Kuwait | ప్రముఖ దిగ్గజ వయోలిన్ విద్వాంసుడు, పద్మభూషన్ డాక్టర్ ఎల్.సుబ్రమణ్యం అద్భుత ప్రదర్శన కువైట్‌ను అలరించింది. జాబర్ కల్చరల్ సెంటర్లోని కువైట్ నేషనల్ థియేటర్లో ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వయోలిన్ సింఫొనీ కార్యక్రమాన్ని IBPC చైర్మన్ మిస్టర్ కైజర్ షకీర్ సమక్షంలో భారత రాయబారి హెచ్ ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కువైట్ స్నేహితులలో భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడానికి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు IBPC కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కచేరీలో భారతీయ వయోలిన్ దేవుడిగా కీర్తించబడే డాక్టర్ సుబ్రమణ్యం తన అసమానమైన కళాత్మకతను ప్రదర్శించారు. క్లిష్టమైన రాగాలను సైతం మాస్టర్ఫుల్ ఇంప్రూవైజేషన్ చేశారు. ఆయన నైపుణ్యం సంగీత ప్రేక్షకులను తన్మయత్వానికి గురిచేసింది. తన కుమారుడు అంబి సుబ్రమణ్యంతో కలిసి ఆయన శాస్త్రీయ, సమకాలీన శైలులను సజావుగా మిళితం చేస్తూ చేసిన సంగీత ప్రయాణం అందర్నీ ఉర్రూతలూగించింది. వారు వాయించిన రాగాలకు (మోడల్ స్కేల్ మెలోడీ) తరచుగా చప్పట్లు కొట్టారు. మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్న ఒక మాస్ట్రోకు గౌరవ సూచకంగా చివర్లో ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టారు.
Ibpc Kuwait1
ఈ కచేరీ భారతీయ శాస్త్రీయ సంగీతం యొక్క గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించడమే కాకుండా భారత్- కువైట్ మధ్య సాంస్కృతిక సంభాషణను బలపరిచిందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. హాజరైన వారందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసిందని అన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి IBPC కార్యదర్శి సురేశ్ K.P., జాయింట్ సెక్రటరీ సునీత్ అరోరా, కోశాధికారి కిషన్ సూర్యకాంత్, వివిధ దేశాల రాయబారులు, కువైట్ ప్రభుత్వ అధికారులు, వ్యాపార ప్రముఖులతో సహా పలువురు హాజరయ్యారు.
Ibpc Kuwait2