లండన్ : ఓ బాలికపై లైంగిక దాడికి యత్నించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగం నాయకురాలు అమరేశ్వరి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు తెలియజేసిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలాగా ఉన్నాయన్నారు. సభ్య సమాజం తల దించుకొనేలా ఉన్నాయన్నారు. ఈ ఘటనలో బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) కేసు నమోదయినప్పటికి అరెస్ట్ చెయ్యకపోవడం దారుణమన్నారు.
ఇప్పటి వరకు మీడియా ద్వారా అందిన సమాచారం మేరకు, బండి సంజయ్ బాధిత కుటుంబాన్ని బెదిరించాడని, అలాగే పోలీసులు కూడా తమ విధులని సక్రమంగా నిర్వహించలేదనేది స్పష్టం అవుతుందన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా మీడియా సంస్థలు సంఘటితంగా కృషి చెయ్యాలని, ఇలాంటి పరిస్థితి రేపు ఎవరికి రాకుండా చూడాలన్నారు. ఒక మహిళగా ఇలాంటి సంఘటనలు చూస్తుంటే భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ కి కొనసాగే అర్హత లేదని, ప్రధాన మంత్రి మోదీ వెంటనే చర్యలు తీసుకొని బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ కి కొమ్ము కాస్తూ కాపాడాలనే ప్రయత్నం చేస్తే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ కూర్మాచలం, నవీన్ రెడ్డి, అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి, మహిళా కమిషన్లకు, ఇతర బాధ్యతగా సంఘాలకు లేఖలు రాస్తామని అమరేశ్వరి హెచ్చరించారు.