MYTA | మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) తొలిసారిగా బోనాల వేడుకలను ఈ నెల 20 నిర్వహించారు. ఉత్సవాలను తెలంగాణ తరహాలోనే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి వందలాది తెలుగు కుటుంబాలు, భారతీయులతో పాటు మలేషియాకు చెందిన పలువురు హాజరయ్యారు. బోనం అర్పణ, జానపద నృత్యాలు, ఊరేగింపు కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బోనాలను మలేషియాలో నిర్వహించడం తమ సంస్కృతిని కాపాడటమే కాదు.. మలేషియన్ సమాజంలో మన సంప్రదాయాలను పంచుకునే అవకాశం కూడా అని మైటా ప్రెసిడెంట్ సైదం తిరుపతి అన్నారు.
ఇది అసోసియేషన్‌కు గర్వకారణమని.. ఇకపై ప్రతి ఏటా బోనాల వేడుకలు కొనసాగించే ఉద్దేశంతో ఉన్నామన్నారు. మలేషియాలోని తెలంగాణ వాసుల సంస్కృతి, భాష, సంప్రదాయాలను పరిరక్షించే ప్రయత్నంలో ముందున్నామన్నారు. మలేషియాలో నివసిస్తున్న తెలంగాణ వాసులకు ప్రాతినిధ్యం వహిస్తూ, వారి సంస్కృతి, భాష, సంప్రదాయాల పరిరక్షణకు కృషిచేసే లాభాపేక్షలేని మైటా. భాషా అభివృద్ధి, సాంస్కృతిక ఉత్సవాలు, సామాజిక కార్యక్రమాల ద్వారా సమాజాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తున్నది.