Gurrala Nagaraju : రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షులు నాగరాజు గుర్రాల (Gurrala Nagaraju) మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్ విచారణకు పిలవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిట్ విచారణ కాదని, పూర్తిగా రాజకీయ కక్షతో చేపట్టిన విచారణ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు, అనవసర విచారణలతో రాజకీయ ప్రతీకారానికి దిగుతోందని నాగరాజు ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కార్ దొంగ నాటకాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తుందని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షులు స్పష్టం చేశారు. చట్టంపై, న్యాయస్థానాలపై తమకు పూర్తి గౌరవం ఉందని తెలిపిన ఆయన బెదిరింపులకు బీఆర్ఎస్ నేతలు భయపడరని తేల్చి చెప్పారు. ఎన్ని అవరోధాలు కలిగించినా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని నాగరాజు పేర్కొన్నారు.