లండన్ : తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించి, రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్(Kottapalli Jayashankar) వర్ధంతిని లండన్లో నిర్వహించారు. వర్ధంతి సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే, టాక్ ప్రతినిధులు జయశంకర్ సార్కు ఘనంగా నివాళులు అర్పించారు.
జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా సమాజ అభివృద్ధి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం కృషి కొనసాగించాలని నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావానికి జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన చూపిన మార్గం తెలంగాణ సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో జయశంకర్ పాత్ర అపూర్వమని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ, జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా సమాజ అభివృద్ధి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం కృషి కొనసాగించాలని నేతలు పిలుపునిచ్చారు. జయశంకర్ ఆలోచనలు, విలువలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, రవి రెటినేని, కార్యదర్శి (ఐటీ, మీడియా & పీఆర్) రవి ప్రదీప్ పులుసు, సురేష్ బుడగం, నాగరాజు, సత్య పింగిలి, రాకేష్ పటేల్, తేజ, శ్రీ లక్ష్మి, వికాస్ తదితరులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.