న్యూఢిల్లీ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్, శుభోదయం మీడియా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇంటర్నెట్ ద్వారా 12 దేశాల కవులు కవయిత్రులతో అంతర్జాతీయ కవిసమ్మేళనం అద్వితీయంగా జరిగింది. పన్నెండు దేశాలకు చెందిన 75 మంది కవులు, కవయిత్రులు ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. పింగళి వెంకయ్య రూపొందించిన భారత జాతీయ జెండా 102వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు.
పింగళి వెంకయ్య మనవడు GVN నరసింహం జ్యోతిని వెలిగించి కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు.
భారతదేశం నుంచేగాక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, ఇండోనేషియా, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యూకే, దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా దేశాల నుంచి కవులు పాల్గొని “భారతదేశ జాతీయ సమైక్యత – విశిష్టత” అనే అంశంపై తమ కవితలు వినిపించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, సింగపూర్ నుంచి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరి రత్న కుమార్, వంశీ వ్యవస్థాపకులు డా వంశీ రామరాజు తమ ప్రసంగాలను అందించారు.
కార్యక్రమ ప్రధాన సమన్వయకర్తగా రాధిక మంగిపూడి సభను నిర్వహించగా.. కృష్ణవేణి సహ వ్యాఖ్యాతగా సహకరించారు. శుభోదయం మీడియా సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు.