనేక సాంస్కృతిక ప్రదర్శనలు పండుగలంటే ఇలా ఉండాలనే అనుభూతిని కలిగించాయి. చిరంజీవి తన ఆటపాటలతో అలరించగా, సిబి నాథన్ కర్ర సాము నైపుణ్యంతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ‘సొగసు చూడ తరమా’ అంటూ భార్యాభర్తల మధ్య పోటీలు ముచ్చట కలిగించాయి. పార్వతి శాస్త్రి చెల్లూరి, వేణుగోపాల్ రావు బెజవాడ, నూకరాజు కరణం కళాకారులను జ్ఞాపికతో సత్కరించారు.
కెనడా నోవా స్కోటియా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ హరి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల మన పండుగలు, సంప్రదాయాలు భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేస్తాయన్నారు. ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీజాతి నిండు గౌరవముతో’ అనే విధంగా కెనడా నోవా స్కోటియా తెలుగు అసోసియేషన్ కృషి చేస్తుందని సుప్రజ హరి తెలిపారు.