లండన్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రాధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవపేట్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ నేత సంతోష్‌కు నోటీసులు పంపారని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేయడంలో శ్రద్ధ చూపించకుండా, బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధిచడానికి మాత్రమే పూర్తి సమయాన్ని వెచ్చిస్తోందని హరి గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రజలంతా గమనిస్తున్నారని, ఉద్యమ పార్టీ నాయకులు ఇలాంటి నోటీసులకు బెదిరే వారు కాదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో మరింత ధైర్యంతో ముందుకు వెళ్లి.. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హరి గౌడ్ నవపేట్ తెలిపారు.
ఎన్నారైలంతా కాంగ్రెస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, సాధించుకున్న తెలంగాణ అసమర్ధుల పాలైందని బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై శ్రద్ధ పెట్టి, ప్రజలకిచ్చిన హామీలని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్తారని హరి గౌడ్ నవపేట్ హెచ్చరించారు.