రాయపోల్, ఆగస్టు 07 : తెలుగు భాషా సంస్కృతి పునరుజ్జీవనానికి ప్రతిరూపంగా నిలుస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆట), సభ్యునిగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బాగన్న గారి రవీందర్ రెడ్డినియామకమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజాన్ని ఏకం చేసి, సాహిత్యం, విద్య, ఆరోగ్య, ఆర్థిక రంగాలలో అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. కాగా, ఆట కార్యవర్గ విస్తరణలో రవీందర్ రెడ్డిని ఆట సభ్యుడిగా నియమించారు.
ఈ సందర్భంగా ఆట సాహిత్య విభాగం అధ్యక్షుడు నక్షత్రం వేణుగోపాల్ మాట్లాడుతూ.. రానున్న డిసెంబర్ నెలలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జరగబోయే ‘ఆటాడేస్’ విభిన్న సాంస్కృతిక కార్యక్రమాల్లో రవీందర్ రెడ్డి పాలుపంచుకుంటారని తెలిపారు. అంతేకాక, హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం వేదికగా జరుగబోయే తెలుగు సాహిత్య మహాసభల్లో ఆయన చురుకైన పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన వారికి రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.