లండన్ : లండన్లోని భారత హైకమిషన్ ( Indian High Commission ) ఆధ్వర్యంలో తెలంగాణ డే వేడుకలు (Telangana Celebrations ) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను సెంట్రల్ లండన్ ( London ) లోని భారత హైకమిషన్ కార్యాలయంలో నిర్వహించారు.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే (TAUK) సంస్థ తెలంగాణ సంస్కృతి ప్రతిభింబిం చేలా ప్రత్యేక నృత్య ప్రదర్శన , హాజరైన అతిధులకు హైదరాబాద్ బిర్యానీ( Hyderabadi Biryani ) ని రుచి చూపించారు.

కార్యక్రమంలో ముందుగా లండన్లోని భారత హైకమిషనర్ పెరియసామి కుమారన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు, ప్రవాసులకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాసుల్లో ఐక్యత , విదేశీ గడ్డ పై భారత సంస్కృతిని ప్రచారం చేయడానికి వివిధ రాష్ట్రాల ఆవిర్భావ వేడుకలను భారత హైకమిషన్ అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా టాక్ చిన్నారులు తెలంగాణ జానపద , సాంస్కృతిక గీతాలకు నృత్య ప్రదర్శనలు చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల( Ratnakar Kadudala ) మాట్లాడుతూ టాక్ వ్యవస్థాపకుడు , తెలంగాణ ఉద్యమ నాయకుడు అనిల్ కూర్మాచలం నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ కేసీఆర్ పిలుపు మేరకు భారత హై కమిషన్ ఎదుట ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశామని, అదే కార్యాలయంలో అధికారికంగా తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని తెలిపారు.

టాక్ ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు , కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్పర్సన్ గణేష్ కుప్పలా సంస్థ చేస్తున్న సేవలను వివరించారు.టాక్ సంస్థ సభ్యులు కుమారి తన్మయి వర్షిణి కుప్పాల, నిధి గుడ్ల, ఏషిక.డి చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భాషను విదేశాల్లోని భావితరాలకు పరిచయం చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని మరింతగా చాటిచెప్పే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం గర్వకారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ వేడుకల్లో భారత సంతతికి చెందిన తెలంగాణ వాస్తవ్యులు లార్డ్ ఉదయ్ నాగరాజు, టాక్ సంస్థ ప్రతినిధులు నవీన్ రెడ్డి, సురేష్ బుడగం, స్వాతి, అబ్దుల్ ఖుద్దూస్, నవ్య కుప్పాల ,కుమారి తన్మయ తదితరులు పాల్గొన్నారు.