లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో పదేండ్ల క్రితం ప్రారంభమైన సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం 2 నవంబర్, 2024 నాడు దశమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీ మహా త్రిపుర సుందరీ సమేత శ్రీ ఉమా సహస్ర లింగార్చన పూర్వక హరిద్రా కుంకుమార్చన సహిత లక్ష బిల్వార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి వారిని అర్చన చేసుకోవటానికి
దాదాపుగా 50 మంది తెలుగు బ్రాహ్మణ రుత్వికులు పాల్గొన్నారు.
కార్తీక మాసం మొదటి రోజు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని లిటిల్ ఇండియాలోని ఆర్య సమాజ్ ప్రాంగణములో 12 గంటలు పైగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు గణపతి పూజ పుణ్యాహవచనంతో మొదలుకొని మృత్తికా శోధన కార్యక్రమంతో మహాన్యాసా పూర్వకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా భారత్ నుంచి తెప్పించిన శ్రేష్ఠమైన పుట్టమన్నుతో 1136 మహా పరమశివ లింగాలు చేశారు. వాటిని సమంత్ర పూర్వకంగా మూల మంత్రంతో ఆవరణ అర్చన చేశారు. అరుణ పారాయణం చేసిన పిదప ఏకాదశ వార రుద్రాభిషేకం శ్రీ రుద్ర పూర్వకంగా చేశారు. అనంతరం సూక్తముల పారాయణా సహితంగా వేదోక్త శాంతులయిన దశశాంతులతో శ్రీ సహస్ర లింగేశ్వరుని సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. చిన్న విరామం అనంతరం 50 మంది దంపతులు కలసి లలిత సహస్రనామములతో హరిద్రాకుంకుమార్చన నిర్వహించారు. అనంతరం శివ సహస్రనామ పూర్వక లక్ష బిల్వార్చనా అంతర్గత రుద్రాక్రమార్చన పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చివరగా షోడశ ఉపచారా పూజ, దర్బార్ సేవతో ప్రదోష వ్రతం కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.
ఈ కార్యక్రమాన్ని సింగపూర్ బ్రాహ్మణ సమాజ బ్రహ్మలు ప్రసాద్ కప్పగంతుల, నేమాని సత్య రమేశ్, రాజేష్ శ్రీధర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇండియా నుంచి వచ్చిన సలక్షణ ఘనాపాటి వంశీ(రాధే) పాల్గొని కార్యక్రమానికి సహకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఇటువంటి పెద్ద కార్యక్రమం భారతదేశంలోనే చాలా అరుదుగా జరుగుతుందని అన్నారు. అలాంటిది సింగపూర్లో మొట్టమొదటి సారిగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిచిన వర్కింగ్ టీం సభ్యులు గణపతి శాస్త్రి ఆకెళ్ళ, సూర్య పవన్ యనమండ్ర, వంశీకృష్ణ శిష్ట్లా , ముఖ్యదాతలు రంగనాథ్ వల్లభజోస్యుల, ఆదిత్య కర్రా , రామన్, భాను ఆకుండి, సంపూర్ణ స్వదేశ్, వీర ఫ్లవర్స్, వేద ఫ్లవర్స్ వాలంటీర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. అలాగే ఆర్యసమాజ్ వారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రిత్విక్లకు, భక్తులకు పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన ప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు శ్రీప్రదాయ చల్లా, రాజేశ్ యనమండ్ర, వేణు మాధవ్ మల్లవరపు, రత్నకుమార్ కవుటూరు ధన్యవాదాలు తెలిపారు.