Sri Samskrutika Kala Sarathi | సింగపూర్‌లోని శ్రీ సాంస్కృతిక కళా సారధి తృతీయ వార్షికోత్సవ వేడుకలు అద్వితీయంగా జరుపుకున్నది. 2020 జూలైలో శ్రీ సాంస్కృతిక కళాసారథి ఏర్పాటైంది. నాటి నుంచి ఇప్పటి వరకు వివిధ రంగాలపై50కు పైగా విలక్షణమైన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ రామ్ మాధవ్, విశిష్ట అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వంశీ వ్యవస్థాపకులు డా వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు. సంస్థ తృతీయ వార్షికోత్సవ వేడుకలను అభినందిస్తూ సందేశాలు ఇచ్చారు.
భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సంస్థ, దాని నిర్వాహకులను అభినందిస్తూ వీడియో సందేశం పంపారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, సినీ రచయిత భువనచంద్ర, పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ తదితరులు అభినందన సందేశాలు పంపారు. ఈ కార్యక్రమంలోనే `సింగపూర్ తెలుగు టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న `తెలుగు నీతిపద్యాల పోటీ దారావాహిక మొదటి భాగాన్ని జొన్నవిత్తుల రామలింగేశ్వర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జొన్నవిత్తుల మాట్లాడుతూ తెలుగు భాష, భారతీయ సంస్కృతులను నిలబెట్టేందుకు కంకణదారిగా పలు అద్భుత కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీసాంస్కృతిక కళా సారధి, సంస్థ బృందానికి అభినందనలు తెలిపారు.
వారు రచించిన ‘ఆవకాయ శతకం’, ‘కోనసీమ శతకం`లలో కొన్ని పద్యాలను ఆలాపించి శ్రోతలను ఉర్రూతలూగించారు. `మైకాష్టకం` అంటూ మైకు ముందు మాట్లాడే విషయమై చెప్పిన హాస్యభరిత సన్నివేశాలు ఆహుతులను అలరించాయి. అలాగే `తెలుగోళ్ళం తెలుగోళ్ళం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్లం` అంటూ వారు స్వయంగా రచించి పాడిన పాటకు సభ మొత్తం చప్పట్లతో మారుమ్రోగి పోయింది.
ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ మంచి దృఢ సంకల్పంతో సమాజానికి, భాషకు, సంస్కృతికి సేవచేయాలనే పట్టుదలతో పనిచేస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ మరో వందేళ్ల పాటు ఇలా వెలుగులు విరజిల్లుతూ వృద్ధి చెందాలని ఆశీస్సులు అందించారు. భారతీయత తెలుగుదనము మేళవించిన ఒక మంచి సమాజాన్ని తెలుగు రాష్ట్రాలలో నిలబెట్టాలని అలా నిలబెట్టేలా కృషిచేస్తున్న ఈ శ్రీ సాంస్కృతిక కళాసారథి వంటి సంస్థలు అదే లక్ష్యంతో పనిచెయ్యడం చాలా సంతోషదాయకం అని అన్నారు.
శ్రీ సాంస్కృతిక కళా సారధి అద్యక్షుడు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ.. భగవంతుడి అనుగ్రహం, పెద్దల దీవెనలు, అందరి ప్రోత్సాహం సహాయ సహకారాలతో అందరి మన్ననలు పొందడం తమ సంస్థ అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతి కార్యక్రమాలను అభినందించారు. 400 మంది ప్రత్యక్షంగా, 1200 మంది పరోక్షంగా ఆన్లైన్ ద్వారా వీక్షించారని నిర్వాహకులు తెలిపారు.
రాధిక మంగిపూడి సభా నిర్వహణ బాధ్యతలు నిర్వహించారు. శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల తదితరులు సింగపూర్ కళాకారులతో కూచిపూడి, కథక్ జానపద నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, తెలుగు పద్య పఠనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించారు.
గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, వంశీ కృష్ణ శిష్ట్లా సాంకేతిక నిర్వహణా బాధ్యతలు నిర్వర్తించారు. కుమార్, మోహన్, మౌక్తిక, సునీత, రాధికా, రాజి, రేణుక, ప్రసన్న తదితరులు వాలంటీర్లుగా పని చేశారు. జీఐఐఎస్, టింకర్ టాట్స్ మొంటోసిరి, కౌ అండ్ ఫార్మర్, ఈగ జ్యూస్, శబ్ద కాన్సెప్ట్స్, ఎస్ఎన్ఎం డెవలపర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ (భీమవరం), టెర్రాన్ స్పేస్ (హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీ), ప్రొపొనెక్స్ రాజశేఖర్ ఆర్ధిక సహకారం అందించారు.
https://youtube.com/live/9ctcD2czWZk?feature=sharec లింక్ ఓపెన్ చేయాలి..