T-PAD New Committee | బతుకమ్మ, దసరా పండుగలను తెలుగు ప్రజలు గర్వించేలా నిర్వహిస్తామని అమెరికాలోని డల్లాస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) పాలకవర్గ నేతలు చెప్పారు. ప్రపంచం కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా, తెలుగు ప్రజలు గర్వించేలా బతుకమ్మ, దసరా పండుగలను వేల మందితో భారీఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. అత్యంత ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించి ప్రపంచ తెలుగు ప్రజలను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకర్షించిన డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి-2022 కొత్త కార్యవర్గం ఎన్నికైంది.
కమిటీ నూతన అధ్యక్ష కార్యదర్శులతోపాటు పాలకమండలి సభ్యులందరూ ఈ నెల 12న ఫ్రిస్కో నగరంలోని ఓ హోటల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక నేతలు, టీపాడ్ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. గత పాలక మండలి.. నూతన కార్యవర్గంతో ప్రమాణం చేయించి బాధ్యతలు అప్పగించారు.
అంతకుముందు పద్మవిభూషణ్, బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ఇటీవలే మరణించిన లెజెండరీ సింగర్ లతామంగేష్కర్‌కు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ముందుగా అమెరికా, భారత జాతీయ గీతాలను ఆలపించారు. రూప కన్నయ్యగారి, అనురాధ మేకల నిర్వహణలో స్థానిక గాయకులు స్నిగ్ధ ఏలేశ్వరపు, శ్రావణ్‌కుమార్ శ్రావ్యమైన గీతాలతో ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్పర్సన్ ఇంద్రాణి పంచెర్పుల, అధ్యక్షుడు రమణ లష్కర్, సమన్వయకర్త పాండురంగారెడ్డి పాల్వాయి, కార్యదర్శి లక్ష్మీ పోరెడ్డి, ఉపాధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి మాట్లాడారు. ఏటా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలను, భోజన వితరణను మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఫౌండేషన్ కమిటీ చైర్మన్ అజయ్‌రెడ్డి, వైస్‌చైర్మన్ జానకీరాం మందాడి, రావు కల్వల, రఘువీర్ బండారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరానికి అందించడంతో పాటు తాము నివసిస్తున్న ప్రాంతాల సంస్కృతిని సుసంపన్నం చేయడమే తమ లక్ష్యమన్నారు. నరేష్ సుంకిరెడ్డి, కరణ్ పోరెడ్డి, చంద్ర పోలీస్, సతీష్ నాగిళ్ల తదితరులు కొత్త ఎన్నికైన పాలకమండలి సభ్యులను అభినందించారు.
ఫ్రిస్కో పార్క్స్ అండ్ రిక్రియేషన్ బోర్డ్ సభ్యుడు, టీపాడ్ సలహాదారు వేణు భాగ్యనగర్ మాట్లాడుతూ మహిళల భాగస్వామ్యంతోనే డాలస్ తెలంగాణ ప్రజాసమితి విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహించగలుగుతున్నామని కొనియాడారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(టీఏఎన్‌టీఈఎక్స్) మరియు ఇండియన్ అసోసియేషన్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్టీ)లో పలు పదవుల్లో సేవలందించి, ప్రస్తుతం నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) అధ్యక్షుడుగా పనిచేస్తున్న శ్రీధర్‌రెడ్డి కొర్సపాటిని టీపాడ్ నాయకత్వం సత్కరించింది.
2022 సంవత్సర ఎగ్జిక్యూటివ్ కమిటీలో రమణ లష్కర్, మాధవి లోకిరెడ్డి, లక్ష్మీపోరెడ్డి, రత్న ఉప్పల, రవికాంత్ మామిడి, లింగారెడ్డి అల్వా, అనురాధ మేకల, మధుమతి వైశ్యరాజు, మంజుల తొడుపునూరి, శ్రీధర్ వేముల, శ్రీనివాస్ అన్నమనేని, శంకర్ పరిమల్, గాయత్రి బుషిగంపల, స్వప్న తుమ్మపాల, రేణుక చనమోలు ఉంటారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌గా టీపాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌గా ఇంద్రాణి పంచెర్పుల, సుధాకర్ కలసాని, పాండురంగారెడ్డి పాల్వాయి, గోలి బుచ్చిరెడ్డి, మాధవి సుంకిరెడ్డి, అశోక్ కొండల, పవన్ గంగాధర, రావు కల్వల, జానకీరాం మందాడి, రఘువీర్ బండారు, రాం అన్నాడి వ్యవహరిస్తారు.