Gurrala Nagaraju : తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు(Gurrala Nagaraju) అన్నారు. జలవనరులపై కనీస అవగాహన లేకుండా బచావత్ – బ్రిజేష్ ట్రిబ్యునళ్ల మధ్య తేడా కూడా తెలియని స్థితిలో సీఎం మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని నాగరాజు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్‌ను, సాగునీటి విప్లవానికి రూపకర్త అయిన హరీష్ రావును “ఉరి వేయాలి” అని వ్యాఖ్యానించడం. ఇది రాజకీయ విమర్శ కాదు, ప్రజాస్వామ్యంపై, తెలంగాణ ఆత్మగౌరవంపై చేసిన దాడి అని నాగరాజు పేర్కొన్నారు.
‘కేసీఆర్ 69 శాతం నీటి వాటా కోసం, 811 టీఎంసీల పునర్విభజన కోసం పోరాడితే, హరీష్ రావు కాళేశ్వరం నుంచి పాలమూరు–రంగారెడ్డి వరకు తెలంగాణ రైతుకు ప్రాణం పోశారు. అలాంటి మహా నాయకులపై ఈ స్థాయి మాటలు మాట్లాడటం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనం. 299 టీఎంసీల అబద్ధపు కథలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. పోలవరం, కృష్ణా, గోదావరి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు అధికారంలోకి వచ్చాక ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. ఇప్పటికైనా అబద్ధాలు కాదు నిజాలు మాట్లాడండి’ అని గుర్రాల నాగరాజు సీఎం రేవంత్‌కు సూచించారు.