జోహానెస్‌బర్గ్ : నూతన సంవత్సరం మొదటి రోజును ‘Uplift A Child South Africa’ డైరెక్టర్ గుర్రాల నాగరాజు (Gurrala Nagaraju) కుటుంబం మానవతా విలువలతో ప్రారంభించింది. గురువారం ‘హోటల్ హోమ్స్’ (Hotel Homes) అనాథాశ్రమంను సందర్శించిన నాగరాజు ఫ్యామిలీ అక్కడి చిన్నారులకు అవసరమైన కిరాణా సరుకులు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులను అందజేసింది.
ఈ సేవా కార్యక్రమంలో గుర్రాల నాగరాజు, ఆయన భార్య, పిల్లలు, సన్నిహిత మిత్రులు పాల్గొని చిన్నారులతో కలివిడిగా కాసేపు గడిపారు. కొత్త ఏడాదిని పురస్కరించుకొని అనాథపిల్లల అవసరాలు తీర్చడం సంతోషంగా ఉందని గుర్రాల నాగరాజు అన్నారు. చిన్న పిల్లల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
“కొత్త సంవత్సరాన్ని సేవాకార్యక్రమంతో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. చిన్న సహాయమైనా సరే ఆ చిన్నారుల జీవితాల్లో ఆశను నింపగలదు. సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని నాగరాజు తెలిపారు. ప్రేమ, దయ, ఐక్యతతో నాగరాజ కుటుంబం నూతన సంవత్సరాన్ని స్వాగతించిన తీరును స్థానికులు ప్రశంసించారు. తమ సేవా కార్యక్రమం మరెందరికో ప్రేరణగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.